ఏఐతో కాలమంతా మనిషి చేతిలోనే !
ఏఐ ఇపుడు ప్రపంచాన్ని శోధిస్తున్న అతి పెద్ద టెక్నాలజీ. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్. తెలుగులో కృత్రిమ మేధ.
By: Satya P | 23 Feb 2026 12:00 AM ISTఏఐ ఇపుడు ప్రపంచాన్ని శోధిస్తున్న అతి పెద్ద టెక్నాలజీ. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్. తెలుగులో కృత్రిమ మేధ. అంటే మనిషి తానుగా తగ్గి టెక్నాలజీకి పని అప్పగించడం. మనిషి అంటే ఎన్నో ఉంటాయి. ఓపిక ఉండాలి, రోజుకు ఎంత కష్టపడినా ఎనిమిది గంటలకు మించి చేయలేడు. పైగా మిగిలిన దాంటో నిద్ర, ఫ్యామిలీ ఇలా అన్నీ చూసుకోవాలి. మనిషికి ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. మరెన్నో బంధాలు ఉంటాయి. అదే ఏఐ అయితే అది టెక్నాలజీ. దానికి ఇవేమీ ఉండవు. 24 గంటలూ పనిచేస్తుంది. రోజుల తరబడి చేస్తుంది. సెలవు అన్న మాట ఉండదు, విసుగూ విరామం అన్నది అంతకంటే ఉండదు. ఇదీ క్లుప్తంగా చెప్పుకోవాలీ అంటే ఏఐకి మనిషికీ మధ్య తేడా.
అన్నీ పనులూ చేస్తుందా :
ఏఐ అన్నది ఒక బ్రహ్మ పదార్థం గానే ఈ రోజుకీ ఉంది. ఢిల్లీలో భారత మండపంలో ఏఐ ఇంపాక్ట్ మీద నిర్వహించిన ప్రపంచ స్థాయి సదస్సులో పాల్గొన్న మేధావులు ఆలోచనాపరులు చెప్పినది ఏంటి అంటే ఏఐ తో సవాళ్ళు ఉంటాయని. ఇది అంతా ఏకీభవించిన విషయం. ఇక ఏఐ వల్ల మానవ అవసరాలు పూర్తిగా తగ్గిపోతాయని కూడా బాంబు పేల్చారు. అదే విధంగా వంద మంది చేసే పని ఒక్క ఏఐ చేస్తుంది అంటే ఆ కాడికి వంద మందికి ఉపాధి పోయినట్లే అని అంటున్నారు. పైగా కారు చౌకగా చేస్తుంది. మనిషి అయితే నసుగుతాడు, డబ్బులు ఎక్కువ కావాలంటాడు, ఓవర్ డ్యూటీ అయితే రెట్టింపు కోరుకుంటాడు. కానీ ఏఐకి అవేమీ లేదు, బుద్ధిగా చెప్పింది వింటుంది. బండెడు చాకిరీ తానే చేస్తుంది. సో అలా మనిషిని వంద రెట్లు మించి ఏఐ టెక్నాలజీ చేసినపుడు ఉద్యోగాలు ఎందుకు ఉంటాయి. ఇది మౌలికమైన కీలకమైన ప్రశ్నగా ముందుకు వస్తోంది.
ఇవన్నీ ప్రభావితాలే :
ఈ ప్రపంచంలో ఏమి జరిగినా అన్నీ ప్రభావితం అవుతాయి. అలా ఏఐ వల్ల అనేక రంగాలు ప్రభావితం అవుతాయని అంటున్నారు. అదే సమయంలో ఏఐ వల్ల మేలు జరుగుతుంది అని చెబుతున్న వారూ ఉన్నారు. ఒక ప్రోడక్ట్ ధర ఈ రోజున అధికంగా ఉంటోంది అంటే దానికి కారణం ఉత్పత్తి ఖర్చులు పెరగడం. మరి ఏఐ ఎంట్రీ ఇచ్చాక ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయి అని అంటున్నారు. అపుడు ఆ ప్రోడక్ట్ తక్కువ ధరకే వస్తుంది అన్నది కూడా అంటున్నారు. అలా మానవ జీవితావసరాలు అన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా తక్కువ ధరకే వస్తాయి. ఒక విధంగా చెప్పాలీ అంటే ఈ భూమి మీద ఎవరూ ఎన్నడూ చూడనంత ఉత్పత్తి జరుగుతుంది. మరి అంతలా ఉత్పత్తి పెరిగినపుడు ఆటోమేటిక్ గానే రేటు కూడా తగ్గుతుంది అన్నది ఒక థియరీ. ఇది ప్రస్తుతానికి ఊహాగానం. ఆచరణలో చూడాల్సి ఉంది.
ఖాళీ అయిపోతాడు :
అసలు మనిషి జీవితం ఏమిటి అన్న ప్రశ్న ఇపుడు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి. అవన్నీ కూడా ఆకలికి పొట్ట నింపుకుంటున్నాయి. దాని కోసం అవి శ్రమ పడుతున్నాయి. మిగిలిన సమయం అంతా అవి నిజమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాయి. కానీ మనిషి మాత్రం ఆ అవకాశాన్ని తానుగా కోల్పోయాడు. బతికేందుకు పని అన్నది పోయి డబ్బులు పెంచుకోవడం సంపదను సృష్టించుకోవడం అన్న లక్ష్యాలను పెట్టుకుని జీవితాంతం ఆ పరుగు పందెంలో పడి అసలు జీవితాన్ని పూర్తిగా లేకుండా చేసుకున్నాడు. ఇపుడు ఏఐ పుణ్యమాని మనిషి తాను ఎందుకు పుట్టాడో అన్నది ఆలోచించి జీవితం మీద ఎక్కువ ఆలోచిస్తూ ఒక విధంగా రియల్ లైఫ్ లో జీవిస్తాడు అని చెబుతున్న వారూ ఉన్నారు.
కాలాన్ని అందంగా మలచుకుని :
భవిష్యత్తులో మనిషి పెద్దగా చేసేందుకు పని ఉండదు, అన్నీ ఏఐ చేస్తుంది. ఇంటా బయటా అన్ని పనులు అదే చేస్తే మనిషి పూర్తిగా ఖాళీ అవుతాడు. ఇపుడు చేస్తున్న పనులలో పదవ శాతం మాత్రమే మిగులుతుంది. అంటే పరిమితమైన పని అన్న మాట. అంటే రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు కష్టపడుతున్న వారు అంతా కేవలం గంట మహా అయితే రెండు గంటల మించి పనిచేయాల్సిన అవసరమే ఉండదు అన్న మాట. అలా అయితే మిగిలిన కాలం ఎలా అన్నదే ప్రశ్న. ఆ కాలాన్ని అందంగా మలచుకుని జీవించడమే అని చెబుతున్నారు.
ఆదాయం ఎలా :
ఇది కదా అసలైన పాయింట్. అన్ని పనులూ పోతే మనిషికి ఆదాయం ఎలా అన్నది ప్రశ్న. అయితే ఒకపుడు మనిషి వ్యవసాయం చేసి దానిని అందరితో పంచుకునేవాడు. ధనం అన్నది లేదు అక్కడ. అలాగే మరొకరు ఇంకోపని చేసి సాయం చేసేవారు. ఇలా మొదట్లో ఉచితంగానూ లేదా వస్తు మార్పిడి విధానంగానూ సమాజంలో సేవలు కానీ ఉత్పత్తులు కానీ అందేవి. ఇపుడు మళ్ళీ ఆ రోజులకు వెళ్తారా అన్నది కూడా చర్చగా ఉంది. ఎందుకంటే వ్యవసాయం కూడా ఏఐ చేస్తుంది. దీంతో ఆహార ధాన్యాలకు కొరత లేదు, ఇతరత్రా వస్తువులకు లోటు ఉండదు,
అట్టు తిరగేసినట్లుగా :
అపుడు మనిషి పరిమితంగా సంపాదించుకుంటూ ఎక్కువగా జీవితాన్ని ఎంజాయి చేస్తూ ముందుకు సాగుతారు అని అంటున్న వారూ ఉన్నారు. 2050 నాటికి మనుషులు కూడా పక్షులుగా ఇతర జీవ రాశులుగా ప్రకృతిలో భాగమై మమేకమై జీవిస్తారు అని అంటున్నారు. అంటే ఉద్యోగాలు బాధలు ఇబ్బందులు ప్రమోషన్లు బాదరా బంధీలు అన్నవి ఉండవు. ఏఐకి అసిస్టెంట్ గా మారి అతి తక్కువ పని చేస్తూ ఎక్కువ జీవితాన్ని అందుకుంటూ సంతోషంగా కాలన్ని ఖర్చు చేసే రోజులు రాబోతున్నాయా అంటే అవును అంటున్నారు. ఇవన్నీ ఊహాగానాలే. ఎవరికి తోచిన తీరున ఆలోచనలే. ఏది ఏమైనా ఏఐ ప్రభావం మాత్రం మానవ జీవితాన్ని ప్రస్తుతం ఉన్న విధంగా ఉంచదని స్పష్టంగా చెబుతున్నారు. అట్టు తిరగేసినట్లుగా మొత్తం ప్రపంచ గతినే మార్చేస్తుంది అన్నది వాస్తవం.
