కాలం ఎవరిని గుర్తుంచుకోదు
కాలానికి జాలి లేదు, దయ అంతకంటే లేదు, ఎవరి మీద అభిమానం కానీ మమకారం కానీ అసలు లేనే లేదు. కాలం అన్నది ఒక ప్రవాహం.
By: Satya P | 22 Nov 2025 10:38 PM ISTకాలానికి జాలి లేదు, దయ అంతకంటే లేదు, ఎవరి మీద అభిమానం కానీ మమకారం కానీ అసలు లేనే లేదు. కాలం అన్నది ఒక ప్రవాహం. అది నిరంతరం ముందుకే వేగంగా ప్రవహిస్తుంది. వెనక్కి చూడడం దాని నైజం కాదు, అందువల్ల కాల ప్రవాహంలో చిన్న అల లాంటి మానవ జీవితంలో ఏ ఒక్క అల అయినా కాసింత తన ఉనికిని చాటుకున్నా కాలం ముందు అది అతి పరిమితం. అలాగే కాలాన్ని అనంతంగా చెబుతారు దానికి అతి తక్కువ మానవ జీవితంలో ఎవరో ఎక్కడో సాధించిన విషయాలను వాటి విజయాలను లిఖించి నిక్షిప్తం చేయడానికి తీరిక కానీ ఓపిక కానీ ఆసక్తి కానీ అసలు ఉండదు.
కఠిన పదఘట్టనలతో :
కాల పురుషుడు తన బలమైన పద ఘట్టనలతో వడివడిగా దాటుకుంటూ ముందుకు పోతాడు. ఆయన కాళ్ళ కింద నలిగే జీవితాలలో అధ్బుతాలు సంభవించవచ్చు, భ్రష్టత్వాలు జరగచ్చు. కానీ కాలపురుషుడికి ఇవేమీ అసలు పట్టవు. అంతే కాదు ఏ వివక్ష ఏ మాత్రం లేదు. అల మీద తన గీత గీసి తానే గ్రేట్ అని ఎవరైనా భ్రమించుకున్నా దానికి కాలానికి సంబంధం లేదు. అది అలా చెరిగి చెదిరిపోతోంది. అలా ఎవరి జ్ఞాపకాలు అయినా ఎవరి ఘనకార్యాలు అయినా కాలగర్భంలో చాలా నిశ్శబ్దంగా కరిగిపోక తప్పదు.
కాలతీతం లేదు :
కాలాన్ని జయించిన వారు కానీ దానికి అతీతమైన వారు కానీ ఈ భౌగోళిక ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరూ లేరు అందుకే ఎవరి కీర్తి అయినా ఒక తరం రెండు తరాలకే పరిమితం మూడవ తరానికి వారు ఎవరో కనీసంగా తెలిసే అవకాశం లేదు. నిజంగా అలా తెలిసే మాట ఉంటే కాలం క్యాలెండర్ ఏనాడో ఈ చరిత్రలతో నిండా నిండిపోయి బరువెక్కిపోయి కాలం కదలకుండా ఏదో మూలన ఆగిపోక తప్పదు. అందుకే కాలం చూపు ముందుకే ఆ దుందుడుకే ఆ దూకుడే కాలానికి సహజ ఆభరణాలు. అవే మానవ జీవితం ఎంత అల్పమో స్పష్టంగా చాటి చెబుతూంటాయి.
కీర్తి ఒక బుడగ :
ఎవరి కీర్తి అయినా ఒక నీటి బుడగ. అది కాలానికి ఎంతో బాగా తెలుసు తానే గొప్ప అని ఎవరు మురిసినా అది ఒక యాభై వందేళ్ళ సంబరమే తప్ప మరేమీ కాదు, ఆ మీదట వేరొకరు వస్తారు, వారిదీ ఇదే తీరు. ఇవన్నీ చూసి సన్నగా నవ్వుకుంటూ కాలపురుషుడు తన పని తాను చేసుకుంటూ పోతాడు. అందుకే ఎవరైనా తాము ఎంతటి వారు అయినా తమ పని తాము చేశామని తమకు వచ్చిన అవకాశాలను తమకు ఇచ్చిన అతి తక్కువ కాల పరిమితిలో పూర్తి చేశామని సంతృప్తి చెందడమే ఉత్తమం.
భ్రమల ప్రపంచంలో బతికేస్తూ :
అంతే కాదు తాము సృష్టించుకున్న భ్రమల ప్రపంచంలో బతికేస్తూ తమకు సరి సాటి పోటీ ఎవరూ లేరని గర్వంగా భావిస్తూ కనుక ఉంటే వారి కధ కూడా కాలం చూసుకుంటుంది. కాలానికి గేలం వేసేవారు ఎవరూ పుట్టలేదు, కాలాన్ని కొలిచే వారు కానీ నిలదీసి నిలువరించేవారు కానీ ఇప్పటికి ఎవరూ లేరని కూడా తెలుసుకుంటే మనిషి తాను ఏంటో ఇంకా బాగా అర్థం చేసుకోగలుతాడు. ఎవరెన్ని చేసినా ఎంతలా విర్రవీగినా కాలం గీసిన గిరిలో మాత్రమే అన్నది మరచిపోరాదు. ఈ గుడుగుడు గుంచం ఆట అంతా కాలం చేసే మ్యాజిక్ అని తెలుసుకుంటే ఇంకా మంచిది. సో రాజా ది గ్రేట్ అని ఎంతలా కాలరెగరేసినా కాలం దెబ్బకు అంతా మటాష్.
