భారత్ లో అత్యంత ఖరీదైన కార్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇదే!
ఇందులో భాగంగా... శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకూ బిడ్డర్లు తమకు నచ్చిన నంబర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
By: Raja Ch | 26 Nov 2025 10:32 PM ISTకొంతమందికి కార్లపై అమితమైన ఇష్టం ఉంటే.. మరి కొందరికి మాత్రం వాటి రిజిస్ట్రేషన్ నెంబర్ పై మోజు ఉంటుంటుంది. అది వీలైనంత ఫ్యాన్సీగా ఉండాలని.. ఉన్న నాలుగు నెంబర్లూ ఒకేలా ఉండాలని.. టోటల్ 9 రావాలని, 7 రావాలని, 3 రావాలని ఇలా రకరకాల కోరికలతో ఉంటుంటారు. ఈ క్రమంలో తాజాగా అత్యంత ఖరీదైన కారు రిజిస్ట్రేషన్ నంబర్ వ్యవహారం తెరపైకి వచ్చింది.
అవును... కొంతమందికి కార్ల రిజిస్ట్రేషన్ నంబర్స్ విషయంలో చాలా పట్టింపు ఉంటుంటుంది. అది ఎంతలా అంటే... ఆ కారు ధర కంటే దాని రిజిస్ట్రేషన్ ధర ఎక్కువగా ఉండేటంతగా! ఈ క్రమంలో తాజాగా వీఐపీ లేదా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల కోసం వారానికోసారి హర్యానాలో ఆన్ లైన్ వేలం జరుగుతుండగా... ఈ సారి రికార్డ్ స్థాయిలో కోటిపైనే ఓ నంబర్ పలికింది.
ఇందులో భాగంగా... శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకూ బిడ్డర్లు తమకు నచ్చిన నంబర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత బుధవారం సాయంత్రం 5 గంటలకు ఫలితాలు ప్రకటించే వరకు బిడ్డింగ్ ప్రారంభమవుతుంది. ఈ వేలం వ్యవహారం పూర్తిగా ఆన్ లైన్ లో ప్రభుత్వ పోర్టల్ లో అధికారికంగా జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఈ వారం బిడ్డింగ్ కోసం వచ్చిన అన్ని నంబర్లలోనూ హెచ్.ఆర్.88బీ8888 అనే నంబర్ కు అత్యధికంగా 45 దరఖాస్తులు వచ్చాయి. ఈ నంబర్ బేస్ బిడ్డింగ్ ధరను రూ.50వేలుగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మధ్యానం 12 గంటలకు బిడ్డింగ్ ధర రూ.88 లక్షలుగా ఉండగా... ఇది ప్రతి నిమిషం పెరుగుతూ సాయంత్రం 5 గంటలకు రూ.1.17 కోట్ల వద్ద స్థిరపడింది.
ఈ నంబర్ ప్లేట్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో "బి" అనే అక్షరాన్ని ఇంగ్లిష్ క్యాపిటల్ లెటర్ లో పరిగణలోకి తీసుకుంటే... మొత్తం ఇది 8 అంకెల సిరీస్ (HR88B8888) లా కనిపిస్తుంది. అంటే వరుసగా... 8 అంకె ఏడు సార్లు కనిపిస్తుందన్నమాట. ఇక గత వారం హెచ్.ఆర్.22డబ్ల్యూ222 అనే రిజిస్ట్రేషన్ నంబర్ రూ.37.91 లక్షలు పలికింది.
కాగా... ఈ ఏడాది ఏప్రిల్ లో కేరళకు చెందిన టెక్ బిలియనీర్ వేణు గోపాలకృష్ణన్ తన లాంబోర్గిని ఉరుస్ కోసం "కేఎల్07డీజీ0007" అనే నంబర్ ను రూ.45.99 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నంబర్ కోసం తొలుత బిడ్డింగ్ రూ.25 వేల వద్ద ప్రారంభమవ్వగా.. ఫైనల్ గా రూ.45.99 లక్షల దగ్గర ఆగింది.
