విజయ్ బిగ్ మిస్టేక్... అందుకే టీవీకే షేక్ !
విజయ్ తన పార్టీగా కాకుండా కూటమిగా వెళ్ళి గవర్నర్ ని కలవడం వల్లనే ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు.
By: Satya P | 9 May 2026 9:05 AM ISTవిజయ్ వెండి తెర మీద సూపర్ స్టార్ కావచ్చు. రాజకీయాల్లో మాత్రం ఇంకా వర్ధమానుడు. అందుకే ఆయన తన పార్టీ విషయంలో సీనియర్ల సలహాల సూచనలు విని ఉండాల్సింది అని అంటున్నారు. విజయ్ కి రాజకీయ అనుభవం లేకపోవడంతో పాటు టీవీకేలోని సీనియర్ నేతల మాటలను పెడ చెవిన పెట్టడం వల్లనే ఈ కష్టాలు వస్తున్నాయని అంటున్నారు. నిజానికి విజయ్ కోరి మరీ తన పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయగల అవకాశాలను పోగొట్టుకుంటున్నారని అంటున్నారు.
కాంగ్రెస్ తో అంటకాగి :
విజయ్ పార్టీ సొంతంగా 108 సీట్లు గెలిచింది. అలా గెలిచిన వెంటనే విజయ్ చేయాల్సిన పని ఏంటి అంటే గవర్నర్ ని కలవడం, తన పార్టీ అతి పెద్ద నంబర్ తో ఉందని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిం చమని. అలా చేసి ఉంటే ఈపాటికి విజయ్ సీఎం అయిపోయి ఉండేవారు. కానీ అక్కడే విజయ్ బిగ్ మిస్టేక్ చేశారు అని అంటున్నారు. విజయ్ రాజకీయ అనుభవం లేమితో కాంగ్రెస్ ని మద్దతు కోరారు. ఆ పార్టీ వారు వెంటనే మద్దతు ప్రకటించారు. అలా టీవీకే పార్టీ కాస్తా కూటమిగా మారింది. కూటమిగా మారిన తరువాత ఏకైక పెద్ద పార్టీగా క్లెయిం చేసుకునే చాన్సే లేదు. మొత్తం మద్దతు పార్టీల లేఖలు సమర్పించాల్సిందే. ఆందుకే గవర్నర్ రాజేంద్ర పదే పదే మద్దతు లేఖలు అడుగుతున్నారు. మరి ఇది విజయ్ స్వయంగా చేసుకున్నదే కదా అని అంటున్నారు.
పెడ చెవిన పెట్టారు :
విజయ్ టీవీకేలో సీనియర్లు లేరు అని అంటున్నారు. కానీ అది తప్పు అని చెబుతున్నారు. ఏకంగా తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎంజీఅర్ జయలలిత కాలం నుంచి అన్నా డీఎంకేలో పనిచేసి మంత్రిగా కూడా వ్యవహరించిన అత్యంత సీనియర్ నేత సెంగోట్టయన్ ఉన్నారు. ఆయన విజయ్ కి మొదటే కీలక సలహా ఇచ్చారు. ఏ పార్టీ కోసం చూడవద్దు మనకు వచ్చిన సీట్లతో నేరుగా గవర్నర్ వద్దకు వెళ్తే పెద్ద పార్టీగా పిలుస్తారు అని కూడా రాజ్యాంగ నియమాలను కూడా చెప్పారని అంటున్నారు. అలా కనుక విజయ్ చేసి ఉంటే గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయించి అసెంబ్లీలో మెజారిటీ పరీక్షకు సిద్ధం కమ్మనేవారు. కానీ ప్రభుత్వానికి ముందే కూటమి కట్టారు విజయ్. అందులో కూడా మ్యాజిక్ ఫిగర్ నంబర్ 118కి తక్కువ సీట్లు పడ్డాయి. దాంతోనే గవర్నర్ టెక్నికాలిటీస్ వల్లనే ఆహ్వానించడం లేదని అంటున్నారు.
కూటమి అంటేనే చిక్కులు :
విజయ్ తన పార్టీగా కాకుండా కూటమిగా వెళ్ళి గవర్నర్ ని కలవడం వల్లనే ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు. కూటమి పార్టీల అందరి లేఖలు ఆయన సిద్ధం చేసుకుని ఉంటే వేరేగా కధ ఉండేది. కానీ మ్యాజిక్ ఫిగర్ కి దూరంగా ఉంటూ అంది వచ్చిన కాంగ్రెస్ తో అంటకాగి ఆ పార్టీతో పొత్తు కోసం ఆరాటపడి చివరికి ఇంతకు ఇంతా చేసుకున్నారని అంటున్నారు. కూటమి అంటే కనుక ఆర్టికల్ 164 ప్రకారం మెజారిటీ మద్దతు ఉందనడానికి మద్దతు లేఖల ఆధారాలు చూపాలని గవర్నర్ కోరినట్లు చెబుతున్నారు.
బయట ప్రచారం వేరు :
అతి పెద్ద పార్టీని గవర్నర్ పిలవడం లేదని బయట అంతా అంటున్నారు కానీ విజయ్ ఒంటరిగా సొంతంగా వెళ్ళలేదు, కూటమి అని వెళ్ళారు అన్నది ఎవరికీ తెలియదు. సో 118 మందితో లేఖలు ఇస్తేనే విజయ్ ప్రభుత్వం సాకారం అవుతుంది. ఇపుడు చూస్తే కప్పలతక్కెడలా సీన్ ఉంది. ఒకరి మద్దతు అంటే మరొకరు నో అంటున్నారు. దాంతో విజయ్ కి అధికారం అలా ఊరిస్తూ పోతొంది అని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ అతి ఉత్సాహం విజయ్ రాజకీయ అనుభవ లేమి కాంగ్రెస్ రంగంలోకి దిగడంతో చెడిన డీఎంకే మిత్ర బంధం ఇవన్నీ కలసి వెరసి విజయ్ ని సీఎం కుర్చీలాటలో వెనక్కీ ముందుకీ లాగుతున్నాయని అంటున్నారు.
