Begin typing your search above and press return to search.

సంక్రాంతి స్పెషల్: భోగిపండ్లు పోయడం వెనుక ఆంతర్యం ఏమిటంటే?

ఇకపోతే రేగు పండ్లను తలమీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోవడమే కాకుండా నారాయణడి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు భావిస్తారు. తల పైభాగంలో బ్రహ్మారంధ్రం ఉంటుంది.

By:  Madhu Reddy   |   9 Jan 2026 11:00 AM IST
సంక్రాంతి స్పెషల్: భోగిపండ్లు పోయడం వెనుక ఆంతర్యం ఏమిటంటే?
X

తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మనం మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటాము. అయితే తొలిరోజు అనగా మకర సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే భోగి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయణంలో పడ్డ కష్టాలు, బాధలను భోగిమంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి, రాబోయే ఉత్తరాయన కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని శ్రీమన్నారాయణుడిని కోరుకోవడమే ఈ భోగి పండుగ యొక్క విశిష్టత.

అయితే ఈ భోగి పండుగ రోజున ప్రత్యేకించి పిల్లల తలపై భోగి పళ్ళు పేరుతో రేగు పండ్లను పోస్తారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అయితే ఈ భోగి పండ్లను పిల్లల తలపై పోయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి ? అనే విషయానికి వస్తే అటు శాస్త్రీయంగా ఇటు సైన్స్ పరంగా కొన్ని విషయాలు తెరపై వినిపిస్తున్నాయి..

ఇకపోతే రేగు పండ్లను తలమీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోవడమే కాకుండా నారాయణడి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు భావిస్తారు. తల పైభాగంలో బ్రహ్మారంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లలలో జ్ఞానం పెరుగుతుంది. ఈ భోగి పండ్లలో భాగంగా రేగు పండ్లు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు , చెరుకు గడలు కలిపి పోస్తారు.

అయితే ఇక్కడ పర్యావరణ పరిరక్షణ అంశం కూడా మనకు కనిపిస్తుంది. అదెలా అంటే చెరుకు, పూలు, పండ్లు ఇవన్నీ ప్రకృతికి సంకేతం. ముఖ్యంగా వీటిని తలపై పోయడం అంటే ప్రకృతిని నెత్తిన పెట్టుకోండి అని ఒక సూచన ఇవ్వడం లాంటిది.. ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ఈ పూలు, పండ్ల మిశ్రమాన్ని తలపై పోయడం వల్ల పిల్లల జీవితాలకు రక్షణ కలుగుతుంది.

ముఖ్యంగా చెడు ప్రభావం తొలగిపోయి, అభివృద్ధి జరుగుతుంది. ప్రకృతిని, భోగాలన్నీ రక్షించడం వల్లే మనకు రక్షణ ఉంటుంది అనేది అంతరార్థం. అంతేకాదు ఈ భోగి పండ్లలో ఉపయోగించే రేగుపండ్లు, పూలు, డబ్బు , చెరకు.. బుద్ధి, మనసు, అహంకార చిత్తాలకు సంకేతాలు.. వీటి మాయలో పడ్డ మనం ఆత్మ అనే విషయాన్ని మరిచిపోయి శరీరం కోసం తపన పడుతూ అహంకారంతో జీవిస్తున్న నేపథ్యంలో.. తలపై పోసిన పండ్లు క్రిందకు జారిపోయినట్టుగా మనలో ఏర్పడిన అహంకారం జారిపోవాలని కూడా ఈ భోగి పండ్లు పోస్తారు.

ఇకపోతే ఈసారి ఈ భోగి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి? భోగిపండ్లను పిల్లల తలపై ఏ సమయంలో పోయాలి? ఎలా పోయాలి? అనే విషయాలను కూడా పండితులు చెబుతున్నారు.

జనవరి 14వ తేదీన భోగి పండుగ జరుపుకోవాలట. ఆరోజు రాత్రి 8 గంటల సమయంలో మకర సంక్రమణం జరుగుతున్న కారణంగానే ఆరోజు భోగి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఆరోజు 10 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లల తలపై భోగి పండ్లు పోయాలని చెబుతున్నారు. భోగి పండుగ రోజు సూర్యాస్తమయం లోపు అంటే సాయంత్రం 5:00 గంటల నుండి 5:30 నిమిషాల లోపు పిల్లలను నట్టింట్లో పీఠం వేసి కూర్చోబెట్టి.. వారి నుదుట బొట్టు పెట్టి.. ఒక పాత్రలో రేగుపండ్లు, చిల్లర నాణేలు, బంతిపూల రెక్కలు, చెరుకు గడలు అన్నింటినీ కలిపి రెండు చేతుల గుప్పెళ్లలో పట్టుకొని.. సవ్య దిశలో మూడుమార్లు.. అపసవ్య దిశలో మూడుమార్లు పిల్లలకు దిష్టిలాగా తీసి, వారి తలపై 3 మార్లు తిప్పి ఆఖరికి వారి తలపై వాటిని పోయాలి. అనంతరం మంగళ హారతి ఇచ్చి పెద్దల ఆశీర్వాదం ఇప్పించాలి. ఇలా చేస్తే పిల్లలపై ఉన్న చెడు దృష్టి పోవడమే కాకుండా వారు భోగభాగ్యాలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు.