బ్యాంకులను కొల్లగొడుతున్న పెద్దోళ్ళు....ఆర్ధిక సంక్షోభంలో దేశం
దేశంలో అతి పెద్ద స్కాం 2008లో జరిగింది. టూజీ స్పెక్ట్రం స్కాం. ఈ స్కాంలో ఏకంగా ఒక లక్షా 76వేల కోట్ల మేర కుంభకోణం జరిగింది.
By: Satya P | 25 Nov 2025 4:00 AM ISTబ్యాంకులు ఉన్నవి పేదలకు రుణాలు ఇవ్వడానికి. రైతులకు ఆసరాగా ఉండడానికి, ఇక వ్యాపారాలు చేసుకుంటామని చెప్పి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వారికి కూడా ఇవ్వవచ్చు. కానీ అన్ని రకాలైన లెక్కలు పూచీకత్తులు చూసుకుని ఇస్తున్నారా లేదా అన్నదే కీలక పాయింట్. కానీ ఈ దేశంలో బ్యాంకులను అడ్డగోలుగా లూటీ చేస్తూ రాజకీయ పరపతితో పలుకుబడితో ఆర్థిక వ్యవస్థనే సంక్షోభంలో నెడుతున్నారు పెద్దోళ్ళు. ఫలితంగా బ్యాంకులు కునారిల్లుతున్నాయి కొండలా నిరర్ధక ఆస్తులు పేరుకుని పోతున్నాయి. దాంతో దివాళా దిశగా బ్యాంకులు సాగుతున్నాయి.
ఎవరి సొమ్ము ఎవరికి :
పేదలు మధ్యతరగతి వర్గాలు బ్యాంకులలో తమ సొమ్ము పొదుపు చేసుకుంటున్నారు. వీరు ఈ దేశంలో నూటికి ఎనభై శాతానికి పైగా ఉన్నారు. అయితే చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లుగా వీరు దాచుకున్న సొమ్ముని రుణాల పేరుతో బడా బాబులు కాజేస్తున్నారు. ఒక్కసారి బ్యాంక్ రుణం తీసుకుని సకాలంలో వాటిని చెల్లించకుండా డిఫాల్టర్లుగా ఉన్నా వారి మీద ఏ రకమైన చర్యలూ లేవు. దాంతో ఇదే పనిగా దర్జాగా బ్యాంకులను దోచేస్తున్నారు. దీంతో ఎవరి సొమ్ము ఎవరికి పోతోంది అన్న చర్చ వస్తోంది. అంతే కాదు పెద్దలంతా బ్యాంకులను దోచేస్తూంటే దేశంలో ఆర్ధిక సంక్షోభం అధికం అవుతూంటే దానికి భరిస్తున్నది తిరిగి పన్నుల రూపంలో చెల్లిస్తూ ఈ పాపన్ని అంతా మోస్తున్నాది కూడా ఎవరు అంటే అదే నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలు.
ఆనాటి నుంచే :
ఇక ఈ దేశంలో బ్యాంకులలో రుణాల ఎగవేత నేరాలు ఘోరాలు అన్నవి 1960 దశకం నుంచే మొదలైంది అని అంటున్నారు. అప్పట్లో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కోపరేటివ్ బ్యాంకులలో ఆర్ధిక నేరాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే అవి పరిమితంగానే ఉండేవి. అయితే 1969లో బ్యాంకులను జాతీయకరణ చేయడంతో ఆర్ధిక నేరాలు ఒక్కసారిగా రెక్కలు విప్పుకున్నాయి. రాజకీయ ఆర్థిక బంధాలు అన్నీ పెనవేసుకుని బ్యాంకింగ్ నేరాలకు ఆస్కారం కల్పించాయి. ఏ రకమైన నియంత్రణ లేకపోవడం రాజకీయ పలుకుబడి అధికం కావడంతో ఒక చిన్న ఫోన్ కాల్ తోనే ఏ పత్రాలు హామీలూ లేకుండా బడా బాబులు వేల కోట్ల రుణాలను బ్యాంకుల నుంచి చాలా సులువుగా పొందే పరిస్థితి దాపురించింది.
భారీ కుంభకోణాలు :
ఇక బ్యాంకింగ్ రంగంలో కుంభకోణాలతో పాటు ఆర్థిక నేరాలు పెద్ద ఎత్తున మొదలైంది 80 దశకంలో అని చెప్పాల్సి ఉంది. అప్పట్లో బోఫోర్స్ కుంభకోణం అన్నది అతి పెద్ద సంచలనం అయింది. ఆ తరువాత 1990 దశకంలో హర్షద్ మెహతా స్టాక్ మారెక్ట్ స్కాం అతి పెద్ద కుదుపుగా మారింది అని చెప్పాల్సి ఉంది. ఈ కుంభకోణం డైరెక్ట్ గానే బ్యాంకింగ్ వ్యవస్థను పూర్తిగా అతలాకుతలం చేసింది. ఈ కుంభకోణంలో బ్యాంకులలో ప్రజలు దాచుకున్న నాలుగు వేల కోట్ల రూపాయల మొత్తాన్ని తీసుకుని స్టాక్ మార్కెట్ కోసం వాడారు. స్టాక్ మార్కెట్ బ్రోకర్ గా ఉన్న హర్షద్ మెహతా ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా ఉన్నారు.
భారీ కుంభకోణాలలో :
దేశంలో అతి పెద్ద స్కాం 2008లో జరిగింది. టూజీ స్పెక్ట్రం స్కాం. ఈ స్కాంలో ఏకంగా ఒక లక్షా 76వేల కోట్ల మేర కుంభకోణం జరిగింది. అతి తక్కువ ధరలకు స్పెక్ట్రం లైసెన్సులను కేటాయించి ప్రభుత్వానికి ఆదాయం గండి పెట్టిన స్కాం గా దీనిని చెబుతారు. కాగ్ రిపోర్టులే ఇంత పెద్ద నష్టం ప్రభుత్వానికి జరిగిందని వెల్లడించాయి. ఈ స్కాం లో 700 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. స్కాం చేసిన వారు ఎవరికీ శిక్షలు పడలేదు. నేతలే ఆర్ధిక నేరస్థులు కావడం చట్టం డబ్బున్న వారికి చుట్టం ఎలా అయిందో తెలుస్తుంది.
బొగ్గు స్కాం లో :
ఏ మాత్రం పారదర్శకత లేకుండా 194 బొగ్గు గనుల కేటాయింపులు ప్రైవేట్ కంపెనీలకు కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి 1 కోటీ 86 లక్షల కోట్ల నష్టం చేశారు అని తేలింది. అలాగే 2010లో ఢిల్లీలో జరిగిన కామన్ వెల్త్ గేంస్ కుంభకోణంలో ప్రభుత్వానికి 70 వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. కింగ్ ఫిషర్ ఎయిర్ ల్యాండ్ కి సంబంధించి విజయమాల్య ఏకంగా తొమ్మిది వేల కోట్ల రుణాన్ని బ్యాంకులకు చెల్లించకుండా విదేశాలలు పారిపోయాడు. ఇవి నిరర్ధక ఆస్తులుగా మారాయి అంటే ఆశ్చర్యమే. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం వల్ల 13 వేలకు పైగా నష్టం వాటిల్లింది. తెల్గీ స్కాం పేపర్ స్కాం 2003లో చోటు చేసుకున్న ఘటనలుగా ఉన్నాయి. ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం చూస్తే బ్యాంకుల మోసాల విలువ 36 వేల కోట్లలో ఉంది.
వారే డిఫాల్టర్స్ :
బ్యాంకులకు ఎగనామం పెడుతున్న జాబితా చూస్తే కనుక ఎస్సార్ స్టీల్ ఇండియా 69,300 కోట్లు బ్యాంకులకు బకాయి ఎగ్గొట్టింది. వీడియోకాన్ ఇండస్ట్రీస్ 58 వేల 52 కోట్లు రుణాన్ని చెల్లించకుండా పక్కన పెట్టింది. రిలయెన్స్ కమ్యూనికేషన్స్ కూడా 46 659 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టింది. జై ప్రకాష్ అసోసియేట్స్ 36 వేల 591 కోట్ల బ్యాంక్ రుణాన్ని ఎగనామం పెట్టింది. ఇలా అనేక మంది బడా బాబులు బ్యాంకులకు ఎగ్గొడుతున్న రుణాలు వేల లక్షల కోట్లలో ఉన్నాయి. దీంతో బ్యాంకులు దివాళా తీస్తున్నాయి. వాటిని తిరిగి లేపే క్రమంలో ప్రజల మీదనే ఈ భారాలు పడుతున్నాయి. చట్టాలు బలహీనమైన చోట సామాన్యుడే ఈ తరహా ఆర్ధిక నేరాలకు తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు.
