Begin typing your search above and press return to search.

'త్వరలో'... ట్రంప్ ను ఆ విధంగా బెదిరిస్తున్న హుతీలు!

అవును... అమెరికా – ఇరాన్ ల మధ్య యుద్ధం ఏ క్షణంలో అయినా మొదలవ్వొచ్చనే చర్చలు గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   27 Jan 2026 10:23 AM IST
త్వరలో... ట్రంప్  ను ఆ విధంగా బెదిరిస్తున్న హుతీలు!
X

సాధారణంగా పలు ప్రపంచ దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో బెదిరిస్తుంటారు! ఇవి సుంకాల రూపంలో ఉండోచ్చు.. లేదా, జాతీయ భద్రత నేపథ్యంలో అనొచ్చు.. తమకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు కావొచ్చు! గత 12 నెలల ట్రంప్ పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్నో తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ను హుతీలు బెదిరిస్తున్నారు. తాజాగా ఓ వీడియోను విడుదల చేసి, అందులో మంటల్లో తగలబడిపోతున్న నౌకను చూపించారు. అందుకు కారణం అమెరికా యుద్ధ విమాన వాహక నౌక కదలడమే!

అవును... అమెరికా – ఇరాన్ ల మధ్య యుద్ధం ఏ క్షణంలో అయినా మొదలవ్వొచ్చనే చర్చలు గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా దాడి చేస్తే తాము అందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ చెబుతోంది. మరోవైపు పశ్చిమాసియాలోని ఇతర దేశాలతో పాటు ప్రధానంగా ఇజ్రాయెల్.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఈ సమయంలో ఇరాన్ కు గతంలో సహకరించిన హమాస్, హెజ్బొల్లా, హుతీలు రంగలోకి దిగొచ్చని అంటున్నారు. ఈ సమయంలో హుతీల నుంచి కన్ఫర్మేషన్ వచ్చేసింది.

పశ్చిమాసియాలో అమెరికా యుద్ధ వాహక నౌక!:

అమెరికాకు చెందిన 'యూ.ఎస్‌.ఎస్‌ అబ్రహం లింకన్‌' యుద్ధ విమాన వాహక నౌక.. తాజాగా పశ్చిమాసియాకు చేరుకుంది. దీంతో ఇరాన్‌ పై అమెరికా ఏ క్షణాన దాడి చేస్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇదే క్రమంలో... యూ.ఎస్‌.ఎస్‌ ఫ్రాంక్‌ ఈ పీటర్సన్‌ జూనియర్‌, యూ.ఎస్‌.ఎస్‌ స్ప్రూయాన్స్‌ డెస్ట్రాయర్లు, యూ.ఎస్‌.ఎస్‌ మిషెల్‌ మార్ఫీ కూడా అబ్రహాం లింకన్ తో పాటు ఇక్కడికి చేరుకున్నాయి. అమెరికాకు చెందిన సెంట్రల్‌ కమాండ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

పశ్చిమాసియాకు అమెరికా ఫైటర్‌ జెట్‌ లు!:

ఇదే సమయంలో... పలు ఫైటర్‌ జెట్‌ లు, మిలిటరీ కార్గో విమానాలను పశ్చిమాసియా ప్రాంతానికి అమెరికా తరలించనున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల ఇరాన్‌ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం.. వాటిలో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, ఆందోళనకారులకు మద్దతుగా నిలవడం.. వారికి వ్యతిరేకంగా ఇరాన్‌ ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే జోక్యం చేసుకుంటామని హెచ్చరించడం తెలిసిందే. ఈ క్రమంలో భారీగా తమ సైన్యాన్ని ఇరాన్‌ దిశగా పంపినట్లు ప్రకటించారు.

అమెరికాకు హూతీల పరోక్ష హెచ్చరిక!:

ఇరాన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల నేపథ్యంలో.. వాషింగ్టన్ - టెహ్రాన్ మధ్య వాతావారణం వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యూ.ఎస్‌.ఎస్‌ అబ్రహం లింకన్‌ పశ్చిమాసియాకు రావడం.. త్వరలో ఫైటర్ జెట్ లు రాబోతున్నాయని కథనాలు వస్తోన్న నేపథ్యంలో యెమెన్‌ తిరుగుబాటుదారులు కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా... ఎర్రసముద్రంలోకి వచ్చే నౌకలపై మళ్లీ దాడులు ప్రారంభిస్తామని హెచ్చరించారు.

ఈ సమయంలో... ఓ చిన్న వీడియోను విడుదల చేశారు. ఇందులో మంటల్లో ఉన్న ఓ నౌకను చూపించారు. దానికి "త్వరలో" అని ఓ వ్యాఖ్య జోడించారు. దీంతో... మళ్లీ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలకు కష్టకాలం తప్పదా అనే చర్చ మొదలైంది. కాగా... గాజా యుద్ధం సమయంలో హమాస్‌ కు అనుకూలంగా హూతీలు.. ఎర్ర సముద్రంలో వందకుపైగా వాణిజ్య నౌకలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. గాజా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత వీటిని ఆపేశారు.

తొలి నుంచీ ఇరాన్ మద్దతిస్తోన్న హుతీలు... అటు అమెరికా, ఇటు ఇజ్రాయేలు పై కారాలు మిరియాలు నూరుతుంటారు. ఈ నేపథ్యంలో.. ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధం మొదలైతే... వీరి ఎంట్రీపై ఆందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా... ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్‌ తమతో చర్చించాలనుకుంటే అందుకు అమెరికా సిద్ధంగా ఉందని యూఎస్ కి చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు! ఈ అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఇరాన్ దీన్ని ఉపయోగించుకుంటుందా.. లేక, యుద్ధానికి సై అంటుందా అనేది వేచి చూడాలి!