Begin typing your search above and press return to search.

యుద్ధంలోకి మరో దేశం.. ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడి

తాజాగా యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు నేరుగా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడికి దిగడం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

By:  A.N.Kumar   |   28 March 2026 12:21 PM IST
యుద్ధంలోకి మరో దేశం.. ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడి
X

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉధృతమవుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు క్రమంగా ప్రాంతీయ యుద్ధంగా మారుతోంది. తాజాగా యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు నేరుగా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడికి దిగడం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామం పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాలను ఒక్కసారిగా మార్చివేసింది.

పశ్చిమాసియాలో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న అస్థిరత ఇప్పుడు పరాకాష్టకు చేరుకుంది. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతుండగానే మరోవైపు లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బొల్లాతో పోరు సాగుతోంది. ఈ ఉద్రిక్తతల మధ్య యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటు దళాలు నేరుగా యుద్ధరంగంలోకి ప్రవేశించడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది.

ఏం జరిగింది?

తాజాగా యెమెన్ భూభాగం నుండి హౌతీలు ఒక శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్‌ను ఇజ్రాయెల్ లక్ష్యంగా ప్రయోగించారు. ఈ క్షిపణి ఇజ్రాయెల్ గగనతలానికి చేరుకోకముందే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తమ అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల ద్వారా దానిని గుర్తించాయి. ఇజ్రాయెల్ సెంట్రల్ రీజియన్‌లో సైరన్లు మోగడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ మిస్సైల్‌ను ఇజ్రాయెల్ గగనతలం వెలుపలే 'యారో' డిఫెన్స్ సిస్టమ్ సహాయంతో విజయవంతంగా అడ్డుకున్నట్లు సైనిక వర్గాలు ధృవీకరించాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని ఐడీఎఫ్ ప్రకటించింది.

హౌతీల హెచ్చరిక.. ఇరాన్ అండ

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తూ వచ్చారు. కానీ నేరుగా ఇజ్రాయెల్ భూభాగంపై క్షిపణి ప్రయోగించడం ఇదే మొదటిసారి. "పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ ఏవైనా చర్యలు చేపడితే మేము కూడా పూర్తిస్థాయి యుద్ధంలో భాగస్వామ్యం అవుతాము" అని హౌతీలు నిన్ననే స్పష్టం చేశారు. ఆ హెచ్చరిక చేసిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. హౌతీలు కేవలం యెమెన్ తిరుగుబాటుదారులు మాత్రమే కాదు.. వారు ఇరాన్ నేతృత్వంలోని 'రెసిస్టెన్స్ యాక్సిస్' లో కీలక భాగస్వాములు. ఇరాన్ మద్దతుతో వీరు అత్యాధునిక డ్రోన్లు, మిస్సైళ్లను సమకూర్చుకుంటున్నారు.

వ్యాపిస్తున్న యుద్ధ మేఘాలు

పశ్చిమాసియాలో ఇప్పుడు బహుముఖ యుద్ధం నడుస్తోంది. దక్షిణాన గాజాలో హమాస్‌తో పోరు... ఉత్తరాన లెబనాన్ నుండి హెజ్బొల్లా రాకెట్ దాడులు... తూర్పున ఇరాన్ , సిరియా నుండి ముప్పు.. ఇప్పుడు దక్షిణాన దూర తీరాల నుండి యెమెన్ హౌతీల మిస్సైల్ దాడులతో ఇలా ఇజ్రాయెల్ కు శత్రువులు పెరిగిపోయారు. ఈ పరిణామాలు కేవలం ఇజ్రాయెల్ భద్రతకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఎర్ర సముద్రం గుండా జరిగే వాణిజ్యానికి కూడా పెద్ద సవాల్‌గా మారాయి.

అంతర్జాతీయ స్పందన

హౌతీల చర్యను అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. యుద్ధం మరింత విస్తరించకుండా ఉండాలంటే ఇరాన్ తన అనుబంధ సంస్థలను నియంత్రించాల్సిన అవసరం ఉందని పలు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా సంయమనం పాటించాలని అన్ని పక్షాలను కోరుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే శాంతి చర్చలకు తావు లేకుండా పోయింది.

యెమెన్ హౌతీల ఈ తాజా దాడి పశ్చిమాసియా యుద్ధాన్ని ఒక అనిశ్చిత దశలోకి నెట్టింది. ఇది కేవలం ప్రాంతీయ పోరుగా మిగిలిపోతుందా లేదా ప్రపంచ దేశాలను ఇందులో లాగుతుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అమెరికా తన యుద్ధ నౌకలను ఇప్పటికే ఈ ప్రాంతానికి తరలించడం వల్ల రాబోయే రోజుల్లో ప్రతిదాడులు జరిగే అవకాశం మెండుగా ఉంది.