Begin typing your search above and press return to search.

కడుపుకు తినేది తక్కువే కానీ... వర్కింగ్ పేపర్ లో కీలక విషయాలు!

ఈ సర్వే విశ్లేషణ ప్రకారం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మన్నికైన వస్తువులపై ఖర్చు చేసే నెలవారీ తలసరి వ్యయం వాటా పెరిగింది.. అదే విధంగాగా అనేక రాష్ట్రాల్లో పట్టణ గృహాల కంటే గ్రామీణ వాటాలో స్వల్పంగా పెరుగుదల ఉంది.

By:  Raja Ch   |   23 Nov 2025 11:00 AM IST
కడుపుకు తినేది తక్కువే  కానీ... వర్కింగ్  పేపర్  లో కీలక విషయాలు!
X

ఒక కుటుంబం గృహ వినియోగ వ్యయంలో ఎక్కువ భాగాన్ని దేనికి కేటాయిస్తున్నారు? అంటే.. ఒకప్పుడు అయితే... ఇంక దేనికండి..? కడుపు నిండా పిల్లలకు, తల్లితండ్రులకు తిండి పెట్టడానికి అని చెప్పి ఉండేవారేమో! కానీ.. ఇప్పుడు లెక్కలు మారాయి.. కడుపుకు తినే దానికంటే ఎక్కువగా ఇతర ఖర్చులు పెరిగాయి. తాజాగా ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) వర్కింగ్ పేపర్ కీలక విషయాలు వెల్లడిచింది.

అవును... ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి వర్కింగ్ పేపర్ ప్రకారం.. కుటుంబాలు ఇప్పుడు గృహ వినియోగ వ్యయంలో ఎక్కువ భాగాన్ని ఆహారేతర ఖర్చులకే కేటాయిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా వినియోగ వస్తువులు, సేవలపై ఖర్చులకు కేటాయిస్తున్నాయి. 'భారతదేశంలో మన్నికైన వస్తువుల యాజమాన్యంలో మార్పులు; గృహ వినియోగ వ్యయ సర్వే విశ్లేషణ 2011-12, 2023-24' అనే శీర్షికతో ఈ పేపర్ వర్క్ విడుదలయ్యింది.

ఈ సర్వే విశ్లేషణ ప్రకారం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మన్నికైన వస్తువులపై ఖర్చు చేసే నెలవారీ తలసరి వ్యయం వాటా పెరిగింది.. అదే విధంగాగా అనేక రాష్ట్రాల్లో పట్టణ గృహాల కంటే గ్రామీణ వాటాలో స్వల్పంగా పెరుగుదల ఉంది. ప్రధానంగా గృహ వ్యయంలో ఎక్కువ భాగం వినియోగ వస్తువులు, సేవలు, మన్నికైన వస్తువులపై ఉంటుంది.

ఇదే సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం అంతటా పెరిగిందని నివేదిక పేర్కొంది. ఇది మెరుగైన ఇంటర్ కనెక్టివిటీ, కమ్యునికేషన్ యాక్సెస్ ను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. సరసమైన, వేగవంతమైన నెట్ వర్క్ కనెక్టివిటీ ఫలితంగా.. సమాచారం, వినోదం, కమ్యునికేషన్ కోసం మొబైల్ లు ఎంపిక సాధనంగా ఉద్భవిస్తున్నాయని ఈ నివేదిక వెల్లడించింది.

ఈ క్రమంలో.. అనేక రాష్ట్రాల్లో టీవీల వినియోగం తగ్గుతున్న ధోరణి, సార్వత్రిక మొబైల్ యాక్సెస్ పెరుగుదల నేపథ్యంలో... టీవీ స్క్రీన్ ను మొబైల్ పరికరాల ద్వారా భర్తీ చేస్తున్నారనే చర్చకు బలమైన మద్దతు అందిస్తుందని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో ల్యాప్ టాప్ / పీసీ వృద్ధి నెమ్మదిగా ఉందని.. దీనికి పరిమిత జ్ఞానం, ప్రత్యేక విద్యా అనువర్తనాలు కారణం కావొచ్చని తెలిపింది.

2023-24 ను 2011-12తో పోల్చి చూసిన ఈ గృహ వినియోగ వ్యయ సర్వే అధ్యయనం.. ఆహార పదార్థాలు, వినియోగ వస్తువులు, మన్నికైన వస్తువులు అనే మూడు భాగాల్లో.. మిగిలిన రెండింటితో పోలిస్తే ఆహార వ్యయ వాటా 50% కంటే తక్కువకు పడిపోయిందని నివేదిక పేర్కొంది. అదేవిధంగా.. దుస్తులు, పాదరక్షలు వంటి ప్రాథమిక అవసరాల నుంచి.. టూవీలర్స్, గృహోపకరణాలవైపు వ్యయాలు మారుతున్నాయని నొక్కి చెప్పింది!