యుద్ధంపై మోదీ కలుగజేసుకోవాలి.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పిలుపు..
ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని, అందుకే దాడులు చేస్తున్నామని అమెరికా చెబుతున్న వాదనలను పెజెష్కియాన్ ఖండించారు.
By: Tupaki Political Desk | 22 March 2026 10:47 AM ISTపశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ, అగ్రరాజ్యాల ఆంక్షల మధ్య చిక్కుకున్న ఇరాన్ ఇప్పుడు భారత్ వైపు ఆశగా చూడడం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు. బ్రిక్స్ (BRICS) కూటమికి సారథ్యం వహిస్తున్న భారత్, తన స్వతంత్ర దౌత్యంతో ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కోరడం గమనార్హం. అగ్రరాజ్యం అమెరికా సాగిస్తున్న దాడులను 'దురాక్రమణ'గా అభివర్ణిస్తూ, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు భారత్ ఒక 'శాంతి దూత'గా వ్యవహరించాలని ఆయన ఆశిస్తున్నారు. ప్రధాని మోదీ, పెజెష్కియాన్ మధ్య లోతైన సంభాషణ జరిగింది.
బ్రిక్స్ సారథిపై ఇరాన్ భారీ ఆశలు!
ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ఈ హోదాలో భారత్ తన సొంత గళాన్ని వినిపించి, పశ్చిమాసియాలో జరుగుతున్న సైనిక దాడులను అడ్డుకోవాలని ఇరాన్ అధ్యక్షుడు కోరారు. విదేశీ శక్తుల జోక్యం లేకుండా, ఆ ప్రాంత దేశాలన్నీ కలిసి ఒక సొంత 'భద్రతా వ్యవస్థ'గా ఏర్పడాలనే ప్రతిపాదనను ఆయన ప్రధాని మోదీ ఎదుట ఉంచారు. ముఖ్యంగా అమెరికా సాగిస్తున్న దాడులను అడ్డుకోవడంలో భారత్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
అణ్వాయుధాల ఆరోపణలపై ఇరాన్ ఘాటు స్పందన!
ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని, అందుకే దాడులు చేస్తున్నామని అమెరికా చెబుతున్న వాదనలను పెజెష్కియాన్ ఖండించారు. తమ దివంగత సుప్రీం నేత ఖమేనీ అణ్వాయుధాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే మతపరమైన, పాలనాపరమైన ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. అణ్వాయుధాల తయారీ తమ ఉద్దేశ్యం కాదని, కేవలం తమపై జరుగుతున్న దురాక్రమణను అడ్డుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ విషయంలో అమెరికా చేస్తున్న ఆరోపణలు అబద్ధమని ఆయన మోదీకి వివరించారు.
నౌకాయాన స్వేచ్ఛ.. మోదీ గట్టి సందేశం!
పశ్చిమాసియాలో కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధాని మోదీ ఖండించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి వెన్నెముక వంటి నౌకాయాన మార్గాలు (హర్మూజ్ జలసంధి వంటివి) ఎల్లప్పుడూ తెరిచి ఉండాలని, నౌకల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని పెజెష్కియాన్ కి మోదీ నొక్కి చెప్పారు. యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతినకూడదన్నది భారత్ ప్రధాన ఉద్దేశ్యం. అందుకే శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
రంజాన్ శుభాకాంక్షలు
ఫోన్ సంభాషణ ప్రారంభంలో ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర సమయం పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి, సుస్థిరతను తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఇరాన్ పౌరులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూనే, యుద్ధ మేఘాలను తొలగించే దిశగా దౌత్యపరమైన చర్చలు కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒకవైపు అమెరికా వంటి మిత్రదేశం, మరోవైపు ఇరాన్ వంటి వ్యూహాత్మక భాగస్వామి.. ఇద్దరి మధ్య సమతుల్యత పాటించడం భారత్‌కు ఒక పెద్ద సవాలనే చెప్పవచ్చు.. అయితే, బ్రిక్స్ నాయకుడిగా భారత్ గళం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. ఇరాన్ కోరినట్లుగా భారత్ తన స్వతంత్ర పాత్రను పోషించి యుద్ధాన్ని ఆపగలిగితే, అది అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్టను మరింత పెంచుతుంది. మరి మోదీ శాంతి మంత్రం పశ్చిమాసియాలో పని చేస్తుందో లేదో చూడాలి.
