Begin typing your search above and press return to search.

హార్ముజ్‌పై పంతం.. ఇరాన్-అమెరికా ఘర్షణకు అసలు కారణం ఇదే!

తాజాగా సింగపూర్‌కు చెందిన ఒక వాణిజ్య నౌకపై ఇరాన్ నావికాదళం జరిపిన దాడి ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది.

By:  A.N.Kumar   |   27 Jun 2026 6:00 PM IST
హార్ముజ్‌పై పంతం.. ఇరాన్-అమెరికా ఘర్షణకు అసలు కారణం ఇదే!
X

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్, అమెరికాల మధ్య కొన్ని నెలలుగా నడుస్తున్న యుద్ధం.. ఇప్పుడు ‘హార్ముజ్ జలసంధి’ వేదికగా సరికొత్త అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంపై పట్టు సాధించేందుకు ఇరాన్ సాగిస్తున్న ప్రయత్నాలు.. దానికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా చేస్తున్న సైనిక మోహరింపులు ప్రపంచ శాంతిని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతున్నాయి.

తాజాగా సింగపూర్‌కు చెందిన ఒక వాణిజ్య నౌకపై ఇరాన్ నావికాదళం జరిపిన దాడి ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. తమ నిబంధనలను పాటించలేదనే సాకుతో ఇరాన్ ఈ చర్యకు పాల్పడినప్పటికీ దీని వెనుక కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే లేదు..అంతర్జాతీయ సముద్ర మార్గాలపై తన సార్వభౌమత్వాన్ని చాటుకోవాలనే భౌగోళిక-రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.

జీవనాడిపై నియంత్రణకు పోరు

భౌగోళికంగా హార్ముజ్ జలసంధి చాలా చిన్నదే కావచ్చు, కానీ అంతర్జాతీయ వాణిజ్యానికి ఇది ఒక ప్రధాన నాడి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే ప్రయాణిస్తుంది. అందువల్లనే దీనిపై నియంత్రణ సాధించడం ద్వారా పాశ్చాత్య దేశాలను, ముఖ్యంగా అమెరికాను ఒత్తిడిలోకి నెట్టవచ్చనేది ఇరాన్ యోచన.

అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని తీవ్రంగా పరిగణించారు. "హార్ముజ్ అనేది అంతర్జాతీయ జలసంధి. దీని గుండా ప్రయాణించే అన్ని దేశాల వాణిజ్య నౌకలకు స్వేచ్ఛాయుత రాకపోకల హక్కు ఉంది. వీటికి ఎలాంటి టోల్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు" అని ట్రంప్ చేసిన ప్రకటన ఇరాన్‌కు స్పష్టమైన హెచ్చరిక. కానీ ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ పంతానికి దిగడం, దానికి ప్రతిగా అమెరికా తన యుద్ధనౌకలను రంగంలోకి దించడం పరిస్థితిని మరింత జటిలం చేసింది.

ఆర్థిక సంక్షోభం పొంచి ఉందా?

ఇరు దేశాల మధ్య నడుస్తున్న ఈ సైనిక పంతం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి సామాన్యుడిపై పడే ప్రమాదం ఉంది. హార్ముజ్ జలసంధిలో రవాణా స్తంభిస్తే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది కోలుకోలేని దెబ్బ. రవాణా వ్యయాలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి తీవ్రమైన ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. యుద్ధ భయాల నేపథ్యంలో వాణిజ్య నౌకల ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారీగా పెరుగుతాయి.. ఇది అంతర్జాతీయ వ్యాపారాన్ని మరింత కుంగదీస్తుంది.

దౌత్యమే ఏకైక మార్గం

కరోనా మహమ్మారి సృష్టించిన నష్టాల నుండి ఆ తర్వాత వచ్చిన రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వంటి పరిణామాల నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇలాంటి తరుణంలో మధ్యప్రాచ్యంలో మరో యుద్ధాన్ని ప్రపంచం భరించే స్థితిలో లేదు.

హార్ముజ్ జలసంధి ఏ ఒక్క దేశానికి చెందిన సొత్తు కాదు.. అది అంతర్జాతీయ చట్టాల ప్రకారం నడవాల్సిన సముద్ర మార్గం. ఇరాన్ తన పంతాన్ని, ఏకపక్ష వైఖరిని వీడాలి. అదే సమయంలో అమెరికా కూడా ఉద్రిక్తతలను మరింత పెంచే సైనిక చర్యలకు స్వస్తి చెప్పి, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపాలి. లేనిపక్షంలో ఇరు దేశాల అహంకార పూరిత ఆధిపత్య పోరు ప్రపంచాన్ని మరో తీవ్ర ఆర్థిక మందగమనంలోకి నెట్టడం ఖాయం.