Begin typing your search above and press return to search.

చైనా వంతెన కూలడం భయానకమే.. మానవ అహంకారినికి పెద్ద దెబ్బ అంటున్న ప్రకృతి ప్రేమికులు

చైనాలో మంగళవారం (11 నవంబర్, 2025) చోటుచేసుకున్న హాంగ్‌కీ వంతెన కూలిన ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.

By:  Tupaki Political Desk   |   12 Nov 2025 6:00 PM IST
చైనా వంతెన కూలడం భయానకమే.. మానవ అహంకారినికి పెద్ద దెబ్బ అంటున్న ప్రకృతి ప్రేమికులు
X

చైనాలో మంగళవారం (11 నవంబర్, 2025) చోటుచేసుకున్న హాంగ్‌కీ వంతెన కూలిన ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. సిచువాన్ ప్రావిన్స్‌లోని మార్కాంగ్ సిటీ సమీపంలో కొండచరియలు విరిగిపడడంతో టిబెట్‌ వైపు వెళ్లే కీలక జాతీయ రహదారిపై ఉన్న 758 మీటర్ల పొడవైన వంతెన క్షణాల్లో తునాతునకలైంది. గగనచుంబి ఇంజినీరింగ్‌ ప్రతిభకు ప్రతీకగా నిర్మించిన ఈ వంతెన కూలిన వీడియోలు ఇప్పుడు ప్రపంచ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుప్పకూలినప్పుడు గాల్లో ఎగిసిన దుమ్ము మేఘాలు, పగిలిన స్తంభాలు, కింద నదిలోకి కూలిపోయిన ఇనుప సిమెంట్‌ శిథిలాలు ఇవన్నీ మానవ నిర్మాణాల పరిమితులను గుర్తుచేసేలా ఉన్నాయి.

అధికారులు ప్రకటించిన ప్రకారం.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడం ఒక అద్భుతం. కానీ దీనిని మించిన ఆందోళన ఏంటంటే, కేవలం కొన్ని నెలల క్రితం ప్రారంభించిన ఈ వంతెన ఈ స్థాయిలో కూలిపోవడం నిర్మాణ నాణ్యతపై, పర్యావరణ అవగాహనపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. చైనా ఎప్పటి నుంచో తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విజయాలతో ప్రపంచానికి సాంకేతిక మోడల్‌గా నిలిచింది. కానీ వేగం కోసం, ప్రతిష్ట కోసం, ప్రకృతి నియమాలను విస్మరించిన ప్రతిసారీ ఇలాంటి ఘటనలు మానవ అహంకారానికి గట్టి సమాధానాన్ని ఇస్తున్నాయి.

ప్రభుత్వ అధికారులు కొండచరియల ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి సోమవారం నుంచే రాకపోకలను నిలిపివేయడం మంచి నిర్ణయం. లేదంటే ఈ ఘటన మానవ ప్రాణనష్టానికి దారితీసేది. అయితే ఇది ఒక ప్రశ్నను లేవనెత్తింది. ఒక భారీ నిర్మాణం కూలిపోవడానికి ముందు లక్షణాలు కనిపించినా.. ఎందుకు సమయానికి రక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇది కేవలం సిచువాన్‌ సమస్య కాదు,, ఇది ప్రతి దేశం ఎదుర్కొంటున్న ‘వేగవంతమైన అభివృద్ధి’ అనే మానవ దౌర్భాగ్యపు ప్రతిబింబం.

చైనాలోని ఇంజినీరింగ్ అద్భుతాలు ఎప్పుడూ ప్రశంసలు అందుకుంటూనే ఉంటుంది. కానీ వాటి పునాది పర్యావరణ సమతుల్యంపై దెబ్బ కొడుతుందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత లేలికైన విషయం కాదు. సిచువాన్ ప్రాంతం భూకంపాలు, భారీ వర్షాలు ఎక్కువగా ఉండే ప్రాంతం. అలాంటి ప్రదేశంలో భారీ వంతెనలు నిర్మించడం ఒక సాంకేతిక సవాలు మాత్రమే కాదు.. ఒక బాధ్యత కూడా. ఆ బాధ్యతలో లోపం ఎక్కడో ఉన్నట్టే కనిపిస్తోంది.

ఇక్కడ మరో అంశం కూడా గమనించాలి. ఈ వంతెన కేవలం రహదారి కోసం నిర్మాణం కాదు.. అది రాజకీయ ప్రతీక కూడా చైనా ప్రభుత్వం టిబెట్‌తో అనుసంధానం బలోపేతం చేసేందుకు ఈ వంతెనను నిర్మించింది. ఇప్పుడు అదే వంతెన కూలిపోవడం, ఆ అనుసంధాన సింబల్‌కి చీలిక రావడం ఒక ప్రతీకాత్మక దెబ్బగా భావించవచ్చు. ప్రకృతి ఎప్పుడు మనకు పాఠం నెర్పుతూనే ఉంటుంది. ‘నువ్వు ఎంత శక్తివంతుడివైనా, నా నియామలను అతిక్రమిస్తే నిన్ను కూలదీస్తాను’ అని. ఈ ఘటన కూడా అదే సందేశాన్ని మళ్లీ గుర్తుచేసింది. సాంకేతికత మనుషుల జీవితాలను సులభతరం చేయాలి కానీ, ప్రకృతి సరిహద్దులను సవాలు చేయకూడదు.

సిచువాన్ ఘటన కేవలం చైనా ఇంజినీరింగ్ వైఫల్యం కాదు.. అది మానవ నాగరికత సున్నితమైన సత్యం. అభివృద్ధి ఎంత గొప్పదైనా, భూమి మీద మనం అతిథులమే. పర్వతం కదిలితే వంతెన కూలిపోతుంది, కాని ప్రకృతి మాత్రం నిలబడిపోతుంది. ఈ ఘటన మానవ అహంకారానికి అద్దం పట్టింది. అదే సమయంలో జాగ్రత్తగా, సమతుల్యంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని కూడా గట్టిగా గుర్తుచేసింది.