హాంకాంగ్ దారుణం: హైదరాబాద్ హైరైజ్ అపార్ట్‌మెంట్స్ మేలుకోవాలి!
ఏషియన్ వరల్డ్ సిటీగా పిలుచుకునే హాంకాంగ్‌లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం యావత్ ప్రపంచాన్ని కలచివేసింది.
By: A.N.Kumar | 27 Nov 2025 9:00 PM ISTఏషియన్ వరల్డ్ సిటీగా పిలుచుకునే హాంకాంగ్‌లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం యావత్ ప్రపంచాన్ని కలచివేసింది. న్యూ టెరిటరీస్‌లోని థాయ్ పో జిల్లాలో ఉన్న ఒక పెద్ద నివాస సముదాయంలో చెలరేగిన మంటలు... భారీ విషాదాన్ని మిగిల్చాయి. ఈ దుర్ఘటనలో 44 మంది అగ్నికీలలకు ఆహుతి కాగా, 250 మందికి పైగా ఆచూకీ తెలియకపోవడం దారుణం. హాంకాంగ్‌లో గత 30 ఏళ్లలో ఇదే అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంగా గుర్తిస్తున్నారు. హైటెక్ సిటీ హైదరాబాద్‌లోనూ ఇలాంటి హైరైజ్ అపార్ట్‌మెంట్లు ఉన్న నేపథ్యంలో వాటి భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుకైన అపార్ట్‌మెంట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ చర్యల ఆవశ్యకత ఎంతో అవసరం.
దారుణానికి దారి తీసిన పరిస్థితులు
ఈ ప్రమాదం ఎలా సంభవించిందో తెలుసుకుంటే... భద్రతా ప్రమాణాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరింత స్పష్టమవుతాయి. మొదట 32 అంతస్తుల భవనం బయట మంటలు అంటుకున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన వెదురు పరంజా వద్ద మంటలు రేగాయి. అక్కడ ఉన్న ప్లాస్టిక్ నెట్టింగ్, కాన్వాస్ కవర్ మరియు ఇతర నిర్మాణ సామగ్రి మంటలను అత్యంత వేగంగా వ్యాపింపజేశాయి. బలమైన గాలులు వీచడంతో మంటలు వెంటనే ఇతర టవర్లకు సైతం పాకినట్లు స్థానికులు తెలిపారు. ఆ ప్రాంతంలో స్థానికంగా ఎనిమిది భవనాలు, వాటిలో రెండు వేల పైగా ఇళ్ళు ఉన్నాయి. ప్రమాదం సంభవించిన సమయంలో పై అంతస్తుల్లో వృద్ధులతో సహా పలువురు చిక్కుకుపోయారు. ప్రమాద తీవ్రత కారణంగా... 140 ఫైరింజన్లు, 60 అంబులెన్స్‌లు, వందలాది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది.
హైదరాబాద్‌కు హెచ్చరిక
హైటెక్ సిటీగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లోనూ, హాంకాంగ్ తరహాలో అనేక హైరైజ్ అపార్ట్‌మెంట్లు వెలిశాయి. ముఖ్యంగా కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో ఇవి అధికం. హాంకాంగ్ దారుణాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ అపార్ట్‌మెంట్ల భద్రతా ప్రమాణాలను తక్షణమే సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇరుకైన ప్రాంతాల్లో నిర్మితమవుతున్న అపార్ట్‌మెంట్లలో, నిర్మాణ సమయంలో భద్రతా నియమాలు సరిగ్గా పాటిస్తున్నారా? అగ్నిమాపక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నాయా? పీరియాడికల్ చెక్-అప్‌లు జరుగుతున్నాయా? నివాసితులకు వీటిపై అవగాహన ఉందా? అత్యవసర ద్వారాలు స్పష్టంగా గుర్తించబడి, వాటికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉన్నాయా? నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా, బయటి వైపు ప్రమాదకరమైన, మంటలను వేగంగా వ్యాపింపజేసే వస్తువులు ఏమైనా ఉన్నాయా? గుర్తించాలి.
తీసుకోవాల్సిన తక్షణ చర్యలు
ప్రభుత్వం, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, నివాసితులు సంయుక్తంగా మేలుకోవాలి.అన్ని హైరైజ్ భవనాలలో ఫైర్ సేఫ్టీ ఆడిట్‌లను తక్షణమే నిర్వహించాలి.అగ్నిమాపక యంత్రాలు చేరుకోవడానికి ఇరుకైన రోడ్లలో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలి.ప్రతి 6 నెలలకు ఒకసారి ఫైర్ డ్రిల్స్ నిర్వహించి, నివాసితులకు శిక్షణ ఇవ్వాలి. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, స్మోక్ డిటెక్టర్లు, స్ప్రింక్లర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలి. తమ బాల్కనీలు, బయటి ప్రదేశాలలో మండే స్వభావం ఉన్న వస్తువులను నిల్వ చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో తెలుసుకోవడం, పిల్లలకు తెలియజేయడం తప్పనిసరి.
హాంకాంగ్ విషాదం కేవలం ఒక వార్త కాదు, ఇది ప్రపంచంలోని అన్ని హైరైజ్ అపార్ట్‌మెంట్లకు ఒక ఘోరమైన హెచ్చరిక. భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిందే.
