Begin typing your search above and press return to search.

60 ఏళ్లలో చూడని ఘోరం.. హాంకాంగ్ అగ్నిప్రమాదంలో 44 మంది మృతి, 270 మంది అదృశ్యం

ప్రమాదం ప్రారంభమైనది ఒక 32 అంతస్తుల భవనం వెలుపల, మరమ్మతుల పనుల వద్ద అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

By:  A.N.Kumar   |   27 Nov 2025 2:20 PM IST
60 ఏళ్లలో చూడని ఘోరం.. హాంకాంగ్ అగ్నిప్రమాదంలో  44 మంది మృతి, 270 మంది అదృశ్యం
X

ఏషియన్‌ వరల్డ్‌ సిటీగా పేరొందిన హాంకాంగ్‌ను భారీ అగ్నిప్రమాదం కుదిపేసింది. న్యూ టెరిటరీస్‌లోని థాయ్‌ పో జిల్లాలో ఉన్న ఒక హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో నిన్న మధ్యాహ్నం చెలరేగిన మంటలు క్షణాల్లోనే అదుపు తప్పి ఏడు టవర్లను మింగేశాయి. ఈ అత్యంత ఘోరమైన దుర్ఘటనలో ఇప్పటివరకు 44 మంది మరణించగా, 270 మందికి పైగా ఆచూకీ తెలియకుండాపోయింది. ఈ స్థాయి అగ్నిప్రమాదం హాంకాంగ్‌ చరిత్రలో గత 60 ఏళ్లలో సంభవించడం ఇదే తొలిసారి.




అగ్ని పుట్టుక: మరమ్మతుల సామగ్రి కారణం!

ప్రమాదం ప్రారంభమైనది ఒక 32 అంతస్తుల భవనం వెలుపల, మరమ్మతుల పనుల వద్ద అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అగ్ని కీలలు అంటుకోవడానికి ప్రధాన కారణాలు మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన వెదురు కట్టడాలు... ఈ వెదురు కట్టడాలను చుట్టిన ప్లాస్టిక్ నెట్టింగ్ , కిటికీలపై అమర్చిన పాలిస్టరైన్ బోర్డులు మంటలను విపరీతంగా పెంచాయి. బలమైన గాలుల కారణంగా, అత్యంత మండే స్వభావం గల ఈ ప్లాస్టిక్, పాలిస్టరైన్ పదార్థాలు నిమిషాల్లోనే మంటలను ఆకాశాన్ని అంటుకునేలా చేసి, పక్కనే ఉన్న ఏడు టవర్లకు వేగంగా వ్యాపించాయి.




బాధితుల్లో వృద్ధులే అధికం

1983లో నిర్మించిన ఈ హౌసింగ్ కాంప్లెక్స్‌లో మొత్తం 8 టవర్లు, 1,984 ఫ్లాట్లలో కనీసం 4,600 మంది నివాసితులు ఉన్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన ఏడు టవర్లలో నివసించే వారిలో సుమారు 40 శాతం మంది (65 ఏళ్లు పైబడిన వారు) వృద్ధులు కావడం మరణాల సంఖ్య పెరగడానికి, రక్షణ చర్యలకు ఆటంకం కలగడానికి దారితీసింది.

ఫైర్‌ అలారమ్‌లు పనిచేయకపోవడం భయంకర అంశం!

ప్రమాద తీవ్రత పెరగడానికి మరో భయంకరమైన అంశం ఫైర్‌ అలారమ్‌లు పనిచేయకపోవడం. స్థానికుల వాంగ్మూలం ప్రకారం.. మరమ్మతుల కారణంగా కొన్ని ఫైర్‌ అలారమ్‌లను స్వయంగా నిలిపివేశారు. మరమ్మతుల పేరుతో దాదాపు ఏడాది రోజులు కిటికీలు సీల్ చేసి ఉంచారు. అలారమ్‌లు పనిచేయకపోవడంతో చాలా మంది నివాసితులు ప్రమాదాన్ని ఆలస్యంగా గ్రహించారు, ఇది ప్రాణనష్టాన్ని పెంచింది.

రక్షణ చర్యలు & దర్యాప్తు వివరాలు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు భారీ రక్షణ చర్యలు చేపట్టారు. 140 ఫైరింజన్లు , 60 అంబులెన్స్‌లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వందలాది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఆరోగ్య అధికారులు గంటల తరబడి మంటలను అదుపు చేయడానికి పోరాడారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కిటికీలపై అమర్చిన పాలిస్టరైన్ బోర్డుల మండే స్వభావం, గాలి ఒత్తిడి, టవర్ల దగ్గరగా ఉన్న నిర్మాణం అగ్నిని వేగంగా విస్తరించడానికి ప్రధాన కారణాలని తేలింది. ఈ బోర్డులు అగ్నినిరోధక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘోరంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధితులను ధైర్యం చేస్తూ, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

భద్రతా లోపాలపై దృష్టి!

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది, ఇంకా అదృశ్యుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ ఘటన కేవలం అగ్నిప్రమాదం కాదు, ఇది నిర్లక్ష్యం, భద్రతా లోపాలు ఒక ఆధునిక నగరంలోని కట్టడాన్ని ఎలా భస్మం చేశాయో తెలిపే ఒక ఘోర ఉదాహరణ. నిర్మాణ ప్రమాణాలపై, మరమ్మతుల పద్ధతులపై భారీ దర్యాప్తు జరగనుంది. ఈ సంఘటన హాంకాంగ్‌ చరిత్రలో 1962 లో 44 మరణాలు , 1996 లో 41 మరణాలు తర్వాత ఇంతటి విపరీతమైన నష్టాన్ని కలిగించిన మూడవ ప్రధాన అగ్నిప్రమాదంగా నిలిచింది.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

అదృశ్యమైన వారి సంఖ్య 270 మందికి పైగా ఉంది.వీరి ఆచూకీ తెలియకుండాపోయారు. అన్వేషణ కొనసాగుతున్నందున, వీరిలో చాలా మంది మరణించి ఉండవచ్చు. మంటల తీవ్రత కారణంగా కూలిపోయిన టవర్ల శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉంది. సమగ్ర దర్యాప్తు అన్వేషణ పూర్తయ్యే వరకు తుది మృతుల సంఖ్యపై స్పష్టత రాదు.