పేదోడి సొంతింటి కల.. సుప్రీం తీసుకున్న మరో సంచలన నిర్ణయం
సొంతింటి కల... ప్రతి మధ్యతరగతి కుటుంబం గుండెల్లో నిండిపోయే మధుర స్వప్నం.
By: A.N.Kumar | 14 Sept 2025 7:00 AM ISTసొంతింటి కల... ప్రతి మధ్యతరగతి కుటుంబం గుండెల్లో నిండిపోయే మధుర స్వప్నం. కానీ ఈ స్వప్నమే ఇప్పుడు అనేక కుటుంబాలకు దహనకుండమవుతోంది. వాగ్దానాలు చేసి మోసం చేసిన డెవలపర్లు, మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు, నిరాశ్రయులైన కొనుగోలుదారులు.ఇదే దేశ రియల్ ఎస్టేట్ రంగం భయానక వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం కోర్టు జోక్యం నిస్సందేహంగా కాలానుగుణం, ప్రజానుకూలం.
న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఒకే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇక మౌనప్రేక్షకుడిగా ఉండకూడదు. మధ్యతరగతి ప్రజలు కష్టపడి చెల్లించే పన్నులే ఈ దేశానికి వెన్నెముక. వారి రక్తం చెమటతో కూడిన డబ్బును కొందరు డెవలపర్లు దోచుకుపోయి, కలల ఇళ్లను అసంపూర్తిగా వదిలేయడం కేవలం వ్యక్తిగత మోసం కాదు—దేశ ఆర్థిక క్రమశిక్షణపై నేరుగా దెబ్బ.
సుప్రీం సూచనలోని రెండు అంశాలు అత్యంత కీలకం:
ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. నిలిచిపోయిన ప్రాజెక్టులను ఆర్థికంగా తిరిగి లేపడానికి ఒక “సేఫ్టీ నెట్” అవసరమని కోర్టు గుర్తు చేసింది. ప్రాజెక్టుల స్వాధీనం చేసుకోవాలి. డెవలపర్లు చేతులెత్తేస్తే, ప్రభుత్వం లేదా నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (NARCL) వంటి సంస్థలు జోక్యం చేసుకుని ప్రాజెక్టును పూర్తి చేయాలి. రెరా (RERA) గురించి కోర్టు చేసిన వ్యాఖ్యలు పచ్చి నిజం. చట్టం ఉన్నా, దాన్ని కరెక్ట్‌గా అమలు చేసే దంతాలు లేకుంటే, అది "కోరలు తీసిన పులి"గానే మిగిలిపోతుంది. ట్రైబ్యునళ్లు, సమర్థవంతమైన యంత్రాంగం లేకుంటే, గృహ కొనుగోలుదారుల పోరాటం అంతులేని న్యాయప్రస్థానంగా మారిపోతుంది.
మధ్యతరగతి సొంతింటి కల కాపాడటం అంటే కేవలం వ్యక్తిగత ప్రయోజనం కాపాడటమే కాదు; అది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని, పట్టణ అభివృద్ధి దిశను కాపాడటమే. ఈ దశలో కేంద్రం తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల గృహ విధానాన్ని నిర్వచిస్తాయి.
సుప్రీం ధర్మాసనం బంతిని ప్రభుత్వ కోర్టులో వేసింది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ప్రభుత్వం వినియోగదారుల పక్షాన నిలబడుతుందా, లేక మళ్లీ మౌనప్రేక్షకుడిగానే మిగిలిపోతుందా? అన్నది వేచిచూడాలి..
