Begin typing your search above and press return to search.

రూ.50 వేల లోపు పోగుట్టుకున్నారా... ఇకపై నో టెన్షన్!

ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట సైబర్ మోసం అనేది తెలిసిన సంగతే.

By:  Raja Ch   |   18 Jan 2026 11:29 AM IST
రూ.50 వేల లోపు పోగుట్టుకున్నారా...  ఇకపై నో టెన్షన్!
X

ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట సైబర్ మోసం అనేది తెలిసిన సంగతే. చిన్న పెద్ద అనే తారతమ్యాలేమీ లేకుండా సామాన్యుడి నుండి సెలబ్రెటీ వరకూ ఈ సైబర్ నేరాల బారిన పడుతున్న జనం సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ సమయంలో రూ.50 వేల కంటే తక్కువ పోగొట్టుకున్న వారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి గుడ్ న్యూస్ వినిపించింది. ఇందులో భాగంగా... సరికొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్.ఓ.పీ) కు ఆమోదం తెలిపింది.

అవును... ఆన్‌ లైన్ ఆర్థిక మోసాలకు గురై, పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టుకోవడానికి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న బాధితులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీపి కబురు చెప్పింది. ఇందులో భాగంగా... కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సరికొత్త 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్'కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో సైబర్ నేరగాళ్ల బారిన పడి పోగొట్టుకున్న సొమ్మును బాధితులు ఇప్పుడు మరింత వేగంగా, సులభంగా తిరిగి పొందవచ్చు.

సాధారణంగా సైబర్ మోసాలు జరిగినప్పుడు.. బ్యాంకులు సదరు మొత్తాన్ని ఫ్రీజ్ చేస్తాయి. ఈ సమయంలో బాదితుడు ఆ సొమ్మును తిరిగి పొందాలంటే కోర్టు నుండి 'రిస్టోరేషన్ ఆర్డర్' తీసుకురావాల్సి వచ్చేది. అయితే తాజాగా తీసుకొచిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ ప్రకారం... రూ.50,000 కంటే తక్కువ మొత్తం మోసపోయిన సందర్భాల్లో ఎటువంటి కోర్టు ఆదేశాలు లేకుండానే బ్యాంకులే బాధితులకు రీఫండ్ చేసే అధికారం కల్పించారు.

ఈ క్రమంలో... హోల్డ్‌ లో ఉన్న నిధులపై బ్యాంకులు విధించిన ఆంక్షలను 90 రోజుల్లోగా తొలగించి పరిష్కారం చూపాలి. దీనివల్ల సామాన్య పౌరులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు న్యాయపరమైన జాప్యం తప్పుతుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ప్రముఖ ఫిన్‌ టెక్ సంస్థ జియోటస్.కామ్ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్.. ఈ కొత్త ఎస్.ఓ.పీ. ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో అనిశ్చితిని తగ్గిస్తుందని తెలిపారు.

ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ గణాంకాల ప్రకారం.. గత ఆరేళ్లలో భారతీయులు ఆన్‌ లైన్ మోసాల వల్ల సుమారు రూ.52,976 కోట్లు నష్టపోయారు. అయితే.. ఇప్పటివరకు సుమారు రూ.7,130 కోట్లను మోసగాళ్ల చేతికి చిక్కకుండా కాపాడగలిగారు. ఈ క్రమంలో డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే ముందు వరుసలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాజా ఎస్.ఓ.పీ నిర్ణయం వరప్రసాదంగా మారనుందని అంటున్నారు నిపుణులు.

ప్రధానంగా... హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో డిజిటల్ లావాదేవీల సంఖ్య ఎక్కువగా ఉన్నందున.. ఇక్కడ సైబర్ ఫిర్యాదులు కూడా అదే స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఎస్.ఓ.పీ. నిబంధనలతో ఇక్కడి బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరనుందని.. ఇది గుడ్ న్యూస్ అని చెబుతున్నారు.