Begin typing your search above and press return to search.

ఫేక్ గాళ్ల గుట్టు రట్టు.. అసెంబ్లీలో హోంమంత్రి అనిత సంచలనం

హోంమంత్రి అనిత చెప్పిన ప్రకారం వైసీపీ సానుభూతిపరులైన నలుగురు మారుపేర్లతో సోషల్ మీడియాలో హ్యాండిల్స్ నిర్వహిస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు.

By:  Tupaki Political Desk   |   28 Sept 2025 12:24 PM IST
ఫేక్ గాళ్ల గుట్టు రట్టు.. అసెంబ్లీలో హోంమంత్రి అనిత సంచలనం
X

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వంలో చూపినట్లు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం లోతు పాతులు తెలుసుకునే పనిని పక్కాగా చేపడుతున్న ప్రభుత్వం.. ఆయా హ్యాండిల్స్ నిర్వాహకుల గుట్టు విప్పుతున్నారు. తాజాగా నలుగురు మారు పేర్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. వారి అసలు పేర్లను తెలుసుకుని అసెంబ్లీలో ప్రకటించింది.

ప్రభుత్వంపై విషప్రచారమే లక్ష్యంగా ప్రతిపక్షం వైసీపీ సానుభూతిపరులు కొందరు ఫేక్ సమాచారం వ్యాప్తి చేస్తున్నారని హోంమంత్రి అనిత అసెంబ్లీలో వెల్లడించారు. మారు పేర్లతో సోషల్ మీడియా హ్యాండిల్స్ ను నిర్వహిస్తున్న ఓ నలుగురు సమాజంలో విద్వేషం రెచ్చగొట్టేలా.. కులాల మధ్య చిచ్చుపెట్టేల ప్రవర్తిస్తున్నారని, అటువంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇటువంటి వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని వెల్లడించారు.

హోంమంత్రి అనిత చెప్పిన ప్రకారం వైసీపీ సానుభూతిపరులైన నలుగురు మారుపేర్లతో సోషల్ మీడియాలో హ్యాండిల్స్ నిర్వహిస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. అందులో ఒకరు తన డీపీ ఫొటోగా మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని పెట్టుకున్నాడు. ఈ అకౌంట్ కరణం ఎన్టీఆర్ పేరుతో నడుస్తుంది. కానీ, ఆ అకౌంట్ హోల్డర్ అసలు పేరు సప్తగిరి రెడ్డి. అదేవిధంగా చలపతి చౌదరి అన్న పేరుతో హ్యాండిల్ నడుపుతున్న యూజర్ పేరు ముఖేష్ రెడ్డిగా ప్రభుత్వం గుర్తించింది. ఇక ఆంధ్ర పాడ్ కాస్టర్ పేరు కేసరి విజయ్ రెడ్డి, వీరంతా వైసీపీ కోసం పనిచేస్తున్నట్లు హోంమంత్రి అనిత ఆరోపించారు.

తమ నిజమైన గుర్తింపు దాచిపెట్టి టీడీపీ అనుకూల సామాజికవర్గ పేర్లతో హ్యాండిల్స్ నడుపుతూ ప్రజలలో గందరగోళం నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారని హోంమంత్రి అనిత వెల్లడించారు. కల్పిత కథనాలను అల్లి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటివి నియంత్రించడానికి కొత్త చట్టం తీసుకురానున్నట్లు హోంమంత్రి స్పష్టం చేశారు.

అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించిన వివరాలతో ఆయా అకౌంట్లను ఫాలో అయ్యే వారు అవాక్కయ్యారు. ఇన్నాళ్లు నిజమని నమ్మి మోసపోయామని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాను నమ్మితే నట్టేట మునిగినట్లేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాపై ఆధారపడి ఏ విషయాన్ని నిర్ధారించుకోకూడదని పరిశీలకులు సూచిస్తున్నారు.