హోంమంత్రి అనితకు బిగ్ సవాల్.. మ్యాటర్ ఇదే...!
రాష్ట్ర హోం శాఖ మంత్రి అనితకు బిగ్ సవాల్ ఎదురైంది. వైసీపీ నేతలు చేపడుతున్న ర్యాలీలు, నిరసన లను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 19 Oct 2025 4:00 PM ISTరాష్ట్ర హోం శాఖ మంత్రి అనితకు బిగ్ సవాల్ ఎదురైంది. వైసీపీ నేతలు చేపడుతున్న ర్యాలీలు, నిరసనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జగన్ పర్యటించిన సమయంలో కారు కింద పడి పార్టీ సానుభూతిపరుడు మృతి చెందిన నేపథ్యంలో సహజంగానే సర్కారు అలెర్ట్ అవుతుంది. ఈ క్రమంలో ఆ తర్వాత పర్యటనలకు నిబంధనలను పెంచారు. అయినప్పటికీ.. వైసీపీ నాయకులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు.. మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో వైసీపీ చేపట్టే కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడి నియోజకవర్గం నర్సీపట్నంలో నిర్వహించిన కార్యక్రమానికి పోలీసులు ఆది నుంచి కూడా అనుమతులు ఇవ్వలేదు. అయితే.. చివరి నిమషంలో మాత్రం కొన్ని నిబంధనలతో అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు ఇదే తరహాలో ఏకంగా హోం మంత్రి అనిత నియోజకవర్గంలో వైసీపీ నేతలు పర్యటించేందుకు రెడీ అయ్యారు.
విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం నుంచి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ బల్క్‌డ్రగ్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ.. మత్స్యకారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ పార్కుతో తమకు ఇబ్బందులు వస్తాయని వారు భావిస్తున్నారు. అందుకే.. వారు దానిని వ్యతిరేకిస్తూ.. కొన్ని రోజుల కిందట మంత్రి అనితను కూడా తాటి చెట్లు అడ్డు పెట్టి అడ్డుకున్నారు. ఈ వవ్యవహారం మంత్రిని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అప్పట్లో వారితో చర్చించి.. సానుకూలంగా సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
అయితే.. ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం హాట్ హాట్‌గా మారింది. ఈ నెల 22న 'చలో రాజయ్య పేట' నిర్వహించేందుకు వైసీపీ పిలుపునిచ్చింది. ఆ రోజు వైసీపీ నాయకులు ఈ గ్రామంలో పర్యటించి.. మత్స్యకారులకు మద్దతుగా నిరసన తెలుపనున్నారు. అంతేకాదు.. ధర్నాలకు కూడా పిలుపునిచ్చారు. కానీ, ఆది నుంచి వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ.. `అతగాడు` అంటూ.. జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించే అనిత సొంత నియోజకవర్గంలోకి వైసీపీ నాయకులు ఎంట్రీ ఇవ్వడాన్ని ఆమె సీరియస్‌గానే భావిస్తున్నా రు. అలాగని ప్రజాస్వామ్యంలో ధర్నాలను అడ్డుకునే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలకు ఎలా అడ్డుకట్ట వేయాలన్న విషయం ఆమెకు పెద్ద సవాలుగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
