హెచ్ ఎండీఏకు కాసుల పంట.. 3 వేల కోట్ల ఆదాయం!
''ఆ.. మహా వస్తే.. వెయ్యి కోట్లు..'' అని అత్యంత పేలవంగా బరిలోకి దిగిన హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ ఎండీఏ)కు కాసుల వర్షం కురిసింది.
By: Garuda Media | 4 Dec 2025 3:37 PM IST''ఆ.. మహా వస్తే.. వెయ్యి కోట్లు..'' అని అత్యంత పేలవంగా బరిలోకి దిగిన హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ ఎండీఏ)కు కాసుల వర్షం కురిసింది. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో మూడు విడతల్లో వేలం వేసిన భూములకు సంబంధిం చి ఏకంగా 3 వేల కోట్ల రూపాయల పైలుచుకు మొత్తాన్ని సంస్థ తన ఖాతాలో వేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఎకరం 140 కోట్ల రూపాయల వరకు పలకడం హెచ్ ఎండీఏ పంట పండడానికి కారణమైంది. ఇలా.. మొత్తంగా ఇప్పటి వరకు 27 ఎకరాల కు వేలం వేశారు.
అయితే..అనుకున్న టార్గెట్ ప్రకారం మొత్తం 44 ఎకరాలను విక్రయించాల్సి ఉంది. దీనిలో 27 ఎకరాలు విక్రయించే(వేలం ద్వారా) సరికే 3807 కోట్ల రూపాయల ఆదాయం.. సంస్థకు చేకూరింది. ఇప్పటి వరకు మూడు విడతలుగా భూములను వేలం వేశారు. మరో విడతలో మొత్తం 17 ఎకరాలను విక్రయించనున్నారు. దీంతో ముందస్తుగా నిర్ణయించుకున్న మేరకు 44 ఎకరాలను విక్రయించినట్టు అవుతుంది. కాగా.. మొత్తం ప్రక్రియ అంతా ఈ-వేలం(ఆన్‌లైన్) విధానంలోనే సాగింది. నాలుగో విడతలో కోకాపేట గోల్డెన్ మైల్‌లోని 2 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలకు వేలం వేయనున్నారు.
ఎక్కడెక్కడ ఎలా?
కోకాపేటలోని నియోపోలిస్ ప్రాంతంలో ఉన్న భూములను హెచ్ డీఎంఏ వేలం వేస్తోంది. ఇటీవల ఎకరా భూమిని 99 కోట్ల రూపాయలుగా సంస్థ నిర్ణయించగా.. అనూహ్యంగా ఎకరా 137 కోట్ల చొప్పున పలికింది. ఇది ఇటీవల కాలంలో హైదరాబాద్‌కు వెలుపల పలికిన భారీ ధర అని తెలంగాణ పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత రోజు ఏకంగా 141 కోట్ల రూపాయలకు ఏకరం విక్రయించారు. ఇక, తాజాగా బుధవారం నిర్వహించిన వేలంలో ప్లాట్ నెంబర్ 19, 20లోని 8.04 ఎకరాలకు రూ.131 కోట్లు, రూ.118 కోట్ల చొప్పున ధర పలికింది. మొత్తగా 3807 కోట్ల రూపాయల మేరకు హెచ్ డీఎంఏకు కనక వర్షం కురిసింది.
