‘మొదట వారు వచ్చారు’.. సేమ్ సీన్ ఇప్పుడు రిపీట్ అవుతోందా?
అందుకు నిదర్శనంగా తాజాగా సాగుతున్న ఇరాన్ - ఇజ్రాయల్, యూఎస్ యుద్ధాన్ని చెప్పొచ్చు. ఇలాంటి వేళ.. ప్రపంచ దేశాలు మౌనంగా ఉంటున్నాయి.
By: Garuda Media | 5 March 2026 12:06 PM ISTకాలం మారినా కొందరు పాలకుల తీరు మాత్రం ఒకేలా ఉంటుంది. అప్పుడెప్పుడో 93 ఏళ్ల క్రితం నాటి హిట్లర్ దురాగతాలను.. ప్రపంచాన్ని అశాంతికి గురి చేసి.. తాను అనుకున్నదే జరగాలన్న మొండితనంలో కోట్లాది మంది ప్రాణాలు పోయేందుకు కారణం కావటమే కాదు.. ఆధునిక ప్రపంచంలో మొదటి..రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్ తీరును సూటిగా ప్రశ్నిస్తూ రాసిన కవిత.. ఇంతకాలం తర్వాత నేటి పరిస్థితికి అచ్చు గుద్దినట్లుగా సరిపోవటం దేనికి నిదర్శనం. తిరుగులేని అధికారం చేతికి వచ్చినప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలే తప్పించి.. ఇష్టారాజ్యంగా తన పంతాన్ని నెరవేర్చుకోవటం కోసం.. ఇగోను సంత్రప్తి పర్చుకోవటం కోసం ఎన్ని ప్రాణాన్ని పణంగా పెట్టేందుకు వెనుకాడని పాలకులు కొందరు ఉంటారు.
ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తున్నామన్న గర్వంతో బాధ్యతను మర్చిపోయి.. తనను వ్యతిరేకించేటోళ్లు.. తనను ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నోళ్లను పక్కకు జరిపేసే ధోరణి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కాస్త ఎక్కువే. తాను అనుకున్నట్లుగా గ్రేట్ అమెరికాను తయారు చేసే క్రమంలో యావత్ ప్రపంచానికి ఏమైనా ఫర్లేదన్నట్లుగా ఆయన తీరు ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని తీవ్రమైన అనిశ్చితికి గురి చేస్తోంది. తన మాట వినని.. తనకు నచ్చిన దేశాన్ని ప్రపంచానికి ప్రమాదకారి అన్న ముద్రను వేసి.. దానిపై దాడికి తెగబడే తీరు ట్రంప్ హయాంలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
అందుకు నిదర్శనంగా తాజాగా సాగుతున్న ఇరాన్ - ఇజ్రాయల్, యూఎస్ యుద్ధాన్ని చెప్పొచ్చు. ఇలాంటి వేళ.. ప్రపంచ దేశాలు మౌనంగా ఉంటున్నాయి. అమెరికా నిర్ణయం అనే కన్నా.. ట్రంప్ నిర్ణయాన్ని ప్రశ్నించే రిస్కును ఎవరూ తీసుకోవటం లేదు. ఎవరైనా తప్పు పట్టినా.. ఖండించినా నామమాత్రమే తప్పించి తమ అభిప్రాయాన్ని సూటిగా.. స్పష్టంగా చెప్పని పరిస్థితి. ఈ రోజు వాళ్లు.. రేపు నేను అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఇటీవల కాలంలో వివిధ దేశాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. ఆయన కోరుకున్న రీతిలో స్పందించని దేశాల మీద చర్యలు తీసుకోవటం మరింత పెరుగుతోంది.
అంటే.. అమెరికా మినహా ప్రపంచంలోని మరే దేశం ట్రంప్ హెచ్చరికకు మినహాయింపు కాదన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ప్రపంచ శాంతికి భంగం వాటిల్లేలా తీసుకుంటున్న నిర్ణయాలు విలువైన ప్రాణాల్ని మాత్రమే కాదు.. ఖరీదైన సహజవనరుల్ని హరించి.. ఆయా దేశాలు కోలుకోవటానికి దశాబ్దాల తరబడి సమయాన్ని తీసుకుంటుదన్నది మర్చిపోకూడదు. అంతేనా.. దీనికి ప్రపంచంలోని పలు దేశాలు ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా ఆర్థిక భారాన్ని మోయక తప్పదు. ఈ తీరు ప్రపంచ శాంతికి సవాలు విసురుతుందన్నది మర్చిపోకూడదు.
ఇలాంటి వేళలోనే 1933లో మార్టిన్ నీమోల్లర్ రాసిన కవిత గుర్తుకు రాక మానదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాజీల అరాచకాలపై తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ రాసిన ఈ కవిత ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి కావటమే కాదు.. ఎంతో మంది నేతల రాజకీయ నిర్ణయాలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఇప్పుడు సైతం ఇదే కవితను చదివితే.. తాజా పరిస్థితి కూడా ఇంచుమించు సేమ్ టు సేమ్ అన్నట్లుగా ఉంటుందని చెప్పాలి.
మేధావి మౌనం మంచిది కాదన్న మాట దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా అన్న మాటను గుర్తుకు తేవటమే కాదు.. మౌనం వల్ల జరిగే నష్టాన్ని మార్టిన్ నీమోల్లర్ తన సంక్షిప్త కవితతో చెప్పేస్తాడు. ఇంతకూ ఆయన అన్నదేంటి? అన్నది చదివితే.. ఇప్పటి పరిస్థితికి అన్వయించుకోవటమే కాదు.. నాటి ఆయన మాటలు యదాతధంగా సరిపోతాయన్న భావన కలుగక మానదు. మొదట వారు వచ్చారు..(ఫస్ట్ దే కేమ్) పేరుతో ఆయన రాసిన కవిత ఇదే..
"మొదట వారు సోషలిస్టుల కోసం వచ్చారు,
నేను గొంతెత్తలేదు, ఎందుకంటే నేను సోషలిస్టును కాను.
ఆ తర్వాత వారు ట్రేడ్ యూనియన్ వాదుల కోసం వచ్చారు,
నేను గొంతెత్తలేదు, ఎందుకంటే నేను ట్రేడ్ యూనియన్ వాదిని కాను.
ఆ తర్వాత వారు యూదుల కోసం వచ్చారు,
నేను గొంతెత్తలేదు, ఎందుకంటే నేను యూదుడిని కాను.
చివరికి వారు నా కోసం వచ్చారు,
అప్పుడు నా తరఫున మాట్లాడటానికి అక్కడ ఎవరూ మిగలలేదు."
ఇప్పుడు ప్రపంచం.. ప్రపంచ దేశాధినేతలు ఎవరికి వారు.. తమను తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం వచ్చింది. మానవాళి మనుగడ కోసం.. ఒకరి ఎజెండాకు తగ్గట్లు వందల కోట్ల ప్రజల జీవితాలు.. భవిష్యత్తు మాత్రమే కాదు ప్రపంచ గమనాన్ని నిర్దేశించేలా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై మేధావులు.. వివిధ దేశాధినేతలు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పక తప్పదు.
