అమెరికాను గడ్డకట్టించిన మంచు ప్రళయం
అమెరికా చరిత్రలోనే అత్యంత భీకరమైన శీతాకాల విపత్తులలో ఒకటిగా నిలిచే మంచుతుఫాన్ ప్రస్తుతం అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది.
By: A.N.Kumar | 30 Dec 2025 5:01 PM ISTఅమెరికా చరిత్రలోనే అత్యంత భీకరమైన శీతాకాల విపత్తులలో ఒకటిగా నిలిచే మంచుతుఫాన్ ప్రస్తుతం అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. గడ్డకట్టే చలి, భారీ మంచు వర్షాలు, ఉగ్రరూపం దాల్చిన గాలులతో అమెరికాలోని పలు రాష్ట్రాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రకృతి ప్రకోపానికి రవాణా వ్యవస్థలు విచ్ఛిన్నమవ్వగా కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
ముఖ్యంగా న్యూయార్క్ రాష్ట్రంలో పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. అప్‌స్టేట్ న్యూయార్క్ ప్రాంతంలో దాదాపు ఒక అంగుళం మందంపాటి ఐస్ పొర పేరుకుపోవడంతో రహదారులు, వంతెనలు, వాహనాలు మంచు కింద చిక్కుకుపోయాయి.నేషనల్ గ్రిడ్ పరిధిలోని సుమారు 1.12 లక్షల మంది వినియోగదారులు విద్యుత్ లేక అంధకారంలో మునిగిపోయారు. కొన్ని ప్రాంతాల్లో వరుసగా 17 గంటల పాటు పవర్ కట్ కొనసాగడం గమనార్హం. మంచు తుఫాన్ తగ్గీ తగ్గకముందే కురిసిన అడుగు మేర మంచు సహాయక చర్యలకు పెను సవాలుగా మారింది.
ఈ తుఫాను ప్రభావం కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు. ఇండియానా నుండి ఈస్ట్ కోస్ట్ వరకు దాదాపు 100 మిలియన్ల (10 కోట్లు) మందిని అధికారులు హై విండ్ అలర్ట్ కింద ఉంచారు.మిన్నెసోటా నుంచి మైన్ వరకు తుఫాన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు చెట్లను విద్యుత్ స్తంభాలను నేలకూల్చాయి.
ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన నయాగరా జలపాతం ఈ విపత్తులో మంచుతో నిండిన భీకరమైన దృశ్యంగా మారింది. తీవ్రమైన చలికి జలపాతాలు గడ్డకట్టి ఒక భారీ 'ఐస్ ప్యాలెస్'ను తలపిస్తున్నాయి. పశ్చిమ న్యూయార్క్, దక్షిణ ఒంటారియో ప్రాంతాల్లో వీచిన గాలులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా మంచుతో కప్పేశాయి. ఇంత విస్తృత స్థాయిలో, ఒకే సమయంలో ఇన్ని రాష్ట్రాలపై ప్రభావం చూపిన శీతాకాల విపత్తు అమెరికా చరిత్రలో అత్యంత అరుదైనది అని వాతావరణ నిపుణులు తెలిపారు.
రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రకృతి సృష్టించిన ఈ మహా ప్రళయం ముందు మానవ వ్యవస్థలు ఎంత బలహీనమో ఈ ఐస్ స్టార్మ్ మరోసారి నిరూపిస్తోంది.
