Begin typing your search above and press return to search.

దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. సుప్రీం సీజేఐ ప్రమాణానికి స్పెషల్ గెస్టులు

మొత్తం ఆరు దేశాల నుంచి 15 మంది అతిథులను సీజేఐ సూర్యకాంత్ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. కాగా, పదవీ విరమణ చేస్తున్న సీజేఐ జస్టిస్ గవాయ్ దాదాపు ఆరు నెలలు ఆ పదవిలో కొనసాగారు.

By:  Tupaki Political Desk   |   23 Nov 2025 12:45 PM IST
దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. సుప్రీం సీజేఐ ప్రమాణానికి స్పెషల్ గెస్టులు
X

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగుస్తోంది. సోమవారం నుంచి దేశ కొత్త సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్ నూతన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే దేశచరిత్రలో తొలిసారిగా సీజేఐ ప్రమాణ స్వీకారానికి విదేశీ అతిథులను ఆహ్వానించారు. జస్టిస్ సూర్యకాంత్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనుండగా, ఈ కార్యక్రమానికి నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, కెన్యా దేశాల ప్రధాన న్యాయమూర్తులు హాజరు కానున్నారు. అదేవిధంగా మలేషియా నుంచి న్యాయమూర్తుల బృందం హాజరవుతోంది. వీరంతా ఈ నెల 26న నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవంలోనూ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.

విదేశాలకు చెందిన సీజేఐలు, న్యాయమూర్తులు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. మొత్తం ఆరు దేశాల నుంచి 15 మంది అతిథులను సీజేఐ సూర్యకాంత్ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. కాగా, పదవీ విరమణ చేస్తున్న సీజేఐ జస్టిస్ గవాయ్ దాదాపు ఆరు నెలలు ఆ పదవిలో కొనసాగారు. గవాయ్ హయాంలో జడ్జీల నియామకాలు భారీగా జరిగాయి. మొత్తం 10 మంది ఎస్సీ కేటగిరీకి చెందిన న్యాయమూర్తులు, 11 మంది బీసీ కేటగిరీ న్యాయమూర్తులను గవాయ్ నియమించారు. ఇక సీజేఐగా సేవలు అందించిన వారిలో జస్టిస్ గవాయ్ తొలి బౌద్ధ మతస్తుడు కాగా, రెండో దళితుడు కావడం విశేషం.

40 ఏళ్ల నుంచి న్యాయప్రస్థానం

కొత్త సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సూర్యకాంత్ 1984లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్ లో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో సూర్యకాంత్ జన్మించారు. హిసార్ ప్రభుత్వ పీజీ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నారు. రోహతక్ మమర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి 1984లో న్యాయవాద పట్టా అందుకున్నారు. అదే ఏడాది హిసార్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. న్యాయవాదిగా అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2000 సంవత్సరంలో 38 ఏళ్ల వయసులో హరియాణా అడ్వకేట్ జనరల్ గా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

సుప్రీంకోర్టులో పలు రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా పనిచేశారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సమర్థించిన తీర్పుతో సహా పలు ముఖ్యమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. కాగా, దేశవ్యాప్తంగా వివిధ కోర్టులలో పెండింగులో ఉన్న 5 కోట్లకు పైగాకేసుల పరిష్కారానికి కృషి చేయడం, వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా గేమ్ చేంజర్ మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడానికి సీజేఐగా అత్యంత ప్రాధాన్యం ఇస్తానని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.