హిందూపురంపై వైసీపీ డోలాయమానం.. ఏం జరుగుతోంది ..!
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురంలో వైసీపీ పరిస్థితి డోలాయమానంలో పడిందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.
By: Garuda Media | 20 Nov 2025 7:00 AM ISTఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురంలో వైసీపీ పరిస్థితి డోలాయమానంలో పడిందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీలో ఎప్పటినుంచో ఉన్న నవీన్ నిశ్చల్‌ను పక్కన పెట్టి గతంలోనే తప్పు చేశారన్న చర్చ ఉంది. అయితే.. ఇప్పుడు పార్టీలో ఏక ఛత్రాధిపత్య రాజకీయాలకు హిందూపురం వేదికగా మారిందని నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఇక్కడ జరిగిన వివాదానికి ఏకఛత్రాధిపత్య రాజకీయాలే కారణమని కూడా చెబుతున్నారు.
వాస్తవానికి ఏ పార్టీ ఇంచార్జ్ అయినా.. మిగిలిన నాయకులను కలుపుకొని ముందుకు సాగాలి.కానీ.. గత ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన తర్వాత కూడా.. దీపిక ఆ దిశగా అడుగులు వేయడం లేదు. పైగా.. తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని.. కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వడం లేదని నాయకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు మరింత గ్యాప్ పెంచాయి. తాజాగా బాలయ్యపై దీపిక భర్త వేణు చేసిన వ్యాఖ్యలు టీడీపీని రగిలించాయి. వైసీపీ ఆఫీసుపై దాడికి పురిగొల్పాయి.
అయితే ఈ వ్యవహారంపై టీడీపీ ఎలా ఉన్నా.. వైసీపీ నాయకులు మాత్రం దీపికనే తప్పుబడుతున్నారు. పార్టీ నాయకులకు చెప్పకుండా.. సొంత కేడర్‌ను తయారు చేసుకుని ఆమె వ్యవహరిస్తున్న తీరును వారు జీర్ణించుకోలేక పోతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా(వైసీపీ చెప్పిన మేరకు).. చేపట్టిన ఆందోళనకు.. పార్టీలోని ఇతర నాయకులను దీపిక ఆహ్వానించలేదని.. తాము జగన్ చెప్పినట్టే చేశామని నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో అసహనానికి గురైన దీపిక భర్త వేణు.. వైసీపీ నాయకులను ఏమీ అనే పరిస్థితి లేక.. టీడీపీపై విమర్శలు గుప్పించారని అంటున్నారు.
వాస్తవానికి హిందూపురంలో బాలయ్యకు అభిమానులుగా ఉన్నవారిలోనూ చాలా మంది వైసీపీకి కూడా అనుకూలంగా ఉన్నారని.. చెబుతున్నారు. ఇప్పుడు ఆ సానుభూతి కూడా పోయే ప్రమాదం ఏర్పడింద న్నదివారి వాదన. రాజకీయాల్లో ఉన్నప్పుడు.. ఆచి తూచి అడుగులు వేయాలని.. బాలయ్య ఇమేజ్ ను కూడా పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలని నవీన్ నిశ్చల్ వర్గం చెబుతోంది. గతంలో నవీన్ కూడా బాలయ్యపై పోటీ చేసి ఓడిపోయారు. కానీ, బాలయ్య అభిమానులు హర్ట్ అయ్యేలా వ్యవహరించలేదని గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామాలపై అధిష్టానం జోక్యం చేసుకుని మరింత డ్యామేజీ జరగకుండా చూడాలని కూడా కోరుతున్నారు.
