హిందూపురంలో బాలయ్యకు కొత్త తలనొప్పులా..?
ఇక్కడ ప్రత్యర్థి ఎవరైనా సరే గెలుపు మాత్రం టీడీపీదే అన్నట్లు హవా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ చిరకాల ప్రత్యర్థిగా పనిచేసిన సీనియర్ నేత నవీన్ నిశ్చల్ జనసేనలో చేరడం చర్చనీయాంశం అవుతోంది.
By: Tupaki Political Desk | 1 Oct 2026 9:00 PM ISTతెలుగుదేశం పార్టీ కంచుకోట హిందూపురం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి వరుసగా ఈ స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా, పార్టీ కీలక నేతలకు అతి ముఖ్యమైన హిందూపురం నియోజకవర్గంలో తాజా రాజకీయాలు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురంలో ఇప్పుడు ఆయన తనయుడు, సినీ నటుడు బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా మూడుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన బాలయ్య పనితీరుపై నియోజకవర్గంలో సానుకూల అభిప్రాయమే ఉందని చెబుతున్నారు. ఎమ్మెల్యేగా బాలయ్య అందుబాటులో లేకపోయినా ఆయన టీం నియోజకవర్గ వ్యవహారాలను జాగ్రత్తగా గమనిస్తూ ప్రజల అవసరాలను తీర్చుతున్నారని చెబుతున్నారు. ఇలా హిందూపురంలో మంచి మార్కులు తెచ్చుకుంటున్న బాలయ్యకు సడన్ గా మిత్రపక్షం జనసేన షాక్ ఇచ్చినట్లైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
హిందూపురం అంటేనే తెలుగుదేశం పార్టీ, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గుర్తుకు వస్తుందని చెబుతారు. ఇక్కడ ప్రత్యర్థి ఎవరైనా సరే గెలుపు మాత్రం టీడీపీదే అన్నట్లు హవా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ చిరకాల ప్రత్యర్థిగా పనిచేసిన సీనియర్ నేత నవీన్ నిశ్చల్ జనసేనలో చేరడం చర్చనీయాంశం అవుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరన్నట్లు నవీన్ నిశ్చల్ చేరికను చూస్తున్నప్పటికీ, సుదీర్ఘ కాలంగా టీడీపీ వ్యతిరేక రాజకీయాలు నడిపిన నవీన్ నిశ్చల్ ప్రస్తుతం మిత్రపక్ష నాయకుడిగా ఎమ్మెల్యే బాలయ్యతో సర్దుకుపోగలరా? అన్నదే పెద్ద చిక్కు ప్రశ్నగా మారిందని అంటున్నారు.
వరుసగా మూడు సార్లు గెలిచిన బాలయ్య మాటే ఇప్పటివరకు ఫైనల్. అయితే ఇకపై మిత్రపక్షం నేత నవీన్ నిశ్చల్ అభిప్రాయాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురైతే అప్పుడు పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 2004 నుంచి మూడు సార్లు హిందుపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన నవీన్ నిశ్చల్ ఓటమినే ఎదుర్కొన్నారు. 2014లో బాలయ్యపైనా పోటీ చేశారు. అయితే వైసీపీ 2019, 2024ల్లో అభ్యర్థిని మార్చడంతో నవీన్ నిశ్చల్ పోటీకి దూరమయ్యారు. కానీ, గత పదేళ్లుగా ఆయన టీడీపీ వ్యతిరేక అజెండాతోనే పనిచేశారు. ఇంకా చెప్పాలంటే నవీన్ నిశ్చల్ రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఇప్పటివరకు టీడీపీకి వ్యతిరేకంగానే పనిచేశారని అంటున్నారు.
ఇక స్థానిక ఎన్నికల ముందు జనసేనలో చేరిన ఆయన టీడీపీతో సర్దుకుని పనిచేసే పరిస్థితి ఉందా? అన్నదే చూడాల్సివుందని అంటున్నారు. ఇది ఎమ్మెల్యే బాలయ్యకు పెద్ద సవాల్ గా మారే పరిస్థితి ఉందని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పొత్తుల కారణంగా హిందూపురంలో కూడా కొన్ని సీట్లు మిత్రపక్షాలకు ఇవ్వాల్సివుంటుందని అంటున్నారు. అయితే నవీన్ నిశ్చల్ చేరికతో ఆయన వర్గానికి సీట్లు కేటాయించే పరిస్థితి వస్తే బాలయ్యకు కొత్త తలనొప్పులు ఎదురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటివరకు బాలయ్యకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించి పదవులు కట్టబెడితే భవిష్యత్తులో వారు ఏకుమేకు అయ్యే అవకాశాలు ఉండవా? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో నవీన్ నిశ్చల్ నుంచి జనసేన ఏం ఆశిస్తుందో కానీ, హిందూపురంలో మాత్రం బాలయ్యకు మింగుడు పడని పరిస్థితులు ఏర్పడేలా పరిస్థితులు తయారవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
