Begin typing your search above and press return to search.

అమెరికాలో హిందూ ఆలయాలే లక్ష్యమా? వరుస ఘటనల వెనుక అసలు కథేంటి?

సుదూర తీరాలలో స్థిరపడి.. తమ కష్టార్జితంతో పురోభివృద్ధి సాధిస్తూ.. అహింసను పరమధర్మంగా భావించే భారతీయ అమెరికన్ సమాజం నేడు తీవ్రమైన భయాందోళనల నడుమ కాలం గడుపుతోంది.

By:  A.N.Kumar   |   23 Oct 2026 11:10 AM IST
అమెరికాలో హిందూ ఆలయాలే లక్ష్యమా? వరుస ఘటనల వెనుక అసలు కథేంటి?
X

సుదూర తీరాలలో స్థిరపడి.. తమ కష్టార్జితంతో పురోభివృద్ధి సాధిస్తూ.. అహింసను పరమధర్మంగా భావించే భారతీయ అమెరికన్ సమాజం నేడు తీవ్రమైన భయాందోళనల నడుమ కాలం గడుపుతోంది. శాంతిసౌభాగ్యాలకు.. వైవిధ్యానికి వేదికగా నిలిచే అమెరికా నేలపై.. తమ ఆరాధ్య దైవాల సన్నిధులైన హిందూ ఆలయాల భద్రతపై ప్రశ్నలు రేకెత్తడం ప్రవాస భారతీయుల గుండెల్లో తీవ్ర ఆవేదనను నింపుతోంది. ఇటీవల ఇల్లినాయిస్ లోని అరోరాలో వెలుగు చూసిన నమ్మశక్యం కాని కుట్ర.. మిచిగన్‌లోని మెట్రో డెట్రాయిట్ ప్రాంతంలో చోటుచేసుకున్న భయానక ఘటనలు ఈ ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి. అసలు అమెరికాలో హిందూ ఆలయాలను కావాలనే ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారా..? ఈ వరుస ఘటనల వెనుక దాగి ఉన్న అసలు కథేంటి అనే దిగ్భ్రాంతికరమైన ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ తొలిచేస్తున్నాయి.

ఇల్లినాయిస్ రాష్ట్రంలోని అరోరాలో ఉన్న ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సామూహిక కాల్పులకు కుట్ర పన్నినట్లు వచ్చిన వార్తలు అమెరికాలోని హిందూ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసాయి. కేవలం 19 ఏళ్ల వయసున్న ఒక యువకుడు.. నిత్యం భక్తులతో కళకళలాడే ఆలయాన్ని శ్మశానంగా మార్చడానికి వ్యూహం పన్నాడనే ఆరోపణలు వింటుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. అదృష్టవశాత్తూ అతడి సహోద్యోగి సమయస్ఫూర్తితో స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒక పెను ప్రమాదం తప్పింది. నిందితుడి నివాసంలో లభించిన రైఫిల్‌, వందలాది తూటాలు, బాడీ ఆర్మర్‌లను చూసి అధికారులు సైతం విస్తుపోయారు. అతడి వద్ద లభించిన ఎనిమిది పేజీల పత్రంలో శ్వేతజాతి ఆధిపత్య భావజాలంతో పాటు భారతీయులపై చిమ్మిన ద్వేషం, హింసకు పూనుకోవాలనే ఆలోచనలు వర్ణనాతీతమైన ఆందోళనను కలిగిస్తున్నాయి.

ఈ సంఘటన మరువక ముందే మిచిగన్‌లోని మెట్రో డెట్రాయిట్ ప్రాంతంలో వరుసగా చోటుచేసుకున్న ఘటనలు స్థానిక భారతీయుల నిద్రను చెడగొట్టాయి. ఫార్మింగ్టన్ హిల్స్‌లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి ఒక వ్యక్తి అక్రమంగా చొరబడి ప్రవర్తించిన తీరు, పోంటియాక్‌లోని పారాశక్తి ఆలయంలో నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని ఆనందంగా తిరుగు ప్రయాణమైన ఒక భారతీయ కుటుంబం కారుపై జరిగిన కాల్పులు శాంతిని దూరం చేశాయి. తమ ఆచారం ప్రకారం పండుగలు చేసుకుని ఇళ్లకు వెళ్తున్న అమాయకులపై కాల్పులు జరగడం మానసికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ ఘటనల్లో ఎవరికీ ప్రాణహాని జరగకపోవడం ఊరటనిచ్చినప్పటికీ.. తమ స్వంత ఇళ్ల వద్ద.. గుడుల వద్ద సురక్షితంగా ఉన్నామా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది.

అయితే ఈ ఘటనలన్నింటినీ ఒకే పెద్ద కుట్రలో భాగంగా చూడాలా లేదా వేర్వేరు ఉన్మాద చర్యలుగా భావించాలా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అరోరా కేసులో శ్వేతజాతి ఆధిపత్యం, జాతి ద్వేషం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ మిచిగన్ ఘటనల వెనుక ఉన్న అసలు కారణాలు దర్యాప్తు సంస్థల విచారణలోనే వెల్లడి కావాల్సి ఉంది. అమెరికాలోని హిందూ ఆలయాలు కేవలం పూజలు పునస్కారాలకే పరిమితం కావు. అవి మన సంస్కృతికి, భాషకు, సామాజిక ఐక్యతకు, పిల్లలకు మన విలువలను నేర్పించే పవిత్ర నిలయాలు. అటువంటి చోట్ల భయానక వాతావరణం నెలకొంటే దాని ప్రభావం మొత్తం సమాజపు మనోధైర్యంపై పడుతుంది.

ఈ క్లిష్ట సమయంలో భయాందోళనలకు గురికాకుండా ఉండటం ఎంత ముఖ్యమో.. అప్రమత్తంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం. ఆలయ నిర్వాహకులు భద్రతా వ్యవస్థలను పటిష్టం చేసుకోవడం.. స్థానిక పోలీసులతో అనుసంధానమై ఉండటం అత్యవసరం. అలాగే సామాజిక మాధ్యమాల్లో అధికారికంగా ధృవీకరించని వార్తలను ప్రచారం చేసి అనవసర భయాందోళనలు సృష్టించకూడదు. ఈ ఘటనలపై పారదర్శకమైన దర్యాప్తు జరిగి.. బాధ్యులకు కఠిన శిక్ష పడినప్పుడే విదేశాల్లో ఉన్న మన భారతీయ సమాజానికి నిజమైన రక్షణ, మనశ్శాంతి లభిస్తాయి.