Begin typing your search above and press return to search.

ప్ర‌సిద్ధ క్షేత్రాల్లో.. పెద్ద పెద్ద పాపాలు: ఎవ‌రు దిక్కు?

తిరుమ‌ల‌: వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల శ్రీవారికి.. విదేశీ భ‌క్తులు స‌మ‌ర్పించిన డాల‌ర్ల‌ను ఆల‌య ఉద్యోగే దొంగిలించారు.

By:  Garuda Media   |   30 Jun 2026 6:00 PM IST
ప్ర‌సిద్ధ క్షేత్రాల్లో.. పెద్ద పెద్ద పాపాలు:  ఎవ‌రు దిక్కు?
X

మ‌న‌కు ఏదైనా ఇబ్బంది వ‌స్తే.. దేవుడికి చెప్పుకొంటాం. మ‌రి ఆ దేవ‌దేవుడికే క‌ష్టం వ‌స్తే.. ఎవ‌రికి చెప్పాలి? ఇదీ.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత క్షేత్రాలుగా గుర్తింపు పొంది.. దేశ , విదేశాల నుంచి కూడా భ‌క్తులు క్యూక‌ట్టే.. ప‌లు పుణ్య క్షేత్రాల్లో పెద్ద పెద్ద పాపాలే జ‌రుగుతున్నాయి. కానీ, వీటిని అరిక‌ట్టేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌లు మాత్రం నామ మాత్రంగానే ఉంటున్నాయి. దీంతో ఆయా క్షేత్రాల ప‌రిస్థితి ఏంటి? భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌లు దిక్కు ఎవ‌రు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

తిరుమ‌ల‌: వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల శ్రీవారికి.. విదేశీ భ‌క్తులు స‌మ‌ర్పించిన డాల‌ర్ల‌ను ఆల‌య ఉద్యోగే దొంగిలించారు. ఈ కేసు ఇప్ప‌టికీ నానుతూనే ఉంది. ఇక‌, ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార న్న చ‌ర్చ రాజ‌కీయ మ‌లుపులు తిరిగి.. దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఆందోళ‌న‌, నిర‌స‌న‌లు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే.. ఇది జ‌రిగి ఏడాదిన్న‌ర అయినా.. సిట్ త‌న నివేదిక ఇచ్చినా.. సీబీఐ అధికారులు ద‌ర్యాప్తు పూర్తి చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కు నిందితులు ఎవ‌రు? ఎలా చేశారు? అనే విష‌యాలు తెలియ‌కపోవ‌డం గ‌మ‌నార్హం .

అయోధ్య‌: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెప్పిన‌ట్టు దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం త‌ర్వాత‌.. నిర్మించుకున్న అయోధ్య రామ‌మందిరంలో కోట్ల రూపాయ‌ల దోపిడీ జ‌రిగింది. భ‌క్తులు బాల‌రామ‌య్య‌కు స‌మ‌ర్పించిన న‌గ‌దు, ఆభ‌రణాలు స‌హా.. అనేక రూపాల్లో ఇచ్చిన కానుక‌ల‌ను ఇంటి దొంగ‌లే(విరాళాలు లెక్కించిన వారే) దోపిడీ చేశార‌ని అధికారులు చెబుతున్నారు. ఈ విష‌యం ఇటు ఆల‌యాన్ని నిర్వ‌హిస్తున్న ట్ర‌స్టుకు, విరాళాల బాధ్య‌త చూసే ఎస్ బీఐకి తెలిసినా.. మౌనంగా ఉన్నారు. దీనికి సూత్ర‌ధారులు ఎవ‌రు అనే విష‌యంపై ఇంకా మీన‌మేషాలు లెక్కిస్తూనే ఉన్నారు.

శ‌బ‌రిమ‌ల‌: ఏటా ల‌క్ష‌ల సంఖ్య‌లో భ‌క్తులు దీక్ష తీసుకుని, ప‌విత్రంగా ద‌ర్శించుకునే కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో జ‌రిగిన బంగారం దోపిడీ వ్య‌వ‌హారం ఏళ్లు గ‌డుస్తున్నా.. మూలుగుతూనే ఉంది. శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని బంగారు రేకుల‌తో తాప‌డం చేయించేందుకు ముందుకు వ‌చ్చిన భ‌క్తులు ఇచ్చిన ప‌సిడిని తాప‌డం పేరుతో దోచుకున్న‌ది సాక్షాత్తూ ఆల‌యంలో ప‌నిచేస్తున్న కీల‌క ఉద్యోగులేన‌ని గుర్తించారు. వారిని విచారించారు. దోచుకున్న దానిలో కొంత బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు లేవు. ఇలా.. ప్ర‌సిద్ధ ఆల‌యాల్లోనే దోపిడీ జ‌రుగుతుంటే.. ఎలా? అనేది భ‌క్తులు సంధిస్తున్న ప్ర‌శ్న‌. దీనికి జ‌వాబుదారీ త‌నం ఉండాల‌ని.. షిర్డీ వంటి ఆల‌యాల్లో ఉన్న విధానం తీసుకురావాలని కోరుతున్నారు.