Begin typing your search above and press return to search.

ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ.. తెలుగు కూడా ఏ స్థానం అంటే?

దక్షిణ భారత రాష్ట్రాలు ప్రత్యేకంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హిందీపై తమదైన వైఖరి కలిగి ఉన్నాయి.

By:  Tupaki Political Desk   |   7 Dec 2025 1:45 PM IST
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ.. తెలుగు కూడా ఏ స్థానం అంటే?
X

భాష అనేది మనిషి నడిచే నేల, శ్వాసించే గాలి లాంటిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది కేవలం సంభాషణకు ఉపయోగించే సాధనం కాదు.. ఒక ప్రాంతపు గర్వం, కొంత సమూహం ప్రజల వ్యక్తిత్వం, ఒక జాతి సాంస్కృతిక మూలం. ముఖ్యంగా భారతదేశం లాంటి విభిన్నత గల దేశంలో భాష చుట్టూ రూపుదిద్ధుకునే చర్చలు కేవలం లెంగ్విస్టిక్ డిబేట్లు కావు.. అవి సామాజిక భావోద్వేగాలు, రాజకీయ అస్తిత్వ పోరాటాలు. ఈ నేపథ్యంలో ఎథ్నోలాగ్‌, ఇతర అంతర్జాతీయ వనరులు విడుదల చేసిన తాజా నివేదికలో అత్యధికంగా మాట్లాడే భాషల జాబితాలో భారతీయ భాషల ప్రాధాన్యాన్ని వెలుగులోకి తెచ్చాయి.

మాండరిన్ తర్వాత హిందీనే..

ఈ నివేదికలో అత్యంత ఎక్కవగా మాట్లాడబడే భాషగా 1.13 బిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగించే ఇంగ్లిష్ నిలిచింది. ఇది ఆశ్చర్యం కాదు.. శాస్త్రం, వ్యాపారం, విద్య, అంతర్జాతీయ సంబంధాలు అన్నింటిలోనూ ఇంగ్లిష్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఏ దేశానికి చెందిన వారైనా ఇంగ్లిష్ నేర్చుకుంటే ప్రపంచంతో కలిసిపోయే వేదిక దొరుకుతుంది. అందుకే ఇది ప్రపంచ భాషగా నిలిచింది. ఇదే సమయంలో 1.11 బిలియన్లతో చైనీస్ మాండరిన్ రెండో స్థానంలో ఉంది. చైనాలో జనాభా విస్తారమై ఉండడం, ఆ దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించడం దీనికి బలం. మాండరిన్‌ భవిష్యత్తులో మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కేవలం ఉత్తరాదికే సొంతం కాలేదు..

ప్రపంచ భాషల జాబితాలో భారత దేశం ప్రాధాన్యత ఎక్కడ కనిపించిందంటే అక్కడే వస్తుంది హిందీ. 615 మిలియన్ల మంది మాట్లాడే హిందీ, ప్రపంచంలో మూడో అత్యంత మాట్లాడబడే భాష. ఇది భారత జనాభాలో సగానికి పైగా ఉండే పరిమాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఉత్తర ప్రాంతాల్లో హిందీ మాట్లాడడం సహజం. కానీ ఇది కేవలం ఉత్తరానికి మాత్రమే పరిమితం అవుతున్న భాష కాదు. సినిమాలు, మీడియా, సోషల్ మీడియా, రియాలిటీ షోలు, రాజకీయ వేదికలు హిందీ ప్రభావం భారత సాంస్కృతిక ప్రవాహంలో బలంగా ఉంది.

వ్యతిరేకతలోనూ తట్టుకొని నిలుస్తున్న భాష..

దక్షిణ భారత రాష్ట్రాలు ప్రత్యేకంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హిందీపై తమదైన వైఖరి కలిగి ఉన్నాయి. భాష తప్పనిసరి (భాషా ఇంపోజిషన్) ఎప్పుడూ వివాదాస్పదమే. తమిళనాడు హిందీకి బాగా వ్యతిరేకంగా ఉటుందని మనకు తెలిసిందే. కర్నాటక కూడా తమ భాషా పరిరక్షణలో ముందుంటోంది. ఇంత ఒత్తిడిలోనూ హిందీ ప్రపంచ భాషల జాబితాలో మూడో స్థానం సంపాదించుకుంది. దేశంలో భాషా రాజకీయాలపై కొత్త చర్చలకు దారి తీస్తుంది.

తెలుగుకు కూడా ప్రాధాన్యం..

ఇక తెలుగు గురించి మాట్లాడితే ఇది నిజంగా గర్వపడదగ్గ విషయం.

93 మిలియన్ల తెలుగు మాట్లాడేవారితో తెలుగు ప్రపంచంలో 6వ అత్యధికంగా మాట్లాడే భాషల జాబితాలో చోటు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం జనాభా దాదాపు తెలుగు మాట్లాడుతారని చూస్తే ఈ సంఖ్య సహజమే. విదేశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు టెక్ రంగంలో పనిచేసే తెలంగాణ-ఆంధ్ర యువతతో తెలుగు గ్లోబల్ భాషగా మారుతోంది. అమెరికా పాఠశాలల్లో ఇప్పుడు తెలుగు కోర్సులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ‘స్వీట్ లాంగ్వేజ్’ అనే పేరుతో ఇప్పటికే గుర్తింపు పొందిన ఈ భాషకి ప్రపంచ వేదిక మీద కొత్త గుర్తింపు లభించింది.

కానీ ఈ జాబితాలో తమిళం, కన్నడ లాంటివి ఎందుకు కనిపించలేదు అనేది మరో చర్చ. ఇవి గొప్ప సాహిత్య సంప్రదాయాలు, శక్తివంతమైన మాట్లాడేవారి సంఖ్య ఉన్న భాషలే. అయినప్పటికీ, ప్రపంచ స్థాయిలో మాట్లాడే వారి సంఖ్య అంచనాలకు తగ్గట్లుగా లేదని ఈ నివేదిక తెలుపుతుంది. ఇది భాషా సంరక్షణ, భాషా విస్తరణ, భాషా వ్యాప్తికి సంబంధించిన పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతుంది. ప్రపంచీకరణ యుగంలో భాషలు పోటీపడుతున్నాయి. కొన్నింటి ప్రాబల్యం పెరుగుతండగా.. మరికొన్ని ప్రాంతీయ గౌరవంతో బతుకుతున్నాయి.

ప్రతి భాష వెనుక ఒక కథ ఉంది. ఒక జాతి కథ, ఒక ప్రాంతపు పోరాటం, ఒక కుటుంబపు వారసత్వం. ఈ జాబితా మనకు చెబుతున్న ఒక ముఖ్యమైన సందేశం ఏమిటంటే.. భాషా గర్వం ఉండాలి. భాషా పోరాటం అవసరం కావచ్చు. కానీ భాషను ప్రపంచానికి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా అంతే ముఖ్యం. భాషలు సంఖ్యలతో నిర్ణయించబడవు. అవి మాట్లాడేవారి ప్రేమతోనే నిలుస్తాయి. అందుకే హిందీకి మూడో స్థానం.. తెలుగుకు ప్రపంచ టాప్ భాషల్లో ఒక స్థానం.. ఇవన్నీ మన దేశపు సంస్కృతి ఎంత విస్తారమైందో చూపించే సూచికలు మాత్రమే.