మామ మరోసారి సీఎం...ప్రత్యర్ధులకు చుక్కలు
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ రెండవ మారు సీఎం అవుతున్నారు. ఆయన 2021లో తొలిసారి బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు.
By: Satya P | 5 May 2026 12:00 AM ISTఅస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ రెండవ మారు సీఎం అవుతున్నారు. ఆయన 2021లో తొలిసారి బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. అయిదేళ్ళ పాలన పూర్తి చేసుకున్న తరువాత మరోసారి తీర్పు కోరారు. ఏప్రిల్ 9న ఒకే విడతలో జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం గా తన పాలనను జనం ముందు పరీక్షకు పెట్టిన హిమంత బిశ్వ శర్మకు జనాలు సెంట్ పర్సెంట్ ఓట్లు వేసి మళ్ళీ నీవే మా సీఎం మామా అన్నారు. దాంతో 126 అసెంబ్లీ సీట్లు ఉన్న అస్సాంలో బీజేపీ వంద దాకా సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. కాంగ్రెస్ కి గతంలో ఉన్న సీట్లు కూడా మరిన్ని తగ్గిపోయాయి. దాంతో హిమంత బిశ్వ శర్మ దెబ్బా మజాకానా అని అంతా అంటున్నారు.
అందరికీ మామ :
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి 2016 లో చేరిన హిమంత బిశ్వ శర్మ ఆనాటి నుంచి కాషాయం పార్టీకి ఈశాన్యంలో విజయాల పంటనే పండిస్తున్నారు. తొలి పర్యాయం ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా బీజేపీకి ఇచ్చిన మాట మేరకు పనిచేశారు. దాంతో 2021లో మరోసారి బీజేపీ గద్దెనెక్కింది. బీజేపీ పెద్దలు కూడా హిమంతకు చెప్పిన ప్రకారం సీఎం ని చేశారు. ఇక గత అయిదేళ్ళూ అభివృద్ధి అజెండా మీదనే పాలన చేసి ఈశాన్యంలో వెనకబడిన అస్సాం ని ప్రగతిపధంలో శర్మ నడిపించారు. ముఖ్యంగా మహిళలు పేదలకు అనేక కార్యక్రమాలు అమలు చేశారు. దాంతో అందరూ ఆయన్ని మామా అని ముద్దుగా పిలుచుకోవడం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో కూడా పెద్ద సంఖ్యలో మహిళలు ఆయన వద్దకు వచ్చి కరచాలనం చేస్తూ నీరాజనాలు పలికారు. దాంతో బీజేపీ విజయం కన్ ఫర్మ్ పోయింది.
ప్రత్యర్ధిని చిత్తు చేసి :
అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ తో వచ్చిన అభిప్రాయ భేదాలు కారణంగా హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు. ఆ తరువాత అదే తరుణ్ గొగోయ్ ని సీఎం పీఠం నుంచి దించేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక అస్సాం పీసీసీ చీఫ్ గా ఉన్న ఆయన కుమారుడు గౌరవ్ గోగోయ్ ని తాజా ఎన్నికల్లో ఏకంగా ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోనీయకుండా చేసి చుక్కలు చూపించారు. అలా తండ్రీ కొడుకులు ఇద్దరి మీద తన రాజకీయ ప్రతీకారం శర్మ చూపించి వారిని ఓడించారు అని అంటున్నారు.
దీదీకి సైతం షాక్ :
అస్సాంలో ఎన్నికలు మొదటి విడతలో ఏప్రిల్ 9తో ముగియడంతో శర్మ పశ్చిమ బెంగాల్ కి షిఫ్ట్ అయ్యారు. బెంగాల్ లో రెండో విడత ఏప్రిల్ 29 న జరిగేంతవరకూ అంటే ఇరవై రోజుల పాటు అక్కడే మకాం వేసి మమతా దీదీని ఓడించేందుకు తనదైన వ్యూహాలను అమలు చేశారు. ఈ రోజున బెంగాల్ లో కమల వికాసం జరిగింది అంటే అందులో హిమంత బిశ్వ శర్మ తనదైన చాణక్య రాజకీయం కీలక పాత్ర పోషించింది. ఆయన భాగస్వామ్యం కూడా చాలా ఉంది అని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ వదిలేసుకున్న శర్మ బీజేపీకి అంది వచ్చిన ఆయుధంగా మారి కాంగ్రెస్ ని ఆ పార్టీ మిత్రులను కూడా ఓడించి పారేస్తున్నారు. అస్సాం మామ కాస్తా ఇపుడు దేశానికే మామగా మారుతున్నారు. బీజేపీలో ఇలాంటి నేతలకు ఎంతో ఫ్యూచర్ ఉంటుంది. మరి రెండోసారి వరసగా సీఎం కాబోతున్న హిమంత బిశ్వ శర్మ బీజేపీలో ఏ హోదాలను ముందు ముందు అందుకుంటారో చూడాల్సి ఉందని అంటున్నారు.
