Begin typing your search above and press return to search.

‘సతి’ శాపం.. వెలుగని దీపం.. ఆ ఊరికి ఈ ఏడూ దీపావళి లేదు!

ఈ సువిశాల భారతదేశంలో ఎన్నో నమ్మకాలు, మరెన్నో మూడు నమ్మకాలు.. ఎన్నో ఆచారాలు, మరెన్నో సిద్ధాంతాలు!

By:  Raja Ch   |   18 Oct 2025 10:00 PM IST
‘సతి’ శాపం.. వెలుగని దీపం.. ఆ ఊరికి ఈ ఏడూ దీపావళి లేదు!
X

ఈ సువిశాల భారతదేశంలో ఎన్నో నమ్మకాలు, మరెన్నో మూడు నమ్మకాలు.. ఎన్నో ఆచారాలు, మరెన్నో సిద్ధాంతాలు! అందులో కొన్ని వింటే ఆశ్చర్యం కలగగా, మరికొన్నింటిని గురించి వింటే షాక్ అనిపిస్తుంది, ఇంకొన్నింటి గురించి తెలుసుకుంటే ఆందోళనగా కూడా అనిపిస్తుంటుంది. ఈ క్రమంలో శతాబ్ధాలుగా ఓ శాపం వల్ల దీపావళి జరుపుకోని గ్రామం కథ మరోసారి చర్చకొచ్చింది.

అవును... దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగ జరుపుకోవడానికి అన్ని విధాలా సిద్ధమైపోయారు! పట్టణాల్లో ఉన్నవారు పల్లెలకు బయలుదేరారు.. వెళ్లనివారు షాపింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు! మరికొంతమంది ఇప్పటికే షాపింగ్ పూర్తి చేసుకుని, పిండి వంటలకు ప్లాన్స్ చేసుకుంటున్నారు! అయితే.. హిమాచల్ ప్రదేశ్ లోని ఓ గ్రామ మాత్రం అందుకు సిద్ధంగా లేదు.

వివరాళ్లోకి వెళ్తే... హిమాచల్ ప్రదేశ్‌ లోని హమీర్‌ పూర్ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో సమ్మూ అనే గ్రామం ఉంది. ఈ గ్రామ ప్రజలు శతాబ్ధాలుగా దీపావళి పండుగను జరుపుకోవడం లేదు. దీని వెనుక ఓ పెద్ద కారణమే ఉందని.. అది ఓ మహిళ ఈ గ్రామానికి పెట్టిన శాపం అని చెబుతున్నారు.

గ్రామస్తులు చెబుతోన్న వివరాల ప్రకారం... కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక గర్భిణీ స్త్రీ దీపావళి పండుగ చేసుకోవడానికి సిద్ధమవుతుండగా.. స్థానిక రాజు సైన్యంలో సైనికుడిగా ఉన్న ఆమె భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఆ స్త్రీ.. తన భర్త దహన సంస్కారాల మంటలో దూకి ఆత్మబలిదానం చేసుకుంది!

అయితే... ఆమె వెళ్ళే ముందు, ఆ గ్రామ ప్రజలు ఎప్పటికీ దీపావళి జరుపుకోలేరని శాపం విధించింది. ఆరోజు నుంచి వారు దీపావళి పండుగ జరుపుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా, ఎవరొకరు చనిపోవడం.. లేదా, గ్రామంలో ఏదైనా విపత్తు సంభవిస్తుందని నమ్మకంగా పెట్టుకున్నారని అంటున్నారు. దీంతో ఈ పండుగకు దూరంగా ఉంటున్నారు.

వాస్తవానికి ఈ శాపం తొలగడం కోసం అనేక పూజలు, యజ్ఞాలు చేశారట. ఇందులో భాగంగా... సుమారు మూడేళ్ల క్రితం ప్రత్యేక యజ్ఞం కూడా చేశారట. అయినా కూడా శాపం ఎఫెక్ట్ ఇంకా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలో... పండగ రోజు కొందరైతే ఇళ్ల నుంచి కూడా బయటకు రారని చెబుతున్నారు.