Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న ‘హిడ్మా’ ఎందుకిలా?

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆ పార్టీ గెరిల్లా ఆర్మీ కమాండర్ మాడ్వి హిడ్మా సోషల్ మీడియాలో ట్రెండింగ్ సబ్జెక్టుగా మారిపోయాడు.

By:  Tupaki Political Desk   |   24 Nov 2025 3:00 PM IST
సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న ‘హిడ్మా’ ఎందుకిలా?
X

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆ పార్టీ గెరిల్లా ఆర్మీ కమాండర్ మాడ్వి హిడ్మా సోషల్ మీడియాలో ట్రెండింగ్ సబ్జెక్టుగా మారిపోయాడు. గత వారం మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటరులో పోలీసులు హిడ్మాను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి హిడ్మాపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇనస్టా, ఎక్స్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఓపెన్ చేసినా హిడ్మాపై వీడియోలు, ఆయనకు సంబంధించిన ఫొటోలే కనిపిస్తున్నాయి. ఇక ఆయన స్వగ్రామం, హిడ్మా మృతదేహానికి జరిగిన అంత్యక్రియలను కూడా కవర్ చేసిన పలు యూట్యూబ్ చానళ్లు ఎక్కువ వీవర్ షిప్ పొందినట్లు విశ్లేషిస్తున్నారు.

ఒక మావోయిస్టు నాయకుడు కోసం ఇలా సోషల్ మీడియాలో చర్చ జరగడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వందల మంది పోలీసులను బలితీసుకున్న హిడ్మాను అమరుడు అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక హిడ్మా దళంలోకి ఎలా వచ్చాడు? ఎలా ఎదిగాడు? ఆయన కుటుంబం, తల్లిదండ్రులు, భార్య ఇలా అతడి వ్యక్తిగత జీవితం తెలుసుకునేందుకు ఎక్కువ మంది సోషల్ మీడియాను సెర్చ్ చేస్తున్నారు. అదేవిధంగా హిడ్మా వారసుడిగా వస్తున్నవాడిపైనా ఇలాంటి ఆసక్తే ప్రదర్శిస్తున్నారని అంటున్నారు.

నిజానికి ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు ఉద్యమం అవసాన దశకు చేరుకుంది. మావోయిస్టు పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీల్లో కలిసి ఇద్దరు ముగ్గురు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో హిడ్మా మరణంపై సోషల్ మీడియా ఫోకస్ చేయడమే చర్చనీయాంశంగా మారింది. బయట ప్రపంచానికి పెద్దగా తెలియని, ఎప్పుడూ అడవి దాటి బయటకు రాని హిడ్మాకు అంత క్రేజ్ ఎందుకని పోలీసు వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక ఆదివాసీ తెగలలో హిడ్మాకు కొంతవరకు గుర్తింపు ఉంది. ఎన్కౌంటర్ తర్వాత వారి నుంచి సానుభూతి వస్తుందని ఊహించినా, అతడితో సంబంధం లేని వర్గాలు సైతం సోషల్ మీడియాలో హిడ్మా కంటెంట్ ను చూస్తుండటమే అంతుచిక్కడం లేదని అంటున్నారు.

మావోయిస్టు ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తోంది. భద్రతా బలగాలకు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చి రంగంలోకి దింపింది. అయితే మావోయిస్టులకు ప్రజల నుంచి ఆదరణ తగ్గిపోవడం కూడా వారిపై భద్రతా బలగాలు పట్టు సాధించేందుకు కారణమైన అంశాల్లో ప్రధానమైనది అంటున్నారు. ప్రస్తుతం అన్నిరకాల సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి రావడం, ప్రజల్లో చైతన్యం పెరగడంతో విప్లవోద్యమంపై యువత ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి.

ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు యువతకు మావోయిస్టు ఉద్యమంపై సరైన అవగాహన కూడా లేదని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మావోయిస్టు నేత అయిన హిడ్మా మరణంపై కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాను ఆక్రమించడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హిడ్మాకన్నా ముందు మావోయిస్టు పార్టీకి చెందిన నంబాళ్ల కేశవరావు, గాజర్ల రవి, సుధాకర్ ఇలా చాలా మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ అయ్యారు. వారి ఎవరిపైనా కనిపించని సానుభూతి హిడ్మా ఎన్కౌంటరుపై కనిపిస్తోందని కూడా అంటున్నారు. దీనికి నిదర్శనమే ప్రస్తుతం ట్రెండింగు అవుతున్న వీడియోలను ఉదహరిస్తున్నారు.