Begin typing your search above and press return to search.

మావోయిస్టు పార్టీల్లో అంతర్ యుద్ధం.. హిడ్మా ఎన్కౌంటరుకు దేవ్ జీ సహకారం?

ఛత్తీస్‌గఢ్‌లోని కొంటా మాజీ ఎమ్మెల్యే అయిన మనిష్ కుంజం బస్తర్ ప్రాంతంలో గిరిజన నాయకుడిగా చలామణి అవుతున్నారు.

By:  Tupaki Political Desk   |   25 Nov 2025 4:38 PM IST
మావోయిస్టు పార్టీల్లో అంతర్ యుద్ధం.. హిడ్మా ఎన్కౌంటరుకు దేవ్ జీ సహకారం?
X

అవసాన దశలో ఉన్న మావోయిస్టు పార్టీలో అంతర్ యుద్ధం కూడా పెద్ద ఎత్తున సాగుతోందా? మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ ప్లటూన్ కమాండర్, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా ఎన్కౌంటరుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కారణమన్న ఆరోపణల్లో నిజమెంత? అన్నది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఎన్కౌంటరులో మరణించిన హిడ్మాపై దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా గిరిజన సమాజంలో సానుభూతి వ్యక్తమవుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హిడ్మా మరణం తర్వాత ఆయన జీవిత చరిత్రపై వివిధ మాధ్యమాల్లో కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో హిడ్మా ఎన్కౌంటరుకు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ కారణమని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మనిష్ కుంజం ఆరోపించడం సంచలనంగా మారింది.

ఛత్తీస్‌గఢ్‌లోని కొంటా మాజీ ఎమ్మెల్యే అయిన మనిష్ కుంజం బస్తర్ ప్రాంతంలో గిరిజన నాయకుడిగా చలామణి అవుతున్నారు. సీపీఐ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా) నాయకుడైన మనిష్ కుంజం తాజాగా మీడియాతో మాట్లాడుతూ, హిడ్మా ఎన్కౌంటరు వెనుక దేవుజీ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. లొంగిపోదామని చెప్పి ఆంధ్రా ప్రాంతానికి హిడ్మాను తీసుకెళ్లిన దేవుజీ పోలీసులకు సమాచారమిచ్చి హిడ్మాను చంపించి, మిగిలిన వారిని అరెస్టు చేయించి తాను మాత్రం తప్పించుకున్నాడని మాజీ ఎమ్మెల్యే మనిష్ కుంజం ఆరోపిస్తున్నారు.

నిజానికి హిడ్మా కూడా లొంగిపోవాలని అనుకున్నారని, గిరిజనుల సమక్షంలో తన లొంగుబాటును ప్రకటించాలని ఆయన భావించారని ఛత్తీస్‌గఢ్‌ మీడియాకు మనిష్ కుంజం వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోవాలని భావించిన హిడ్మా ఆంధ్రాకు ఎందుకు వెళతాడని గిరిజన నాయకులు అనుమానిస్తున్నారు. అందుకే ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గిరిజన నేతల ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. హిడ్మా నిజమైన ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయాడని స్పష్టం చేస్తున్నారు. అయితే ఎన్‌కౌంటర్‌పై ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ, హిడ్మాపై దేవుజీ కుట్ర చేశాడన్న ఆరోపణలే సంచలనంగా మారుతున్నాయి.

మావోయిస్టు పార్టీలో తెలుగు నేతల ఆధిపత్యంపై ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు నేతలు చదువుకున్న వారు కావడంతో మావోయిస్టు పార్టీ నాయకత్వం చేపట్టి, గిరిజన నేతలపై ఆధిపత్యం చెలాయించేవారని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఈ అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. మావోయిస్టుల్లో ఎక్కువ మంది గిరిజనులే.. క్షేత్రస్థాయిలో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారని, కానీ నాయకత్వం అంతా తెలుగువారి చేతుల్లో పెట్టుకున్నారని విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిడ్మా ఎన్కౌంటరు తర్వాత తెలుగు నేతల పాత్రపై గిరిజన నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. మావోయిస్టుల్లో హిడ్మా ప్రాబల్యం పెరగడం, అతడిని అడ్డు తొలగించుకోడానికి పార్టీ అగ్రనాయకత్వమే కుట్ర చేసిందన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయని అంటున్నారు.