ఇంట్లోనే ప్రతిపక్షం
అవును... ఇదే నిజం ఇంట్లోనే ప్రతిపక్షం ఉంటుంది. దానిని ఊహించడం కష్టం. ఊహించినా గుర్తించినా ఎదుర్కోవడం ఇంకా కష్టం.
By: Satya P | 18 May 2026 6:00 AM ISTఅవును... ఇదే నిజం ఇంట్లోనే ప్రతిపక్షం ఉంటుంది. దానిని ఊహించడం కష్టం. ఊహించినా గుర్తించినా ఎదుర్కోవడం ఇంకా కష్టం. దానికి కారణాలు అనేకం. క్లుప్తంగా చెప్పాలీ అంటే మనిషి జీవితం చిత్ర విచిత్రం. మనిషి చూపు ఎప్పుడూ ఎదుటి వైపే ఉంటుంది. వెనక చూపు అసలు ఉండదు. తన వైపు నుంచి తన లోతుల గురించి చూసే తీరిక ఓపిక ఆలోచన అవకాశం అంతగా ఉండదు. ఎందుకంటే మనిషి ఒకవైపే చూస్తాడు, ఆ వైపే ఎక్కువగా ఆలోచిస్తాడు అందుకే అతని చూపులు కూడా ఎదుటివారి మీదనే ఉంటాయి.
కారణం వారే అంటూ :
తనకు ఏ రకమైన కష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా లేక తనకు సమస్యలు వచ్చినా ఎదుటి వాడి వల్లనే అనుకుంటాడు. అలా ఎదుటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకే ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ ఎంతసేపు ఆ వైపుగానే చూస్తాడు. ఎదుటి వాళ్ళ వ్యూహాలకి ప్రతి వ్యూహం ఆలోచిస్తాడు. అయితే ఇబ్బందులు ఎపుడూ ఎదుటి శత్రువు నుంచి త క్కువగా వస్తాయి. అసలైన ఇబ్బందులు అనూహ్యమైనవి కూడా ఇంటి వారి నుంచి సొంత వారి నుంచే వస్తాయి. అలా బయట పోరాడి ఎంతగానో గెలిచినా కూడా ప్రతీ మనిషీ తన ఇంట్లో మాత్రం దారుణంగా ఓడిపోతాడు. అది కూడా తన వాళ్ల చేతిలోనే ఓడిపోతాడు.
బలహీనతలతోనే :
బహుశా అది రక్తసంబంధం వల్లనా లేక తనవాళ్లే అని పూర్తిగా గుడ్డిగా నమ్మడం వలన లేక అప్రమత్తంగా లేకపోవడం వలన ఇలా ఏది చెప్పుకున్నా ఓకే. కానీ ఏదైతేనేమి ఎవరికైనా పెద్దగా శత్రువులు కానీ ప్రత్యర్ధులు కానీ ఎక్కడో ఉండరు. సొంత ఇంట్లోనే తన వాళ్ళ రూపంలోనే ఉంటారు. అందుకే ఆ మధ్య వచ్చిన ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చెబుతుంది శత్రువులు ఎక్కడో లేరు మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు మన చెల్లెలు గాని కూతుళ్ళగాను వారే ఉంటారు అని. వర్తమాన రాజకీయం చూడండి దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎంతో మంది తనవాళ్ళు తన వాళ్ళు రక్తసంబంధీకుల తో ఇబ్బంది పడుతున్న వారుగా కనిపిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే సన్ స్ట్రోక్ షాకులు తిన్న వాళ్ళు పెద్ద లిస్టు గానే ఉన్నారు. కూతుళ్ళతోనూ షాకులు తింటున్న వాళ్ళు ఉన్నారు చెల్లెళ్ల చెలగాటంతో రాజకీయ జాతకాలు తిరకాసు అవుతున్న అన్నలూ ఉన్నారు. ఇలా చాలామంది వెతికి చూస్తే కనిపిస్తారు.
ఎవరూ పసిగట్టలేరు :
నిజానికి బయట శత్రువు వీళ్ళతో పోలిస్తే తక్కువే అనిపిస్తుంది. అతన్ని పోరాటం ఎదురుగా ఉంటుంది కాబట్టి అంచనా వేసేందుకు వీలుంటుంది. కానీ ఇంటి శత్రువులని మాత్రం ఎవరూ పసిగట్టలేరు. ఎదుటి శత్రువులతో పోరాటం కష్టమే అయినా అందులో సులువు ఉది. కానీ ఇంటి వారితో మాత్రం బాబోయ్ అనిపిస్తుంది. అందుకే చాలామంది ఇంట్లో వాళ్ళ వాళ్ళ చేతుల్లోనే పదవీచ్యుతులు అయిన సందర్భాలు కూడా కళ్ళ కనిపిస్తాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఎంతో కష్టపడి ఎంతో ఇబ్బంది పడి మెట్టూ మెట్టూ ఎక్కుతూ గట్టు గుట్ట దాటుకుంటూ రాజకీయంగా కీలక స్థానంలోకి వచ్చిన వారికి దెబ్బ బయట వాళ్ల నుంచి పడితేనే తట్టుకోలేరు. అలాంటిది సొంతవాళ్ళ నుంచి పడితే మాత్రం ఒక్కసారిగా కుప్పకూలిపోతారు.
ఒక్క దెబ్బకు మటాష్ :
నిజానికి ఇందులో వాళ్ళ తప్పు ఉండదు, కానీ వాళ్ళే చివరికి బాధ్యులు అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ తోనే వీళ్ళు బయట కనిపిస్తారు, పాపం ఈ కేరాఫ్ అడ్రస్ ఒక్కటి చాలు అసలుకే ఎసరు పెట్టేస్తుంది. దాంతో దశాబ్దాల కష్టం ఎంతో పోరాటం చేసి ఎదిగిన వైనం ఈ ఒక్క దెబ్బకు మటాష్ అవుతాయి. ఉన్న పేరు ప్రఖ్యాతి హోదా గౌరవం అన్నీ కూడా అలా గాలికి ఎగిరిపోతాయి. ఇందులో తప్పు ఎవరిది అన్నది పక్కన పెడితే మాత్రం అనుభవించేది మాత్రం ఇంటి పెద్దలే. పదవులు పరువు అన్నీ కాపాడుకుని వచ్చిన వారే. ఎంత కసి తీరా కన్నీళ్లు పెట్టిన మరింతగా వేసారినా కూడా ఇంటి శత్రువుల నుంచి తప్పించుకోవడం ఎవరికైనా చాలా కష్టం. అందుకే బలి అయిపోవడం బంధీ అయిపోవడమే చరిత్రలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఇంట్లో ప్రతిపక్షం ఉంటే పక్కలో పామున్నట్లే మరి.
