Begin typing your search above and press return to search.

ఇరాన్ ఒంట‌రి కాదు.. ఆ దేశం వెనుక అతిపెద్ద శ‌క్తులు !

అమెరికా, ఇజ్రాయిల్ ఒక‌వైపు.. ఇరాన్ మ‌రోవైపు. యుద్ధం చూస్తున్న మ‌న‌కు పిక్చ‌ర్ ఇలాగే క‌నిపిస్తుంది.

By:  A.N.Kumar   |   10 March 2026 1:29 PM IST
ఇరాన్ ఒంట‌రి కాదు.. ఆ దేశం వెనుక అతిపెద్ద శ‌క్తులు !
X

అమెరికా, ఇజ్రాయిల్ ఒక‌వైపు.. ఇరాన్ మ‌రోవైపు. యుద్ధం చూస్తున్న మ‌న‌కు పిక్చ‌ర్ ఇలాగే క‌నిపిస్తుంది. కానీ యుద్ధంలో అదృశ్య శ‌క్తులు ఉన్నాయి. వెన‌క నుంచి పోరాడుతున్నాయి. కానీ నేరుగా యుద్ధ‌రంగంలోకి దిగ‌వు. ప్ర‌పంచ పోలీస్ పీచ‌మ‌ణ‌చ‌డ‌మే అదృశ్య శ‌క్తుల ల‌క్ష్యం. యుద్ధం అనంత‌ర ప‌రిణామాలు త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డ‌మే అదృశ్య శ‌క్తుల టార్గెట్. అందుకే తెర వెనుక ఉండి యుద్ధం చేస్తున్నాయి. చేయిస్తున్నాయి.

అదృశ్య శ‌క్తులెవ‌రు ?

ఇరాన్ ఒంట‌రిగా పోరాడుతోంది. కానీ ఖచ్చిత‌మైన టార్గెట్ల‌ను చేధిస్తోంది. గ‌ల్ఫ్ దేశాల్లోని యూఎస్ బేస్ ల‌పై దాడి చేస్తోంది. ఆయిల్ రిఫైన‌రీల‌పై దాడి చేసి ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఒత్తిడి తెస్తోంది. హార్మూజ్ జ‌ల‌సంధి దిగ్బంధ‌నం చేసి ప్ర‌పంచ వాణిజ్యాన్ని షేక్ చేస్తోంది. ఇదంతా కేవ‌లం ఇరాన్ మాత్ర‌మే చేయ‌డం లేదన్న చ‌ర్చ ఉంది. దీని వెనుక చైనా ఉంది. ర‌ష్యా ఉంది. చైనా ఇరాన్ ఆయిల్ కొంటోంది. టెక్నాల‌జీ, ఆయుధాల‌ను అందిస్తోంది. ర‌ష్యా కూడా బ‌హిరంగ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ కీల‌క ఆయుధ‌, సైనిక స‌మాచారాన్ని చేర‌వేస్తోంది. అందుకే ఇరాన్ టార్గెట్లు గురిత‌ప్ప‌డం లేదని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇరాన్ వెనుక ఉన్న అదృశ్య శ‌క్తులు చైనా, ర‌ష్యాలే.

యుద్ధంలోకి ఎందుకు దిగ‌వు ? :

ర‌ష్యా ఇప్ప‌టికే ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది. నేరుగా యూఎస్ తో త‌ల‌ప‌డితే అది మూడో ప్ర‌పంచ యుద్ధానికి దారితీస్తుంది. కాబ‌ట్టి యుద్ధం త్వ‌ర‌గా ముగించే ఆలోచన చేయాల‌ని ట్రంప్ ను కోరుతోంది. అదే స‌మ‌యంలో ఇరాన్ సుప్రీం లీడ‌ర్ మొజ్త‌బ ఆయ‌తుల్లా ఎన్నిక‌ను బ‌హిరంగంగా స్వాగ‌తించింది. త‌ద్వారా తాము ఇరాన్ ప‌క్షాన ఉన్న‌ట్టు ప‌రోక్షంగా ప్ర‌క‌టించింది. చైనా యుద్ధం చేయ‌డం ద్వారా న‌ష్టం త‌ప్ప లాభం లేద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికా యుద్ధానంత‌ర ప‌రిణామాలు త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ఎత్తుగ‌డ‌తో చైనా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇరాన్ గ‌ల్ఫ్ దేశాల‌పై దాడి భ‌విష్య‌త్తులో చైనాకు క‌లిసొస్తుంది.

చైనా ఎలా లాభ‌ప‌డుతుంది ?

అమెరికా గ‌ల్ఫ్ దేశాల‌తో మైత్రీ కొన‌సాగిస్తూ డాల‌ర్ ఆధిప‌త్యాన్ని నిలుపుకుంటోంది. ఇరాన్ గ‌ల్ఫ్ దేశాల‌పై నిరంత‌ర దాడి.. గ‌ల్ఫ్ దేశాలు అమెరికాతో స్నేహం గురించి ఆలోచించాల్సిన ప‌రిస్థితి తీసుకొచ్చింది. యుద్ధం ముగిసిన అనంత‌రం అమెరికాతో స్నేహ బంధం, పెట్టుబ‌డులు, వాణిజ్య సంబంధాలు మంచిది కాద‌న్న అభిప్రాయానికి గ‌ల్ఫ్ దేశాలు వ‌చ్చే ప‌రిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే అమెరికాతో సంబంధాల కార‌ణంగా గ‌ల్ఫ్ దేశాలు ఇరాన్ టార్గెట్ అవుతాయి. ఫ‌లితంగా గ‌ల్ఫ్ దేశాలు విదేశీ పెట్టుబ‌డుల‌కు, నివాసానికి ఏమాత్రం భ‌ద్ర‌మైన‌ ప్రాంతం కావు. అమెరికాతో స్నేహం, ఇరాన్ దాడులు గ‌ల్ఫ్ దేశాల‌పై ఇన్నాళ్లు పెట్టుబ‌డిదారుల‌కు ఉన్న అభిప్రాయాల‌ను తొలగిస్తున్నాయి. దీనివ‌ల్ల గ‌ల్ఫ్ దేశాల బ్రాండ్ ఇమేజ్ దెబ్బ‌తింటుంది. కాబ‌ట్టి అమెరికాతో స్నేహం గురించి ఆలోచించాల్సి వ‌స్తుంది. ఇది చైనాకు అడ్వాంటేజ్ అవుతుంది. చైనా అమెరికా పొజిష‌న్ లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. మిడిల్ ఈస్ట్ లో చైనా డామినెన్స్ పెరిగితే చైనాకు మ‌రింత ప‌ట్టు దొరుకుతుంది. ఇది జియో పాలిటిక్స్ ను మార్చేస్తుంది. అందుకే చైనా యుద్ధం చేయ‌కుండా, యుద్ధానంత‌ర ప‌రిణామాలను క్యాష్ చేసుకోవ‌డానికి చూస్తోంది.