Begin typing your search above and press return to search.

వరుణుడు చంద్రబాబు పార్టీలో చేరిపోయాడా?

వరుణుడు ఏ పార్టీ..? వర్షాకాలంలో ఏపీలో వరుణుడు కోసం ప్రత్యేకంగా చర్చ జరుగుతుంటుంది.

By:  Tupaki Political Desk   |   25 Oct 2025 1:00 PM IST
వరుణుడు చంద్రబాబు పార్టీలో చేరిపోయాడా?
X

వరుణుడు ఏ పార్టీ..? వర్షాకాలంలో ఏపీలో వరుణుడు కోసం ప్రత్యేకంగా చర్చ జరుగుతుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ సందర్భంలో సరదాగా చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాతి కాలంలో రాజకీయ అంశంగా మారిపోయింది. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో వర్షాలు కురవకపోవడం, ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కాలంలో వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిస్తే, ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుపై వ్యంగ్యంగా విమర్శలు గుప్పించడానికి వరుణుడు తమ పార్టీగా చెప్పుకునేవారు. ఇక వైఎస్ తదనంతరం కూడా చంద్రబాబు ప్రత్యర్థులు ఆయనను విమర్శించేందుకు వరుణుడిని ఒక అస్త్రంగా చేసుకునేవారు.

చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా వర్షాలు సరిగా కురవని ఒక సెంటిమెంటును లేపడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. గత ప్రభుత్వంలో కూడా మాజీ సీఎం జగన్ అనుకూల మీడియా వర్షాకాలంలో ఆయనకు అనుకూలంగా ప్రచారం చేసేది. అయితే ఈ ఏడాది కురుస్తున్న వర్షాలతో వరుణుడు కూడా పార్టీ మార్చేసినట్లు కనిపిస్తోందనే సరదా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న వర్షాలను పరిగణనలోకి తీసుకుంటున్న సోషల్ మీడియా కార్యకర్తలు వరుణుడు చంద్రబాబు పార్టీలో చేరిపోయినట్లు ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ మీడియా కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేస్తోంది.

చంద్రబాబు 4.0 ప్రభుత్వంలో ఇది రెండో వర్షాకాలం. గత ఏడాది కూడా రాష్ట్రంలో సాధారణ వర్షాలు కురిశాయి. ఇప్పుడు కూడా నైరుతి రుతుపవనాల సీజన్ లో సాధారణం కంటే కాస్త ఎక్కువగానే వర్షపాతం నమోదైంది. ఇక ఈ నెల 16 నుంచి ప్రారంభమైన ఈశాన్య రుతుపవనాల సీజన్ లో కూడా అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కరువు సీమ రాయలసీమలో సైతం విస్తారంగా వర్షాలు పడుతుండటంతో చంద్రబాబుకు ఆయనప పార్టీ తెలుగుదేశంకి వరుణుడు టెన్షన్ వదిలేసిందన్న టాక్ వినిపిస్తోంది.

భారత వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఈ నైరుతి సీజన్లో ఏపీలో 530.9 మి.మీ వర్షపాతం కురిసింది. ఇదా రాష్ట్ర సగటు కంటే కొద్దిగా ఎక్కువ అని చెబుతున్నారు. ప్రధానంగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో స్వల్పంగా తగ్గినా ఈశాన్య రుతుపవనాల సీజన్ లో కురిసే వర్షాలతో లోటును అధిగమించే అవకాశం ఉందని అంటున్నారు. నైరుతిలో కురిసిన వర్షాలు, సమర్థవంతమైన వాటర్ మేనేజ్మెంట్ వల్ల ఏపీలో ప్రస్తుత పంటల సీజన్ కూడా ఆశాజనకంగానే ఉంది. అయితే ఈశాన్య రుతుపవనాల వల్ల కురిసే అధిక వర్షాలు పంటల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఏదిఏమైనా ఈ సీజన్ లో కురిసిన వర్షాల వల్ల వరుణుడు కూడా చంద్రబాబు పార్టీలో చేరాడని సరదా ప్రచారం జరుగుతోంది.