Begin typing your search above and press return to search.

ఎలక్ట్రిక్ విమానం: 500 టికెట్‌తో నెక్ట్స్‌ లెవెల్ ట్రావెలింగ్ విప్లవం!

హార్ట్ ఏరోస్పేస్ సంస్థ తమ మొదటి ప్రొడక్షన్ మోడల్ అయిన `ఈఎస్-30` తయారీ కోసం ఈ `ఎక్స్1` ప్రయోగాన్ని ఉపయోగించుకుంటోంది.

By:  Sivaji Kontham   |   21 Aug 2026 1:00 AM IST
ఎలక్ట్రిక్ విమానం: 500 టికెట్‌తో నెక్ట్స్‌ లెవెల్ ట్రావెలింగ్ విప్లవం!
X

ప్రపంచ రవాణా రంగంలో పర్యావరణహిత విద్యుత్ వాహనాలు కొత్త విప్లవాన్ని తీసుకు రానున్నాయా అంటే అవున‌నే స‌మాచారం. ఇప్పటికే రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు, బైక్‌లతో పాటు రైల్వేల్లో ఇ-ట్రైన్లు హవా నడుస్తుండగా తదుపరి భారత్ సహా ప్రపంచ దేశాలు స్వీకరించబోయేది `ఎలక్ట్రిక్ విమానాల` టెక్నాలజీయే. ఈ దిశగా అత్యంత కీలకమైన మైలురాయి నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం `హార్ట్ ఎక్స్1` ఇటీవల తన తొలి ప్రయోగాత్మక విమానాన్ని విజయవంతంగా నిర్మించింది. అమెరికాలోని న్యూయార్క్ స్టేట్ ప్లాట్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 12 ఆగస్టు 2026న ఆకాశంలోకి ఎగిరిన ఈ విమానం.. 27 నిమిషాల పాటు ప్రయాణించి గగనతలంలో 1100 అడుగుల ఎత్తును తాకింది.

ఈ విమానం కేవలం సాంకేతికంగానే కాకుండా ఆర్థికంగానూ విమానయాన రంగ రూపురేఖలను మార్చబోతోంది. 25,000 పౌండ్ల బరువు, 106 అడుగుల రెక్కల వెడల్పుతో నడిచే ఈ హార్ట్ ఎక్స్1 విమానం ఒక మెగావాట్ కంటే ఎక్కువ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తూ ఎగిరింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ 27 నిమిషాల ప్రయాణానికి అయిన విద్యుత్ ఖర్చు కేవలం సుమారు 5 డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ. 400 నుండి రూ. 500) మాత్రమే! విమానయాన చరిత్రలోనే కమర్షియల్ స్థాయిలో విద్యుత్ శక్తితో ప్రయాణించవచ్చని హార్ట్ ఏరోస్పేస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆండర్స్ ఫోర్స్‌లండ్ ఈ శుభ‌సంద‌ర్భంలో స్పష్టం చేశారు.

హార్ట్ ఏరోస్పేస్ సంస్థ తమ మొదటి ప్రొడక్షన్ మోడల్ అయిన `ఈఎస్-30` తయారీ కోసం ఈ `ఎక్స్1` ప్రయోగాన్ని ఉపయోగించుకుంటోంది. త‌దుప‌రి ఈఎస్-30 విమానం 30 మంది ప్రయాణికుల సామర్థ్యంతో సంప్రదాయ ప్రాంతీయ విమానాల కంటే 40 శాతానికి పైగా నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు. తగ్గిన ఇంధన ఖర్చులు, సులువైన నిర్వహణ వ్యవస్థ, తక్కువ కాలుష్య పన్నులు వంటి అంశాలు విమాన టికెట్ల ధరలను భారీగా తగ్గించేందుకు ఆస్కారం ఉంది. ఈ మోడల్ విమానాలు 2028 నాటికి ట్రయల్స్ పూర్తి చేసుకుని... 2031 నాటికి పూర్తిస్థాయి కమర్షియల్ సేవల్లోకి రానున్నాయి.

ఈ విద్యుత్ విమానాల సాంకేతికత అందుబాటులోకి వస్తే.. స్వల్ప దూర ప్రయాణాలకు ఇవే ప్రధాన రవాణా సాధనాలుగా మారనున్నాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ కెనడా వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ విమానాల కోసం వందలాది ఆర్డర్లు ఇచ్చాయి. భవిష్యత్తులో ఈ రకం విమానాలు అందుబాటులోకి వస్తే.. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విమాన ప్రయాణ శకం మారే ఛాన్సుంది. విజయవాడ-అమరావతి నుంచి హైదరాబాద్ లేదా వైజాగ్ వంటి నగరాలకు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో చేరుకోవడానికి ఈ ఎలక్ట్రిక్ విమానాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్లడానికి రోడ్డు మార్గంలో ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వ‌చ్చాయి. ఎల‌క్ట్రిక్ రైళ్లు కూడా జోరందుకోబోతున్నాయ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. రోడ్డు రవాణా, రైల్వేల తర్వాత వైమానిక రంగం కూడా ఈ రకమైన హరిత శక్తిని సొంతం చేసుకుంటే.. తక్కువ దూరాల ప్రయాణాల‌కు క‌చ్ఛితంగా ఇవే హవా నడిపిస్తాయి. సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో విమాన ప్రయాణాన్ని అందించే ఈ నెక్స్ట్ లెవెల్ ఎలక్ట్రిక్ ఫ్లైట్ ప్రాజెక్ట్, గ్లోబల్ విమానయాన రంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకువెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.