Begin typing your search above and press return to search.

కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ మధ్య తేడా ఏంటి..లక్షణాలు ఏంటి.. ఎలా నిర్ధారిస్తారు?

దీంతో అసలు హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి? కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? అనే విషయం కూడా బహుశా చాలామందికి తెలియకపోవచ్చు.

By:  Madhu Reddy   |   19 Sept 2025 7:00 AM IST
కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ మధ్య తేడా ఏంటి..లక్షణాలు ఏంటి.. ఎలా నిర్ధారిస్తారు?
X

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది చిన్నవయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న సందర్భాలు చాలానే చూస్తున్నారు. పైగా కరోనా వచ్చిన తర్వాత కరోనా నివారణ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్లే ఇలా జరుగుతున్నాయని చాలామంది భావిస్తున్నారు కూడా.. అయితే ఇదంతా పక్కన పెడితే హార్ట్ ఎటాక్ గురించి చాలాసార్లు విన్నాం.. అయితే ఇప్పుడు హార్ట్ ఎటాక్ మాత్రమే కాదు హార్ట్ ఫెయిల్యూర్ , కార్డియాక్ అరెస్ట్ అంటూ కొత్త కొత్త పేర్లు వెలుగు చూస్తున్నాయి. మరి గుండెపోటులో కూడా ఇన్ని రకాల సమస్యలు ఉంటాయా అని ఇది తెలిసిన చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో అసలు హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి? కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? అనే విషయం కూడా బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ముఖ్యంగా ఈ మూడింటి మధ్య లక్షణాలు ఎలా ఉంటాయి? అనే విషయం కూడా తెలియదనే చెప్పాలి. మరి గుండెకు సంబంధించిన ఈ సమస్యలను ఎలా కనుగొంటారు? ఒక్కొక్క సమస్య లక్షణాలు ఏమిటి? అనే విషయాలను వివరంగా తెలియజేశారు ప్రముఖ కార్డియాలజిస్ట్ శరత్ రెడ్డి. తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఈ మూడింటి మధ్య తేడాలను వివరించడమే కాకుండా ఈ మూడింటి లక్షణాలను కూడా అందరికీ తెలియజేస్తూ.. వీటిపై అవగాహన కల్పించారు.

1). హార్ట్ ఎటాక్ అంటే ఏంటి?

హార్ట్ ఎటాక్ అనేది .. గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే ధమనులలో అడ్డం ఏర్పడినప్పుడు (హార్ట్ బ్లడ్ వెజెల్ సడన్ గా బ్లాక్ అయినప్పుడు) వచ్చే సమస్య.

హార్ట్ ఎటాక్ లక్షణాలు ఏంటి)

ఈ హార్ట్ ఎటాక్ లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్నికొస్తే ఛాతీ మధ్యలో నొప్పి, భారం, పిండేసినట్లు అనిపించడం, కొద్ది నిమిషాల కంటే ఎక్కువ సేపు నొప్పి ఉండడం లేదా తగ్గిపోయి మళ్ళీ రావడం లాంటి సమస్యలు ప్రథమంగా కనిపిస్తాయి. అంతేకాదు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఆకస్మికంగా శరీరం చల్లబడడం, ఎడమ చేయి, భుజం, దవడ, మెడ వీపు భాగంలో అధిక నొప్పి రావడం, మహిళల్లో అయితే వికారం, వాంతులు భరించలేని బలహీనత, వివరించలేని తీవ్రమైన అలసట లాంటి లక్షణాలు ప్రథమంగా కనిపిస్తాయి.

హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది?

హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది? అనే విషయానికి వస్తే గుండె కండరాలకు ఆక్సిజన్ అందించే కొరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోయి రక్తం సరఫరాను అడ్డుకుంటాయి. ఈ అడ్డంకి వల్లే కండరాలకు రక్తప్రసరణ ఆగిపోయి గుండెపోటు వస్తుంది.

2).హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి?

హార్ట్ ఫెయిల్యూర్ అంటే.. శరీర అవసరాలకు తీర్చడానికి అవసరమైనంత రక్తాన్ని గుండె సమర్థవంతంగా పంప్ చేయలేని పరిస్థితి(హార్ట్ పంపింగ్ తగ్గిపోవడం).

హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు ఎలా ఉంటాయి?

దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే? గుండె కండరాల బలహీనత , శ్వాస ఆడక పోవడం, కడుపులో వాపు , ఊహించని బరువు పెరగడం , కాళ్లు, చేతులు వాపు రావడం, అలసట, గుండె లయ సరిగ్గా లేకపోవడం లాంటి లక్షణాలు ప్రథమంగా కనిపిస్తాయి.

హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి కారణం?

గుండె కండరాల బలహీనత లేదా గట్టిపడటం వల్ల గుండె సరిగ్గా రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేయలేకపోతుంది. అలాగే అధిక రక్తపోటు పరిస్థితులు కూడా హార్ట్ ఫెయిల్యూర్ కి దారి తీయవచ్చు.

3). కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి?

కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె సడన్గా కొట్టుకోవడం ఆగిపోయే పరిస్థితి. ఎప్పుడైతే గుండె శరీర భాగాలకు రక్తాన్ని పంపు చేయడం ఆపేస్తుందో.. మెదడు , ఇతర అవయవాలకు రక్త సరఫరా నిలిచిపోయి స్పృహ కోల్పోతారు.

కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు ఏమిటి?

కార్డియాక్ అరెస్ట్ లక్షణాల విషయానికొస్తే.. అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, స్పృహ కోల్పోవడం, గుండె స్పందన లేకపోవడం, శ్వాస లేకపోవడం, ఒకరకంగా చెప్పాలి అంటే మనిషి ప్రాణం పోయినప్పుడు ఎలా ఉంటారో అలా అనిపిస్తారు.

కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వస్తుంది?

గుండె లయ వ్యవస్థలో లోపం కారణంగా ఈ కార్డియాక్ అరెస్ట్ ఏర్పడుతుంది. దీనికి అనేక కారణాలు కూడా ఉండవచ్చు. రక్తనాళాల వ్యాధి, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులు మూసుకుపోవడం వంటి సమస్యలు కార్డియాక్ అరెస్టుకు కారణం అవుతాయి.