Begin typing your search above and press return to search.

దేవెగౌడ దంపతుల బంధం ఆదర్శం!

దేశానికి 1996 లో అనూహ్యంగా ప్రధాని అయిన కన్నడ సీమ దిగ్గజ రాజకీయ నేత దేవెగౌడ రాజకీయ జీవితం ఏడు పదులు దాటింది.

By:  Satya P   |   20 July 2026 9:56 AM IST
దేవెగౌడ దంపతుల బంధం ఆదర్శం!
X

దేశానికి 1996 లో అనూహ్యంగా ప్రధాని అయిన కన్నడ సీమ దిగ్గజ రాజకీయ నేత దేవెగౌడ రాజకీయ జీవితం ఏడు పదులు దాటింది. అంతకు ముందు ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. నిన్నటిదాకా ఆయన రాజ్యసభ సభ్యుడు. తొంబై ఏళ్ళు నిండినా వీల్ చెయిర్ కి పరిమితం అయినా ఠంచనుగా పార్లమెంట్ కి వచ్చిన వారిగా ఆయన అందరి మెప్పు పొందారు. ఇక ఆయన కర్ణాటక రాజకీయాల్లో ఈ రోజున ఉన్న అత్యంత సీనియర్ మోస్ట్ లీడర్. 93 ఏళ్ళ వయసులో కూడా చురుగ్గా ఉంటున్నారు. అటువంటి దేవెగౌడ వ్యక్తిగత జీవితంలో అతి పెద్ద విషాదం చోటు చేసుకుంది. ఆయనతో కలసి ఏడడుగులు వేసి ఏడు దశాబ్దాలకు పైగా సహధర్మచారిణిగా నిలిచిన చెన్నమ్మ కన్నుమూశారు. దాంతో ఈ వృద్ధ నేత కుటుంబం శోక సముద్రంలో మునిగింది.

చివరి వీడియో వైరల్ :

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా చెన్నమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక దేవెగౌడ అయితే చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. అయినా సరే తన సతీమణి చెన్నమ్మ విషయంలో ఆయన తీసుకుంటున్న శ్రద్ధ అందరికీ ఆకట్టుకునేలా ఉంది. వారిద్దరు ఉన్న చివరి వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ అయింది. ఇద్దరూ వీల్ చైర్ లో ఉన్నారు. ఇద్దరికీ మరొకరి సాయం అవసరమే. అలా సహాయకుడి ఆసరాతో వీల్ చెయిర్ లో తన భార్య వద్దకు వచ్చిన దేవెగౌడ ఆమెకు పండుని తినిపిస్తూ ఎంతో ప్రేమగా ఆమెకు ధైర్యం చెబుతున్న దృశ్యాలు చూసిన వారికి కూడా కళ్ళు చమర్చేలా ఉన్నాయి. ఇక చెన్నమ్మ అయితే అంతటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా శ్రమపడి మరీ తమ భర్తకు మొక్కుతూ ఆశీర్వాదం తీసుకుంటున్న సన్నివేశం ఆదర్శ దంపతులు అంటే వీరే కదా అనిపించింది. 1954 మేలో దేవేగౌడ చెన్నమ్మను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది మే నాటికి ఈ ఇద్దరి వివాహ బంధానికి 72 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఇంత నిండు దాంపత్యంలోనూ వారి అనురాగం అభిమానం అలా చిరస్థాయిగా నిలిచి ఉండడం ఈ తరానికి ఎంతగానో ఆదర్శం అని చెప్పాల్సిందే. ఆరుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఎంతో మంది మనుమలు మనవరాళ్ళు, ముని మనవలతో అతి పెద్ద కుటుంబం దేవెగౌడది.

నాయకుడిగానే కాదు :

దేవెగౌడ రెండు పదుల వయసు నుంచే రాజకీయాల్లో ఉన్నారు. ఆయన 29 ఏళ్ళకే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అలాగే ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. ఇలా నాయకత్వ పటిమను అడుగడుగునా రుజువు చేసుకుంటూ వచ్చిన దేవెగౌడ వ్యక్తిగత జీవితంలో కూడా మచ్చ లేని విధంగా గడిపారు అంటారు. ఇక ఆయన వైవాహిక జీవితం సైతం అంతే ఆదర్శప్రాయంగా ఉండడం విశేషం. ఈ రోజులలో భార్య భర్తలు చిన్న పాటి అభిప్రాయ భేదాలకే దూరం అవుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటిది ముప్పాతిక ఏళ్ళ వైవాహిక జీవితం గడిపిన దేవెగౌడ లాంటి వారు భారతీయ వైవాహిక జీవితానికే తలమానికం అని చెప్పాల్సి ఉంది. ఒకరికి ఒకరు అన్నట్లుగా ముదిమి వయసులో కూడా వారు పరస్పరం చూపించుకున్న ప్రేమాభిమానాలు స్పూర్తిగా ఉంటాయని అంటున్నారు. దిగ్గజ నేత దేవెగౌడ కు వచ్చిన ఈ కష్టం మాత్రం ఈ వయసులో తట్టుకోలేనిదే అని అంటున్నారు.