అండర్-14 బాలురను రోడ్డున నిలబెట్టిన హెచ్.సీ.ఏ.. వైరల్ వీడియో
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సీఏ) మరోసారి నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలతో వార్తల్లోకెక్కింది.
By: A.N.Kumar | 10 Dec 2025 12:31 PM ISTహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సీఏ) మరోసారి నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలతో వార్తల్లోకెక్కింది. క్రికెట్ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ఈ సంస్థ, అక్రమాలు, అవినీతికి కేరాఫ్ గా మారిందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా అండర్ 14 క్రికెట్ జట్టు ఎంపిక కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన చిన్నారుల పట్ల హెచ్.సీఏ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ ప్రేమికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎండలో ఇబ్బందులు.. రోడ్డుపైనే నిరీక్షణ
హైదరాబాద్ లోని జింఖానా స్టేడియం వద్ద జరిగిన అండర్ 14 క్రికెట్ జట్టు ఎంపిక కార్యక్రమానికి క్రీడాకారులు తమ కోచ్ లు, తల్లిదండ్రులతో కలిసి పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే ఆశ్చర్యకరంగా సమయానికి పోటీలు ప్రారంభం కాకపోవం.. కనీసం వచ్చిన వారికి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం హెచ్.సీఏ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. చిన్నారులు క్యూలో నిలబడి తీవ్రమైన ఎండలో ఇబ్బందిపడ్డారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు రోడ్డుపక్కన, వాహనాల రణగొణ ధ్వనుల మధ్య ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగుకుండా పడరాని పాట్లు పడటం వీడియోలో స్పష్టం కనిపించింది.
హెచ్.సీఏ వైఫల్యం
పర్యవేక్షణ లోపంతో హెచ్.సీఏ పై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ తాజా ఘటనతో హెచ్.సీఏ చేతగానితనానికి మరో ఉదాహరణ అని క్రికెట్ అభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు. సరైన సౌకర్యాలు కల్పించడంలో అసోసియేషన్ పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తాయి. ‘క్రికెట్ ప్రోత్సాహాన్ని పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్న హెచ్.సీఏ , భవిష్యత్ క్రికెటర్ల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం దారుణం అని క్రీడాకారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల ఆందోళన..
సోషల్ మీడియాలో వీడియోను చూసిన తల్లిదండ్రులు.. క్రికెట్ అభిమానులు, సామాజికవేత్తలు హెచ్.సీఏ బాధ్యతారహిత ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని.. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరుగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
హెచ్.సీఏ తీరు ఎన్ని సార్లు చూసినా మారడం లేదు. ఇప్పటికే హెచ్.సీఏ నిర్వాకాలతో వివాదాలు చాలా చోటుచేసుకున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ తోనూ హెచ్.సీఏకు విభేదాలున్నాయి. ఇక నిధుల అవకతవకలపై ఆరోపణలున్నాయి. ఇప్పుడు అండర్14 విద్యార్థుల విషయంలోనూ విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతోంది. క్రికెట్ అభివృద్ధిని పక్కనపెట్టి అక్రమాలకు కేరాఫ్ గా మారిన సంస్థగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్.సీఏ ఈ విమర్శలపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
