Begin typing your search above and press return to search.

బీమా డబ్బు, అక్రమ సంబంధం.. భర్తను కట్ల పాముతో చంపిన భార్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, కన్నబిడ్డకు తండ్రి అనే జాలి కూడా లేకుండా ఓ భార్య అత్యంత పాశవికంగా హతమార్చింది.

By:  A.N.Kumar   |   20 July 2026 12:57 AM IST
బీమా డబ్బు, అక్రమ సంబంధం.. భర్తను కట్ల పాముతో చంపిన భార్య
X

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, కన్నబిడ్డకు తండ్రి అనే జాలి కూడా లేకుండా ఓ భార్య అత్యంత పాశవికంగా హతమార్చింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. పైగా భర్త పేరిట ఉన్న రూ.20 లక్షల బీమా సొమ్మును కాజేయాలనే దురాశతో ఓ ప్రమాదకరమైన ‘కట్ల పాము’తో కాటు వేయించి చంపేసింది. సినిమా కథను తలపించే ఈ ఘోరకలి ఉమ్మడి ఉత్తరప్రదేశ్‌లోని హస్తినాపూర్‌లో వెలుగుచూసింది.

ఆదర్శ కుటుంబం.. తెరవెనుక అక్రమ సంబంధం

హస్తినాపూర్‌కు చెందిన అతుల్ పంవార్ (35), దామిని (30) ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరిద్దరూ కలిసి స్థానికంగా ‘కృష్ణ కిడ్స్ పబ్లిక్ స్కూల్’ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 150 మంది విద్యార్థులున్న ఆ స్కూల్‌ను నడుపుతూ సమాజంలో ఓ ఆదర్శ దంపతులుగా చలామణి అయ్యారు. అయితే బయటకు అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా.. దామిని వ్యక్తిగత జీవితంలో మాత్రం మరో కోణం ఉంది. తమ స్కూల్ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తుషార్ అలియాస్ నిక్కీతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. రోజురోజుకూ వీరి బంధం మితిమీరిపోయింది.

బీమా సొమ్ముపై కన్ను.. పక్కా స్కెచ్

తుషార్‌తో సాగిస్తున్న అక్రమ సంబంధానికి భర్త అతుల్ అడ్డుగా మారుతున్నాడని దామిని భావించింది. అతడిని ఎలాగైనా వదిలించుకోవాలని ఇద్దరూ పథకం వేశారు. అదే సమయంలో అతుల్ పేరిట ఉన్న రూ.20 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులను కూడా సొంతం చేసుకోవచ్చని ఆశపడ్డారు. హత్యను సహజ మరణంగా లేదా ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రీకరిస్తే బీమా డబ్బులు సులభంగా వస్తాయని భావించి, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఒక భయంకరమైన కుట్రకు తెరలేపారు.

నిద్రమాత్రలు ఇచ్చి.. పాముతో కాటు వేయించి..

పథకం ప్రకారం.. జులై 16 రాత్రి దామిని తన భర్త అతుల్‌కు పాలలో ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అది తాగిన అతుల్ స్పృహ కోల్పోయి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అతుల్ పూర్తిగా నిద్రపోయాడని నిర్ధారించుకున్నాక దామిని తన ప్రియుడు తుషార్‌కు సమాచారం అందించింది. తుషార్ తన ఇద్దరు స్నేహితులు సోను, ఉదయ్ కుమార్‌లతో కలిసి అత్యంత విషపూరితమైన ఒక కట్ల పామును ఒక సంచిలో పెట్టుకుని అతుల్ ఇంటికి వచ్చాడు. నిద్రపోతున్న అతుల్ పక్కన, అతడి దుప్పట్లోకి ఆ కట్ల పామును వదిలేశారు. ఆ పాము అతుల్‌ను తీవ్రంగా కాటు వేయడంతో విషం ఒళ్లంతా పాకి అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

గుట్టురట్టు చేసిన పోలీసులు

మరుసటి రోజు ఉదయం అతుల్ పాము కాటుతో చనిపోయాడని దామిని నాటకమాడింది. అంతా సహజ మరణమే అని నమ్మేలా ప్రవర్తించింది. అయితే అతుల్ హఠాన్మరణంపై అతడి కుటుంబ సభ్యులకు గట్టి అనుమానం వచ్చింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు ప్రాథమికంగా సేకరించిన ఆధారాలు ఈ కేసును మలుపు తిప్పాయి. ఘటనా స్థలం పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా రాత్రి సమయంలో తుషార్, అతడి స్నేహితుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దామిని, డ్రైవర్ తుషార్ మొబైల్ ఫోన్ల కాల్ డేటాను పరిశీలించగా వారిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం, హత్య జరిగిన రాత్రి వారి మధ్య జరిగిన సుదీర్ఘ సంభాషణలు బయటపడ్డాయి. లభించిన పక్కా ఆధారాలతో పోలీసులు భార్య దామిని, ఆమె ప్రియుడు తుషార్, అతడికి సహకరించిన సోను, ఉదయ్ కుమార్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నారు.

ప్రస్తుతం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘాతుకానికి ఉపయోగించిన విషపూరిత పామును ఎక్కడి నుండి తెచ్చారు.. దీని వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. కట్టుకున్న భర్తను ఇంత దారుణంగా చంపిన భార్య ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.