Begin typing your search above and press return to search.

కొడుకు పెళ్లి వేళ 'హెలికాఫ్టర్' మొక్కు తీర్చుకున్నాడు

కేవలం 90 కంటే తక్కువ కిలోమీటర్ల దూరం కోసం రూ.6 లక్షలు ఖర్చు చేసి తన భార్యను మొదటిసారి ఇంటికి తీసుకొచ్చిన ఈ పెళ్లి కొడుకు ఉదంతం ఆసక్తికరంగా మారింది.

By:  Garuda Media   |   13 March 2026 10:50 AM IST
కొడుకు పెళ్లి వేళ హెలికాఫ్టర్ మొక్కు తీర్చుకున్నాడు
X

హర్యానా.. రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పుడో ట్రెండ్ నడుస్తోంది. పెళ్లైన తర్వాత తమ భార్యల్ని ఇంటికి తీసుకెళ్లేందుకు రోటీన్ కు భిన్నంగా హెలికాఫ్టర్ లో తీసుకెళుతున్న ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హర్యానాలో అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. కాకుంటే.. ఈ ఉదంతం మిగిలిన వాటికి కాస్త భిన్నమైంది. హెలికాఫ్టర్ లో భార్యను తీసుకురావటం వెనుక.. ఆ కొడుకు తన తండ్రి మొక్కును తీర్చటం ఆసక్తికరం. కేవలం 90 కంటే తక్కువ కిలోమీటర్ల దూరం కోసం రూ.6 లక్షలు ఖర్చు చేసి తన భార్యను మొదటిసారి ఇంటికి తీసుకొచ్చిన ఈ పెళ్లి కొడుకు ఉదంతం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

హర్యానాలోని అంబాలాకు చెందిన గురుసేవక్ సింగ్ అనే యువకుడు ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. అంబాలాలోని పంజోఖరా గ్రామానికి చెందిన ఇతను వృత్తిరీత్యా లాయర. కర్నాల్ లోని ఇందిరా కాలనీకి చెందిన మనీషా విషయానికి వస్తే ఆమె. వృత్తిరీత్యా చార్టర్ అకౌంటెంట్ (సీఏ). గురుసేవక్ పుట్టినప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యడు. అప్పట్లో అతని ప్రాణాలు దక్కే అవకాశం తక్కువంటూ ఆశలు వదిలేసుకున్నారు. ఆ సమయంలో అతని తండ్రి, రియల్ ఎస్టేట్ వ్యాపారి సర్వజీత్ సింగ్ శంకర్ తన కొడుకు కోలుకొని పెరిగి.. పెద్దవాడైతే.. అతడి పెళ్లి సమయంలో హెలికాఫ్టర్ ద్వారా గురుద్వారా మీద పూలవర్షం కురిపిస్తానని మొక్కుకున్నాడు. కొడుకు కోలుకోవటం.. పెద్దవాడు కావటం.. పెళ్లి వేళ.. అప్పట్లో తాను మొక్కుకున్న మొక్కు గురించి కొడుక్కి చెప్పాడు.

తన తండ్రి మాటకు తగ్గట్లే బరాత్ వెళ్లేటప్పుడు పంజోఖరా సాహిబ్ గురుద్వారాపై హెలికాఫ్టర్ నుంచి పూలవర్షాన్ని కురిపించాడు. తిరుగు ప్రయాణంలో పెళ్లి కుమార్తె మనీషా, తన తండ్రితో పాటు హెలికాఫ్టర్ తో ఇంటికి తీసుకొచ్చాడు. కొత్తగా పెళ్లై.. గ్రామానికి వచ్చిన నవ వధువును చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగాపోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముందుగానే హెలికాఫ్టర్ ను గ్రామానికి తీసుకొచ్చేందుకు వీలుగా అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నారు. తమ ఊరి చరిత్రలో ఇలా భార్యను హెలికాఫ్టర్ లో తీసుకురావటం ఇదే తొలిసారిగా గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఉదంతం చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఆసక్తికర అంశంగా మారింది.

ఈ హెలికాఫ్టర్.. పూల వర్షం కోసం దాదాపు రూ.6 - రూ.7 లక్షల ఖర్చు అయినట్లు చెబుతున్నారు. హెలికాఫ్టర్ ల్యాండింగ్ కోసం ఊరి శివారులో ఒక పొలంలో తాత్కాలికంగా హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు. కర్నాల్ నుంచి పంజోఖర గ్రామానికి దూరం సుమారు 88 కిలోమీటర్లు మాత్రమే. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే గంటన్నరలో గ్రామానికి చేరుకోవచ్చు. హెలికాప్టర్ లో వీరు 20 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే గ్రామానికి చేరుకున్నారు. పెళ్లైన తర్వాత అత్తారింటికి తాను హెలికాఫ్టర్ లో వెళతానని తాను అస్సలు అనుకోలేదని.. ఈ తియ్యటి ఉదంతం జీవితాంతం గుర్తుండిపోతుందని ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన పెళ్లి ఇంత గ్రాండ్ గా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు.