ఓట్లచోరీ : రాహుల్ గాంధీ మరో బాంబ్
హరియాణా రాష్ట్ర ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
By: A.N.Kumar | 5 Nov 2025 10:00 PM ISTహరియాణా రాష్ట్ర ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సుమారు 25 లక్షల ఓట్లు దొంగిలించబడ్డాయని ఆరోపిస్తూ, ఆయన ఏకంగా ఎన్నికల కమిషన్ (ఈసీ) తీరుపైనే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
* "బ్రెజిల్ మోడల్‌కి కూడా ఓటు హక్కు!"
రాహుల్ గాంధీ వెల్లడించిన వివరాలు అత్యంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఆయన ప్రధానంగా ఒకే వ్యక్తి ఫొటోను అనేక నకిలీ ఓట్ల సృష్టికి ఉపయోగించారని ఆరోపించారు. ఒకే ఫొటో 22 ఓట్లు ఉన్నాయని.. బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ ఫొటోను ఏకంగా 22 సార్లు ఉపయోగించి, 'సీమా', 'స్వీటీ', 'సరస్వతి' వంటి వేర్వేరు పేర్లతో, వివిధ వయసులు, లింగాలతో నకిలీ ఓట్లు సృష్టించారని రాహుల్ ఆరోపించారు. ఒకే ఫొటోను ఉపయోగించి రెండు పోలింగ్ బూత్‌లలో ఏకంగా 223 ఓట్లు నమోదు చేసినట్లు కూడా ఆయన తెలిపారు.
ఈ ఆరోపణలను బట్టి, హరియాణా ఎన్నికల్లో 20 లక్షలకు పైగా నకిలీ ఓట్లు సృష్టించారని, ఇది మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 12.5 శాతం ఉంటుందని గాంధీ పేర్కొన్నారు. ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
* ఈసీ చేతులు కట్టేసి చూస్తుందా?"
ఈ అక్రమాలపై రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ పాత్రను తీవ్రంగా ప్రశ్నించారు. నకిలీ ఓటర్లను గుర్తించేందుకు ఈసీ వద్ద సాఫ్ట్‌వేర్ ఉన్నప్పటికీ, దానిని ఎందుకు ఉపయోగించలేదని ఆయన మండిపడ్డారు. "ఎన్నికల కమిషన్ BJPకి లబ్ధి చేకూరేలా కళ్లుమూసి కూర్చుంది" అని పరోక్షంగా ఈసీపై ఆరోపణలు గుప్పించారు. తప్పుడు చిరునామాలతో 93,000 పైగా ఓట్లు ఉన్నట్లు గుర్తించామని, అలాగే యూపీలో ఓటు వేసిన వేలాది మంది హరియాణాలో కూడా ఓటు వేశారని కాంగ్రెస్ అగ్రనేత తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆయన హెచ్చరించారు.
* రాహుల్ ఆరోపణలకు ఈసీ కౌంటర్
రాహుల్ గాంధీ చేసిన ఈ 'హైడ్రోజన్ బాంబ్' ఆరోపణలపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించింది. "హరియాణా అసెంబ్లీ ఎన్నికలు గతేడాది జరిగాయి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయలేదు" అని ఈసీ స్పష్టం చేసింది."ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా లేదా? పోలింగ్ స్టేషన్లలో కాంగ్రెస్ ఏజెంట్లు ఉన్నప్పుడు వారు ఏం చేశారు?" అంటూ ఈసీ ప్రతి ప్రశ్నలు సంధించింది.
* రాజకీయ వ్యూహమా? ప్రజాస్వామ్య ముప్పా?
నకిలీ ఓట్లు, ఓట్ల చోరీ ఆరోపణలు ఇప్పుడు దేశ రాజకీయ చర్చల్లో కేంద్ర బిందువుగా మారాయి. ఒకవైపు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యానికి ముప్పు అని గట్టిగా హెచ్చరిస్తుండగా, మరోవైపు ఈసీ తమ ప్రక్రియలు పారదర్శకంగా జరిగాయని అంటోంది. రాహుల్ ఆరోపణలు ఒక రాజకీయ వ్యూహమా, లేక నిజంగానే ఓటరు జాబితాలో పెద్ద లోపాలు ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. ఈ పరిణామాలు హరియాణా రాజకీయాలను, దేశవ్యాప్త ఎన్నికల సంస్కరణల చర్చను మరింత వేడెక్కించాయి.
