'ఆ వాహనాలు కొనేవారు.. నడిపేవారు వెధవలు-పోకిరీలు!'
ద్విచక్ర వాహనాల నుంచి కార్ల వరకు ప్రజలు ఎవరికి నచ్చిన వాహనాన్ని, ఎవరికి సౌకర్యంగా ఉండే వాహనాన్ని వారు కొనుగోలు చేస్తారు.
By: Garuda Media | 9 Nov 2025 8:43 PM ISTద్విచక్ర వాహనాల నుంచి కార్ల వరకు ప్రజలు ఎవరికి నచ్చిన వాహనాన్ని, ఎవరికి సౌకర్యంగా ఉండే వాహనాన్ని వారు కొనుగోలు చేస్తారు. దీనికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎలాంటి నిబంధనలు కూడా మన దేశంలో లేదు. ఆదాయంతోపాటు ఆర్థిక స్థోమత, సమాజంలో ఉన్న స్థాయి, స్థితి, అవసరాల ఆధారంగా వాహనాల కొనుగోలు కామన్‌గా మారింది. ఈ విషయంలో ఇప్పటి వరకు.. ప్రభుత్వాలు కానీ.. అధికారులు కానీ ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. వ్యాఖ్యలు కూడా చేయలేదు.
కానీ, తాజాగా హరియాణా రాష్ట్ర పోలీసు బాస్.. డీజీపీ ఓపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రెండు వాహనాల పేర్లు చెప్పిన ఆయన.. వాటిని కొనేవారు.. వినియోగించేవారు.. వెధవలు-పోకిరీలు అంటూ సర్టిఫై చేసేశారు. ఈ వ్యాఖ్యలను రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. రహదారి ప్రమాదాల వంకతో ఇలా వాహనదారులను అవమానిస్తారా? అంటూ.. దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించింది. డీజీపీ చేసిన వ్యాఖ్యలు.. వ్యక్తిగతమని హరియాణా రవాణా శాఖ మంత్రి స్పష్టం చేశారు.
అంతేకాదు.. అధికారులు వ్యాఖ్యలు చేసేప్పుడు.. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి చెప్పారు. రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు.. తాము చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా.. ఓపీ సింగ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది చూస్తే..ఇ టీవల కాలంలో జాతీయ రహదారిపై.. ముఖ్యంగా హరియాణా పరిధిలో థార్(జీపు), బుల్లెట్ ప్రమాదాలు పెరుగుతున్నాయి. పైగా వీటిని మైనర్లు నడుపుతు న్న కేసులు కూడా కనిపించాయి. ప్రమాదాల సమయంలో ఆయా వాహనాలను నడిపించి కూడా మైనర్లేనని పోలీసులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో అందరికీ ఆపాదిస్తూ.. డీజీపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ``Who buy and run the THAR and Bullets are Fools and Scoundrals. No one excused.`` అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంతేకాదు.. అలాంటి వాహనాలను తనిఖీ చేయకుండా వదిలిపెట్టబోమని స్పష్టం చేసిన ఆయన.. వీటిని కొందరు ఆకతాయిలే కొనుగోలు చేస్తున్నారని.. తాము సమాజానికి భిన్నంగా ఉన్నామని చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. దీంతో వివాదం చెలరేగగా.. సర్కారు రంగంలోకి దిగి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కాగా.. వాహనాల కొనుగోలు అనేది ప్రజల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఉత్తర కొరియా, చైనాలోని కొన్నిప్రాంతాలు, అఫ్ఘానిస్థాన్ లలో మాత్రం వాహనాల కొనుగోలుపై నియంత్రణ ఉంది.
