Begin typing your search above and press return to search.

బాస్కెట్ బాల్ స్తంభం విరిగి యువకుడు మృతి... షాకింగ్ వీడియో!

అవును... హర్యానాలోని రోహ్ తక్ లో 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రాక్టీస్ సమయంలో మృత్యువాత పడ్డాడు.

By:  Raja Ch   |   26 Nov 2025 12:49 PM IST
బాస్కెట్  బాల్  స్తంభం విరిగి యువకుడు మృతి... షాకింగ్  వీడియో!
X

ఇటీవల కాలంలో గ్రౌండ్ లోనో, ఇండోర్ స్టేడియంలలోనో ఆటలు ఆడుతూ హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణిస్తున్న యువకుల ఘటనలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. వాటికి సంబంధించిన వీడియోలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు అనూహ్య రీతిలో మరణించిన ఘటన తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో షాకింగ్ గా మారింది.

అవును... హర్యానాలోని రోహ్ తక్ లో 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రాక్టీస్ సమయంలో మృత్యువాత పడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బాస్కెట్ బాల్ హూప్ ఇనుప స్తంభం ఒక్కసారిగా విరిగి అతడిపోయింది. దీంతో.. అతడిని హుటాహుటున ఆస్పత్రికి తరలించారు. అయితే... చికిత్స సమయంలో అతడు మరణించినట్లు ప్రకటించారు.

లఖన్ మజ్రా గ్రామంలోని స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అక్కడ సదరు ఆటగాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ సమయంలో నే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం మొత్తం సీసీటీవీలో రికార్డైంది. ఆ దృశ్యాల్లో... ఆటగాడు ఒక ల్యాప్ తీసుకుని, హూప్ కోసం చేయి చాపడం, డంక్ ప్రాక్టీస్ చేయడం కనిపించింది. ఈ సమయంలోనే ఘోరం జరిగిపోయింది.

ఇందులో భాగంగా... అతడు స్తంభానికి వేలాడుతుండగా.. ఆ ఇనుప నిర్మాణం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ బాస్కెట్ బాల్ హుప్ అంచు అతని ఛాతిపై పడిపోయింది. దీంతో.. ఇతర ఆటగాళ్లు హుటా హుటిన పరుగెత్తుకుంటూ వచ్చినట్లు కనిపించారు. ఆ సమయంలో సదరు ఆటగాడు లేవడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో అతడిపై పడిన స్తంభాన్ని కొంతమంది లేపారు.

కాగా.. 16 ఏళ్ల బాధితుడు హార్థిక్ పుదుచ్చేరిలో జరిగిన 39వ యూత్ నేషనల్ ఛాంపియన్ షిప్, కాంగ్రాలో జరిగిన 47వ సబ్ - జూనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్, హైదరాబాద్ లో జరిగిన 49వ సబ్ - జూనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్ సహా అనేక జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పతకాలు గెలుచుకున్నాడు. ఇతని మృతి జట్టుకు తీరని లోటని అంటున్నారు!

రెండు రోజుల క్రితం ఇదే ఘటన!:

రెండు రోజుల క్రితం బహదూర్ గఢ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... హర్యానాలోని బహధూర్ గఢ్ లోని హోషియార్ సింగ్ స్పోర్ట్స్ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో 15 ఏళ్ల బాలుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బాస్కెట్ బాల్ స్తంభం అతనిపై పడింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మరణించాడు. దీంతో.. హర్యానాలోని క్రీడా మౌలిక సదుపాయాల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.