Begin typing your search above and press return to search.

నలభై ఏళ్లలో వీధి వ్యాపారి కాస్తా.. ఆ దేశంలో బడా వ్యాపారిగా మనోడు

నాలుగు దశాబ్దాల క్రితం హర్షద్ భాయ్.. గుజరాత్ లోని విస్నగర్ ప్రాంతానికి చెందినవాడు. పని లేక ఏం చేయాలో తోచని పరిస్థితి.

By:  Garuda Media   |   9 Feb 2026 10:13 AM IST
నలభై ఏళ్లలో వీధి వ్యాపారి కాస్తా.. ఆ దేశంలో బడా వ్యాపారిగా మనోడు
X

రీల్ సీన్ కు ఏ మాత్రం తీసిపోని రియల్ సన్నివేశంగా దీన్ని చెప్పాలి. చేతిలో డబ్బుల్లేక.. ఏం చేయాలో తోచక.. చివరకు ఉండేందుకు ఇల్లు లేక గుడి ప్రాంగణంలో ఉన్న వ్యక్తి.. ఇప్పడు దేశం కాని దేశంలోని బడా వ్యాపారవేత్తల్లో ఒకడిగా ఎదిగిన వైనం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇదంతా నలభై ఏళ్ల వ్యవధిలో సాధించిన వ్యక్తి భారతీయుడు. దేశం కాని దేశంలో వీధి వ్యాపారిగా మొదలైన అతడి ప్రయాణం ఇప్పుడు ఆ దేశంలో అపర కుబేరుల్లో ఒకరిగా మారటం ఒక ఎత్తు.. తాజాగా ఆ దేశంలో అత్యున్న పురస్కారాన్ని సొంతం చేసుకున్న వైనం తెలిస్తే.. వావ్ అనాల్సిందే. ఇదంతా గుజరాత్ కు చెందిన హర్షద్ భాయ్ సక్సెస్ స్టోరీ.

నాలుగు దశాబ్దాల క్రితం హర్షద్ భాయ్.. గుజరాత్ లోని విస్నగర్ ప్రాంతానికి చెందినవాడు. పని లేక ఏం చేయాలో తోచని పరిస్థితి. చేతిలో డబ్బుల్లేవు. ఇలాంటి వేళ.. పని కోసం ఉగాండాకు వలస వెళ్లాడు. వ్యాపారం చేసేందుకు డబ్బుల్లేని దైన్యం. దీంతో.. ఆ దేశంలో వీధి వ్యాపారిగా ప్రయాణం మొదలు పెట్టాడు. స్థానిక ప్రార్థనాలయాల్లో ఉంటూ.. చిన్న చిన్న వస్తువుల్ని అమ్ముతూ బతుకుదెరువు షురూ చేశాడు.

నెమ్మదిగా ఎదిగిన అతను.. ఆర్థికంగా కాస్త సర్దుకున్నంతనే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. తన వ్యాపారానికి తగినట్లుగా ‘‘తిరుపతి హర్ష్’’ పేరుతో కంపెనీని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే.. ఉగాండాలోని పలు పారిశ్రామిక.. వాణిజ్య.. నివాస ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం ఆయన దేశంలోని బడా వ్యాపారవేత్తల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆయనకు ఉగాండా దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘‘ది డిస్టింగ్విష్డ్ ఆర్డర్ ఆఫ్ ది క్రెస్టెడ్ క్రేన్ గ్రాండ్’’ పేరుతో పురస్కారాన్ని అక్కడి ప్రభుత్వం అందజేసింది. బతకటమే కష్టంగా ఉన్న స్థాయి నుంచి వేలాది మందికి బతుకును ఇవ్వటమే కాదు.. దేశం కాని దేశంలో సత్తా చాటిన మనోడి ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.