90 శాతం గెలిస్తేనే గెలుపా హరీశ్? గతం మాటేంటి?
అధికారంలో ఉండి ఆ మాత్రం గెలవకపోతే ఎలా? అన్న ప్రశ్నను సంధించారు. ఆయన మాటల్ని నిజమనే నమ్మి.. గతంలోకి వెళితే హరీశ్ మాటల్లోని డొల్లతనం ఇట్టే అర్థమవుతుంది.
By: Garuda Media | 14 Feb 2026 11:00 AM ISTఅధికార పక్షంగా ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడే నేతలు కొందరు ఉంటారు. తాము ఏం మాట్లాడితే అదే వాస్తవంగా వారు ఫీల్ అవుతుంటారే తప్పించి.. గతం ఎవరికి గుర్తు ఉండదన్నట్లుగా ఉండే తీరుతో మొదటికే మోసం రావటమే కాదు.. వారి మీద ఉన్న గౌరవం కూడాతగ్గే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు హరీశ్ రావు. 90 శాతం గెలవకుంటే అదో గెలుపా? అంటూ ప్రశ్నించటమేకాదు.. అధికారంలో ఉండి ఆ మాత్రం గెలవకపోతే ఎలా? అన్న ప్రశ్నను సంధించారు. ఆయన మాటల్ని నిజమనే నమ్మి.. గతంలోకి వెళితే హరీశ్ మాటల్లోని డొల్లతనం ఇట్టే అర్థమవుతుంది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపక్షాలను ఆయన ఏ రీతిలో టార్గెట్ చేశారో? ఎన్నికల వేళ గులాబీ పార్టీ అనుసరించిన వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయినప్పటికి అప్పట్లో ఆ పార్టీకి వచ్చిన స్ట్రైకింగ్ రేటు గురించి చూస్తే విషయం అర్థమవుతుంది. అన్నింటి కంటే ముందు.. తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించి.. తెలంగాణ ఛాంపియన్ అన్న ట్యాగ్ తో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ సాధించిన సీట్లను శాతంలో చూస్తే.. కేవలం 53శాతం స్ట్రైకింగ్ రేటు కనిపిస్తుంది.అయితే.. అసెంబ్లీ కాల పరిమితి ముగియకుండానే విపక్షం అన్నది లేకుండా చేసి 2018 ఎన్నికల బరిలోకి దిగిన సందర్భంలోనూ వచ్చిన స్ట్రైకింగ్ రేటు 74 శాతమే.
పార్లమెంటు ఎన్నికల విషయానికి వస్తే భారీ సెంటిమెంట్ ఉన్న 2014లో నాటి టీఆర్ఎస్ కు వచ్చిన స్ట్రైకింగ్ రేటు 64.7 శాతం అయితే.. 2019లో కారు సారు పదహారు అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లిన సందర్భంలో వచ్చిన స్ట్రైకింగ్ రేటు గురించి చెప్పే ముందు మరో అంశాన్ని ప్రస్తావించాలి. కేవలం ఈ ఎన్నికలకు ఐదారు నెలల ముందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన స్ట్రైకింగ్ రేటు 74 శాతమైతే.. పార్లమెంట్ ఎన్నికల్లో నమోదు చేసిన స్ట్రైకింగ్ రేటు కేవలం 53 శాతమే. మరి.. అధికారంలో ఉండి కూడా సాధించిన ఈ స్ట్రైకింగ్ రేటు ఇప్పుడు హరీశ్ చెబుతున్నట్లు ఓటమితో సమానం అవుతుందా?
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్ట్రైకింగ్ రేటును కాసేపు పక్కన పెట్టి.. పంచాయితీ, మున్సిపోల్స్ ఎన్నికల ఫలితాల స్ట్రైకింగ్ రేటును చూస్తే..2019లో తాను రెండోసారి పవర్ లోకి వచ్చిన తర్వాత నిర్వహించిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్ట్రైకింగ్ రేటు 60-70 శాతం మధ్యనే మొత్తం 12,732 గ్రామ పంచాయితీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు 7600 నుంచి 8000 స్థానాల్లోనే గెలుపొందారు. అదే ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇప్పుడు హరీశ్ చెప్పినట్లు 90 శాతం స్ట్రైకింగ్ రేటు రాలేదు. జెడ్పీటీసీల్లో సుమారు 83 శాతం స్ట్రైకింగ్ రేటు వస్తే.. ఎంపీటీసీల్లో సుమారు 61 శాతం స్ట్రైకింగ్ రేటు నమోదైంది.
2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం సుమారు 90 శాతం వరకు స్థానాల్ని సొంతం చేసుకుంది. అదే సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ల విషయానికి వస్తే.. తొమ్మిది కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ స్ట్రైకింగ్ రేటు 77శాతం మాత్రమే. అదే వార్డుల వారీగా చూస్తే.. 2727 మున్సిపల్ వార్డుల్లో టీఆర్ఎస్ 1762 వార్డుల్ని సొంతం చేసుకుంది.అంటే.. స్ట్రైకింగ్ రేటు 64 శాతం మాత్రమే. పదేళ్లు నాన్ స్టాప్ గా పవర్ లో ఉండి స్థానిక ఎన్నికల్లో స్టైకింగ్ రేటు ఇలా నమోదైతే.. ఇప్పుడు మాత్రం 90 శాతం మాట చెబితే సిగ్గుపోదా హరీశా?
