Begin typing your search above and press return to search.

పరువు తీసుకోవటంలో హరీశ్ తర్వాతే ఎవరైనా

అధికారం చేజారిన తర్వాత అధినేతలకు.. పార్టీ ముఖ్యనేతల్లో మార్పు అకస్మికంగా వచ్చేస్తుంది. అప్పటివరకు తాము చేయని పనుల్ని సైతం అధికారంలో ఉన్నోళ్లు చేయాలని ఆశిస్తారు.

By:  Garuda Media   |   25 Aug 2025 10:00 PM IST
పరువు తీసుకోవటంలో హరీశ్ తర్వాతే ఎవరైనా
X

అధికారం చేజారిన తర్వాత అధినేతలకు.. పార్టీ ముఖ్యనేతల్లో మార్పు అకస్మికంగా వచ్చేస్తుంది. అప్పటివరకు తాము చేయని పనుల్ని సైతం అధికారంలో ఉన్నోళ్లు చేయాలని ఆశిస్తారు. అదేం తప్పు కాకపోవచ్చు. కానీ.. పదేళ్లు తాము చేయని పనుల్ని చేయాలని కోరటం.. ఆ చేయని పనుల గురించి తాము ఎదుర్కొన్న విమర్శల్ని మర్చిపోయి మరీ.. అధికార పక్షం నేతలు చేయాలని డిమాండ్ చేసే తీరు చూసినప్పుడు మాత్రం ఆశ్చర్యం కలగకమానదు.

తాజాగా బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరైన హరీశ్ రావు సంగతే చూడండి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్.. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లింది ఎన్నిసార్లు? గులాబీ బాస్ వెళ్లిన సందర్భంగా ఉస్మానియా వర్సిటీలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి? విద్యార్థుల ఆందోళనల్ని పోలీసులు ఎలా కంట్రోల్ చేసేవారన్న విషయాన్ని మర్చిపోయింది లేదు.

ఈ రోజున (సోమవారం) ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాల కోసం సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ విభాగమైన విద్యార్థి సంఘం ఆందోళనలు చేపట్టటం.. వారిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరైన హరీశ్ రావు ఎక్స్ లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఆయన పెట్టిన పోస్టులో పేర్కొన్న కీలక అంశాల్ని చూస్తే.. ‘‘దమ్ముంటే పోలీసులు లేకుండా ఓయూకి వెళ్ళు రేవంత్ రెడ్డి.

తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ టీడీపీలో ఉన్నాడు. అప్పుడు రేవంత్.. ఓయూకి వస్తే విద్యార్థులు ఇయ్యర మయ్యర అందుకున్నారు. సందులో పడి రేవంత్ రెడ్డి ఉరికిండు అప్పుడు. ఇప్పుడు.. నేను ఈయూకి వచ్చినా అంటున్నడు . ఓయూకు వెళ్తున్నడని మూడు రోజుల నుంచి విద్యార్థులను అరెస్టులు చేయించిండు. పోలీసు స్టేషన్లలో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గజానికో పోలీసుని పెట్టారు. ఓయూలో బీఆర్ఎస్ హయాంలో సబిత కొబ్బరికాయ కొట్టిన బిల్డింగ్ ను ప్రారంభించేందుకు పోయిండు. బీఆర్ఎస్ కట్టిన దానికి రేవంత్ రెడ్డి రిబ్బన్ కత్తిరించిండు. కత్తెర జేబుల పెట్టుకొని తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఫ్లైఓవర్లు కేసీఆర్ కట్టించినవే.. పోతడు రిబ్బన్ కట్ చేస్తాడు’’ అంటూ విమర్శల వర్షం కురిపించారు.

హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ కు కౌంటర్ అని ఆ పార్టీకి చెందిన వారు కొందరు అనుకుంటుంటే.. మరికొందరు మాత్రం తన ఘాటు వ్యాఖ్యలతో గులాబీ బాస్ కం పెద్ద సారును భలేగా ఇరికించారన్న వాదనను వినిపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ వేళలో రేవంత్ వెళ్లలేదని.. వెళితే ఉరికించారని చెబుతున్న హరీశ్.. ఉద్యమ వేళలో కేసీఆర్ ఎన్నిసార్లు వెళ్లారు? వెళ్లిన సందర్భంలో ఎంతలా గ్రౌండ్ వర్కు చేశారు? అన్నది మరచిపోయారా?అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా వ్యవహరించిన పదేళ్ల కాలంలో ఇదే ఉస్మానియా వర్సిటీకి వెళ్లిన సందర్భాలు వేళ్ల మీద లెక్కించొచ్చని గుర్తు చేస్తున్నారు.

ఉస్మానియా వర్సిటీకి వెళ్లిన సందర్భంగా అప్పట్లో పోలీసులు వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంటూ.. ఆ విషయాన్ని మర్చిపోక ముందే.. రేవంత్ మీద ఈ తరహాలో విమర్శలు చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఓయూ విద్యార్థి సంఘాల ప్రతినిధులందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. తాజా సీఎం రేవంత్ పర్యటనలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన వారిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు.

తాము కట్టించిన భవనాలకు రేవంత్ జేబులో కత్తెర పట్టుకొని ప్రారంభిస్తున్నట్లు హరీశ్ ధ్వజమెత్తటాన్ని తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన మెట్రో రైలును.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మురగబెట్టి.. చివరకు తన దారికి ఎల్ అండ్ టీ వచ్చేలా చేసుకొని మాత్రమే ప్రారంభించారని.. ఆ ఘన చరిత్రను ఎవరు మరచిపోతారని ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాల్లో కొన్నింటిని తర్వాత ప్రభుత్వం ప్రారంభించటం కొత్తేం కాదని గుర్తు చేస్తున్నారు.

తాజాగా ఉస్మానియాలో సీఎం రేవంత్ ప్రారంభించిన భవనాలను తమ ప్రభుత్వం నిర్మించిందని చెప్పి ఉంటే తప్పు అవుతుందని.. అలా అనని వేళలో హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు సరి కావంటున్నారు. మొత్తంగా హరీశ్ పెట్టిన పోస్టులోని ప్రతి అంశానికి చిన్న పిల్లాడు సైతం కౌంటర్ ఇచ్చేలా ఉన్న తీరు చూస్తుంటే.. సీఎం రేవంత్ కంటే కూడా పెద్ద సారునే ఇరుకున పెట్టేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపించటం విశేషం. హరీశ్ పోస్టు చదివినోళ్లంతా.. మర్చిపోయి చేశారా? ఇరికించేందుకే ఇలా చేస్తున్నారా? అన్న గుసగుస పార్టీలోనూ వినిపిస్తుండటం విశేషం.