Begin typing your search above and press return to search.

6 వంద‌ల పేజీల నివేదిక‌పై అర‌గంటేనా? : హ‌రీష్ రావు

తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై పినాకి చంద్ర ఘోష్ ఇచ్చిన నివేదిక‌పై చ‌ర్చ‌జోరుగా సాగింది.

By:  Garuda Media   |   1 Sept 2025 9:14 AM IST
6 వంద‌ల పేజీల నివేదిక‌పై అర‌గంటేనా? :  హ‌రీష్ రావు
X

తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై పినాకి చంద్ర ఘోష్ ఇచ్చిన నివేదిక‌పై చ‌ర్చ‌జోరుగా సాగింది. తొలుత ఈ చ‌ర్చ‌ను మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంత‌రం.. బీఆర్ ఎస్ త‌ర‌ఫున నీటి పారుద‌ల శాఖ మాజీ మంత్రి హ‌రీష్ రావు మైకు అందుకున్నారు. అయితే.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు, స్పీక‌ర్ ప్ర‌సాద‌రావుకు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 660 పేజీల నివేదిక‌పై మాట్లాడేందుకుత‌న‌కు క‌నీసంలో క‌నీసం 2 గంట‌ల స‌మ‌యం అయినా ఇవ్వాల‌ని ప్ర‌సాద‌రావును కోరారు. అయితే.. స‌భ‌లో ఎక్కువ మంది మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్పీక‌ర్ అన్నారు.

ఈ నేప‌థ్యంలో కీల‌క‌మైన స‌బ్జెక్టు కాబ‌ట్టి.. అర‌గంట వ‌ర‌కు స‌మ‌యం ఇస్తామ‌ని చెప్పారు. దీనిపై హ‌రీష్‌రావు.. తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. 600 పేజీల నివేదిక‌పై అర‌గంట స‌మ‌యం అంటే ఎలా? అని ప్ర‌శ్నించారు. అయితే.. స్పీక‌ర్ మాత్రం ``ఇప్పటికే స‌మ‌యం ప్రారంభ‌మైంద‌ని.. వృథా చేసుకోవ‌ద్ద‌ని`` సూచించారు. దీంతో హ‌రీష్‌రావు.. త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ.. కేసీఆర్‌పై ఉన్న రాజ‌కీయ దుగ్ధ‌తోనే కాళేశ్వ‌రంపై విచార‌ణ చేయించార‌ని.. అస‌లు దీనికి ఏ నిబద్ధ‌తా లేద‌ని అన్నారు. కాళేశ్వ‌రంలో అస‌లు ఏం జ‌రిగిందో.. వాస్త‌వాలు తెలియాలంటే..త‌మ‌కు స‌భ‌లో ప‌వ‌ర్ పాయింట్ ప్రెజంటేష‌న్ ఇచ్చే సౌక‌ర్యంక‌ల్పించాల‌ని కోరామ‌న్నారు. కానీ, దీనికి ప్ర‌భుత్వం అడ్డుప‌డింద‌న్నారు.

అప్పుడే ఈ క‌మిష‌న్ రిపోర్టుపై ప్ర‌భుత్వానికి ఉన్న నిబ‌ద్ధ‌త అర్ధ‌మైపోతోంద‌ని హ‌రీష్‌రావు వ్యాఖ్యానించారు. త‌మ‌పై ఇష్టానుసా రంగా వ్యాఖ్య‌లు చేయ‌డం, నింద‌లు మోపడం స‌రికాద‌న్నారు. విశాల తెలంగాణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని.. అనేక రాష్ట్రాల చుట్టూ తిరిగి కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న చేశామ‌ని వివ‌రించారు. కమిషన్‌ నివేదికపై మ‌రో రెండు రోజులు స‌మ‌యం ఇచ్చినా మాట్లాడేందుకు స‌రిపోద‌న్నారు. ఇక‌, ఆదివారం అయిన‌ప్ప‌టికీ.. స‌భ‌లో ఈ రిపోర్టును ప్ర‌వేశ పెట్ట‌డంపైనా హ‌రీష్‌రావు మండిప‌డ్డారు.

తాము కోర్టుకు వెళ్లామ‌ని.. సోమ‌వారం దీనిపై విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే ప్ర‌భుత్వం ఆదివార‌మే అయినా.. ముఖ్య‌మంత్రికి తీరిక లేక‌పోయినా(మ‌ధ్య‌లో ఆయ‌న కేర‌ళ‌కు వెళ్లి వ‌చ్చారు).. స‌భ‌లో ప్ర‌వేశ పెట్టార‌ని హ‌రీష్ రావు వ్యాఖ్యానిం చారు. గ‌తంలోనూ అనేక క‌మిష‌న్ రిపోర్టుల‌పై కాంగ్రెస్ కీల‌క నాయ‌కులే కోర్టుల‌కు వెళ్లిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని తెలిపారు. ``కాళేశ్వ‌రంపై క‌మిష‌న్ క‌ట్టుక‌థ‌. ఇదో డ్రామా. నిజంగానే ఈ ద‌ర్యాప్తు నిష్పాక్షికంగా జ‌రిగి ఉంటే.. నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చేవి. కానీ, ఇది రాజ‌కీయ ప్రోద్బ‌లంతో కేసీఆర్‌పై క‌క్ష‌తో జ‌రిగింది. ఇది నివేదిక‌కాదు. నిష్ప‌క్ష పాతంగా జ‌ర‌గ‌ని నివేదిక ఏదైనా.. చిత్తు కాయితం. ఈ మాట సుప్రీంకోర్టే చెప్పింది.`` అని వ్యాఖ్యానించారు.