Begin typing your search above and press return to search.

అందరికి తెలిసిన వాటిపైనా ఈ అబద్ధాలేంటి హరీశ్?

బలమైన నాయకుడు అంటే ప్రతి ఎన్నికల్లో గెలవటంతోనే సరిపోదు. తాను చెప్పే మాటల్ని ప్రజలు మరో ఆలోచన లేకుండా నమ్మే పరిస్థితి ఉండాలి.

By:  Garuda Media   |   19 Oct 2026 3:00 PM IST
అందరికి తెలిసిన వాటిపైనా ఈ అబద్ధాలేంటి హరీశ్?
X

బలమైన నాయకుడు అంటే ప్రతి ఎన్నికల్లో గెలవటంతోనే సరిపోదు. తాను చెప్పే మాటల్ని ప్రజలు మరో ఆలోచన లేకుండా నమ్మే పరిస్థితి ఉండాలి. నేతలందరికి వాక్ చాతుర్యం ఉండకపోవచ్చు. అలా అని మంచి మాటకారి అయిన నేతగా పేరున్నంత మాత్రానా తాము చెప్పినవన్నీ ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారని అనుకోవటం భ్రమే అవుతుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కీలకనేతల్లో ఒకరైన హరీశ్ మర్చిపోతున్నారా? ఇటీవల కాలంలో పలు అంశాల మీద ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. వినిపిస్తున్న వాదనలు ఆయన మీద ఉన్న గౌరవాన్ని తగ్గించేలా చేస్తున్నాయన్న విమర్శ బలంగా ఉంది. అందుకు తగ్గట్లే.. వివిధ అంశాల మీద ఆయన మాట్లాడిన మాటలు మిస్ ఫైర్ అవుతున్న పరిస్థితి.

తాజాగా అలాంటి పని చేశారు. ప్రజలకు పూర్తి అవగాహన ఉన్న అంశాల మీద మాట్లాడే సమయంలో ఆచితూచి అన్నట్లుగా మాట్లాడాలి. విపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించటం అందరు నాయకులు చేస్తుంటారు. అలా అని.. తమ ప్రభుత్వంలో తాము అమలు చేసిన నిబంధనల్ని మర్చిపోయి.. అలాంటి నిబంధనల్ని అమలు చేసే ప్రభుత్వాన్ని తప్పు పట్టటం.. దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం తప్పే అవుతుంది.ఇలాంటి మాటలతో తమ మీద ప్రజల్లో ఉన్న గౌరవాన్ని తగ్గిస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాజాగా హరీశ్ అలాంటి పనే చేయటం గమనార్హం.

పండుగ వేళల్లో ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయటం ఎప్పటి నుంచో వస్తున్నదే. కేసీఆర్ పదేళ్ల పాలనలోనూ ఇలాంటిదే జరిగింది. ఆ విషయాల్ని వదిలేసిన హరీశ్ రావు.. తాజాగా దసరా పండుగ సందర్భంగా స్పెషల్ బస్సుల్లో పెంచిన టికెట్ ధరల మీద విమర్శలతో విరుచుకుపడటం చూస్తే.. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా అదనపు ఛార్జీల బాదుడు మీద హరీశ్ స్పందించింది లేదు. అలాంటి ఆయన తాజాగా మాత్రం రేవంత్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో భార్యకు ఉచిత ప్రయాణమని చెప్పి.. భర్తకు డబుల్ చార్జీ వసూలు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే.. హరీశ్ రావు మర్చిపోయిన అంశం ఏమంటే.. తమ పదేళ్ల పాలనలో అయితే భార్యాభర్తలు ఇద్దరికి డబుల్ ఛార్జీల షాక్ ఇచ్చామన్న విషయాన్ని మర్చిపోయారు. పండుగ వేళ రద్దీ ముసుగులో ప్రయాణికుల నడ్డి విరిచేలా రేవంత్ సర్కారు వ్యవహరిస్తుందన్న ఆయన మాటల్ని చూస్తే.. కేసీఆర్ పాలనలో ఏం జరిగిందన్న విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేరన్న విషయాన్ని ఆయన మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.

తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో.. ఇప్పుడు అదే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే.. ఎందుకంత ఆగమాగం కావాలి హరీశ్ ? అన్నదే ప్రశ్న. నిజానికి పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టికెట్ ధరల నియంత్రణ నిర్ణయం 2003 నుంచి అమలు అవుతున్నదే. సంస్థపై అదనపు భారం పడకుండా రూల్స్ కు అనుగుణంగానే ఆర్టీసీ ఈ పద్దతిని ఫాలో అవుతుందన్నది మర్చిపోకూడదు.

స్పెషల్ బస్సులతో పంచాయితీ ఏమంటే.. వెళ్లేటప్పుడు వంద శాతానికి మించి ఆక్యుపెన్సీ ఉన్నప్పటికి.. తిరుగు ప్రయాణంలో దాదాపుగా ఖాళీగా బస్సులు రావాల్సి ఉంటుంది.ఇలా ఒకటిన్నర రెట్లు అధికంగా టికెట్లు అమ్మకపోతే..పండుగ వేళలో ఆర్టీకి భారీగానష్టపోతుందన్నది అందరికి తెలిసిన నిజం. కానీ.. ఆ విషయాల్ని వదిలేసి.. తమ ప్రభుత్వంలోనూ అమలు చేసిన విధానాన్ని తాజాగా తప్పు పట్టటం.. విమర్శలు గుప్పించటం లాంటివి హరీశ్ స్థాయిని..ఆయన మీద ఉన్న గౌరవాన్ని.. ఆయన మాటకు ఉండే విలువను తగ్గిస్తాయన్న విషయాన్ని ఆయన ఎప్పుడు గుర్తిస్తారో? హరీశ్ విమర్శల పరంపరను చూస్తే.. ప్రజలు పిచ్చోళ్ల మాదిరి.. ప్రజలకు మెమరీ అన్నది అసలే ఉండదన్నట్లుగా ఉండటం చూస్తే..ఈ ధోరణిని నుంచి వీలైనంత త్వరగా బయటకు రావాల్సిన అవసరం హరీశ్ కు ఉంది.