Begin typing your search above and press return to search.

కాశీబుగ్గ విషాదం.. 95 ఏళ్ల వృద్ధ భక్తుడి స్టోరీ తెలుసుకోవాల్సిందే..

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీవెంకటేశ్వర ఆలయంలో ఘోర దుర్ఘటన తర్వాత ఆ ఆలయ ప్రత్యేకతలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   2 Nov 2025 2:16 PM IST
కాశీబుగ్గ విషాదం.. 95 ఏళ్ల వృద్ధ భక్తుడి స్టోరీ తెలుసుకోవాల్సిందే..
X

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీవెంకటేశ్వర ఆలయంలో ఘోర దుర్ఘటన తర్వాత ఆ ఆలయ ప్రత్యేకతలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఎన్నో ఆలయాలు ఉండగా, ఎక్కడా లేనట్లు వేల మంది భక్తులు ఆ ఆలయానికి ఎందుకు వెళ్లారు? తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులకు కారణాలు ఏమైవుంటాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఆలయ యాజమాన్యంపై ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. స్వామివారిపై భక్తితో 95 ఏళ్ల వృద్ధుడు హరి ముకుంద పండా ఆ ఆలయాన్ని నిర్మించారు. అందుకు అయిన వ్యయం మొత్తం ఆయన కుటుంబమే భరించడం విశేషంగా చెబుతున్నారు.

పలాస-కాశీబుగ్గ పట్టణంలోని అత్యంత ఖరీదైన 12 ఎకరాల భూమిలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంతోపాటు మరికొన్ని ఆలయాలను నిర్మించారు. మహావిష్ణువు దశావతరాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమితోపాటు నిర్మాణానికి అవసరమైన డబ్బు పూర్తిగా హరి ముకుంద పండా కుటుంబమే సమకూర్చింది. ఒడిశాకు చెందిన రాజ వంశానికి హరి ముకుంద పండా కుటుంబం కొన్ని దశాబ్దాలుగా కాశీబుగ్గలో స్థిరపడిందని స్థానికులు చెబుతున్నారు. వీరికి పట్టణంలో సుమారు వంద ఎకరాల భూమి ఉండగా, అందులో 12 ఎకరాలను ఆలయ నిర్మాణం కోసం కేటాయించారు. ఇందుకోసం ఆ భూమిని వెంకటేశ్వరస్వామి పేరున రిజిస్ట్రర్ చేయించారు.

ఖరీదైన భూమిలో ఒక్క రూపాయి కూడా విరాళం కింద సేకరించకుండా హరి ముకుంద పండా వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించడానికి కేవలం భక్తి ఒక్కటే కారణంగా చెబుతున్నారు. తిరుమల శ్రీవారికి పరమ భక్తుడైన పండా.. కొన్నేళ్ల క్రితం తిరుమల వెళ్లగా దర్శనం సరిగా అవ్వలేదు. సుమారు 9 గంటల పాటు దర్శనం కోసం నిరీక్షించాల్సిరావడం, కేవలం ఒక్క నిమిషం కూడా దేవుడిని మనస్ఫూర్తిగా దర్శించుకోలేదన్న ఆవేదనతో ఆయన ఇంటికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని తన తల్లి అయిన శతాధిక వృద్ధురాలు హరి ప్రియ పండా (సుమారు 110 ఏళ్లు)తో పంచుకోగా, శ్రీవారిని తనివి తీరా ప్రార్థించుకోడానికి సొంతంగా ఆలయ నిర్మించాలని ఆమె సూచించినట్లు సమాచారం.

గతంలో ఈ విషయాన్ని పలు పత్రికలు, మీడియా చానళ్లకు హరి ముకుంద పండా స్వయంగా వెల్లడించారు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన పండా కుటుంబం.. ఏటా సేద్యం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని ఆలయానికి వెచ్చించి భారీ ఆలయాన్ని నిర్మించింది. దాదాపు ఐదేళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగాయి. నాలుగు నెలల క్రితమే పూజల కోసం భక్తులను అనుమతించినట్లు స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా ఈ ఆలయానికి రెండు నుంచి మూడు వేల మంది మాత్రమే వస్తున్నారు. కానీ, నవంబరు 1న 25 వేల మంది తరలివచ్చారు.

భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి తరలిరావడానికి ఎన్నో ప్రత్యేక కారణాలు ఉన్నాయి. పండా నిస్వార్థ భక్తితో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీనివాసుడితో పాటు శివడు, దశావతారాలు, గరుత్మంతుడు, ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయం గోడలపై అద్భుతమైన శిల్పాలను తీర్చిదిద్దారు. అచ్చు తిరుమల శ్రీవారి ఆలయం నమూనాలో నిర్మించిన కాశీబుగ్గ ఆలయ ప్రాంగణాన్ని మినీ తిరుపతిగా తీర్చిదిద్దాలని పండా భావించారని చెబుతున్నారు. తిరుమలలో స్వామి వారిని సరిగా దర్శించుకోలేని వారు.. ఇక్కడ నచ్చినంత సేపు స్వామివారిని సేవించేలా ఉండాలని ఆకాంక్షించారు. ఇందుకు తగ్గట్లు నిర్మాణాలు చేయడంతో తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రచారమై భక్తుల ఆదరణ పొందింది.

ఇక కాశీబుగ్గ ఆలయంలో మూలవిరాట్ తిరుమల విగ్రహాన్ని పోలి ఉంటుంది. తిరుపతి నుంచే 9 అడుగుల 9 అంగుళాల దేవుడి విగ్రహం తెచ్చారు. శ్రీదేవి, భూదేవి విగ్రహాలను తిరుపతిలోనే చేయించారు. మిగిలిన విగ్రహాల కోసం రాజస్థాన్ నుంచి అనేక ఏకశిల విగ్రహాలను తీసుకువచ్చారు. రామాయణ, భాగవత, మహాభారతాలను ఆలయ గోడలపై విగ్రహాల రూపంలో పెట్టించారు. భక్తుల కోసం వసతి గృహాలు, కల్యాణ మండపాలు కూడా నిర్మించారు. గుడి "అందరూ చూడాలి, ఆనందించాలి, పూజించాలని కట్టాం'' అని గతంలో ఒకసారి పండా చెప్పారు.

ఇక పండా కుమారుడు ఢిల్లీలో మెడిసిన్ చదువుతున్నారు. తమ కుటుంబం శ్రీనివాసుడికి రాసిచ్చిన భూమిని భవిష్యత్తులో ఎవరూ అనుభవించడానికి వీలు లేదని కూడా పండా చెబుతున్నారు. దేవ దేవుడిపై భక్తితో 95 ఏళ్ల వయసులో మహా సంకల్పంతో నిర్మించిన ఆలయం భక్తుల అత్యుత్సాహం వల్ల తీవ్ర విషాదానికి వేదికగా మారిపోవడం పట్ల సర్వాత్రా విచారం వ్యక్తమవుతోంది.