Begin typing your search above and press return to search.

రూబియో పర్యటన వేళ ఎప్‌స్టీన్‌–పురి ఫొటో కలకలం.. బ్లాక్ మెయిల్ రాజకీయమా? రాహుల్ అందుకున్నాడు

అమెరికా విదేశాంగ ప్రతినిధి మార్కో రూబియో భారత పర్యటన వేళ దేశ రాజకీయాల్లో ఒక ఊహించని వివాదం రాజుకుంది.

By:  A.N.Kumar   |   21 Oct 2026 10:35 PM IST
రూబియో పర్యటన వేళ ఎప్‌స్టీన్‌–పురి ఫొటో కలకలం.. బ్లాక్ మెయిల్ రాజకీయమా?  రాహుల్ అందుకున్నాడు
X

అమెరికా విదేశాంగ ప్రతినిధి మార్కో రూబియో భారత పర్యటన వేళ దేశ రాజకీయాల్లో ఒక ఊహించని వివాదం రాజుకుంది. లైంగిక నేరాల కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని మరణించిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో భారత కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఉన్నారంటున్న ఒక పాత ఫొటో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దౌత్యపరంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఉన్నతాధికారి పర్యటన సమయంలోనే ఈ ఫొటో బయటకు రావడం.. దానిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించడంతో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది.

ఈ వ్యవహారంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ-ఆర్ఎస్ఎస్ వర్గాలపై విమర్శలు గుప్పించారు. రూబియో ముంబైకి వచ్చిన సమయంలోనే అమెరికా న్యాయశాఖ ఎప్‌స్టీన్, పురి ఫొటోను విడుదల చేసిందని పేర్కొంటూ వారు ఏ దేశద్రోహిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని భావిస్తున్నారంటూ ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ టైమింగ్‌ను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసులో అమెరికా న్యాయశాఖ విడుదల చేస్తున్న పత్రాలు, ఆధారాలలో భాగంగా ఈ ఫొటో ప్రచారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుతో పలువురు ప్రముఖుల పేర్లు ముడిపడటం వల్ల తాజా ఫొటో కూడా రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే ఒక ప్రముఖుడితో ఫొటో ఉన్నంత మాత్రాన నేరంలో భాగస్వామ్యం ఉన్నట్లు నిరూపితం కాదని.. ఫొటో తీసిన సందర్భం, దాని వెనుకున్న వృత్తిపరమైన నేపథ్యాన్ని వేరు చేసి చూడాల్సి ఉంటుందని చట్ట నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాగా ఎప్‌స్టీన్‌తో తనకున్న పరిచయంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి గతంలోనే వివరణ ఇచ్చారు. తన దౌత్యపరమైన విధుల నిర్వహణలో భాగంగా 'ఇంటర్నేషనల్ పీస్ ఇన్‌స్టిట్యూట్', 'ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ మల్టిలేటరలిజం' ప్రాజెక్టులకు సంబంధించిన వృత్తిపరమైన కార్యకలాపాల కోసమే ఎప్‌స్టీన్‌ను కలవాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించి మరింత స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఒకవైపు అమెరికా ఉన్నతాధికారి మార్కో రూబియో భారత్‌లో పర్యటిస్తూ వాణిజ్యం, శక్తి వనరులు, సాంకేతికత, రక్షణ రంగాలలో ద్వైపాక్షిక సహకారంపై కీలక చర్చలు జరుపుతున్నారు. సరిగ్గా ఇలాంటి ప్రాధాన్యత ఉన్న సమయంలో ఈ ఫొటో వివాదం తెరపైకి రావడం.. దానిని ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకోవడంతో దేశీయ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఫొటో వెనుక ఉన్న పూర్తి సందర్భం, లీగల్ ఆధారాలు వెలుగులోకి వస్తే తప్ప ఈ వివాదంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు.